సాయం ‘కరువు’ | Farmers unions demand food security through the provision of free rations | Sakshi
Sakshi News home page

సాయం ‘కరువు’

Nov 28 2026 5:20 AM | Updated on Nov 28 2026 5:20 AM

Farmers unions demand food security through the provision of free rations

పొరుగు రాష్ట్రాల్లో ఔదార్యం..

ఏపీలో ప్రకటనలకే పరిమితం

మహారాష్ట్రలో 42.30 లక్షల మంది కరువు బాధిత రైతులకు ఉచిత రేషన్‌   

మూడు నెలల పాటు 5 కిలోల చొప్పున బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసరాలు 

కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలూ అక్కడి రైతులకు ప్యాకేజీలు 

కానీ, ఏపీలో మాత్రం కరువు మండలాల ప్రకటనతో సరి  

బాధిత రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు 

15 రోజులకోసారి జరుగుతున్న కేబినెట్‌ సమావేశాల్లో రైతులను ఆదుకునే నిర్ణయాల్లేవు  

ఉచిత రేషన్‌ అందించి ఆహార భద్రత కల్పించాలని రైతు సంఘాల డిమాండ్‌

సాక్షి, అమరావతి: కరువు కోరల్లో చిక్కుకున్న అన్నదాతలను ఆదుకోవడంలో పొరుగు రాష్ట్రాలు ఉదారంగా వ్యవహరిస్తుంటే, మన దగ్గర చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కరువు మండలాల ప్రకటనతోనే సరిపెట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరువు బాధిత రైతు కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు మూడునెలల పాటు ఉచితంగా రేషన్‌ సరుకులు ఇవ్వాలని మహారాష్ట్ర కేబినెట్‌ తాజాగా నిర్ణయం తీసుకుంటే.. ఏపీలోని చంద్రబాబు సర్కారులో ఎలాంటి చలనంలేదు. 

రైతుకు పొరుగు రాష్ట్రాల భరోసా
ఖరీఫ్‌ సీజన్‌లో ఏపీలో 52.48 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. మహారాష్ట్రలో 19 శాతం, కర్ణాటకలో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆయా రాష్ట్రాలు కరువు మండలాలను ప్రకటించడమే కాకుండా, బాధిత రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాయి. కరువు మండలాల ప్రకటన వెలువడిన వెంటనే ఒక్కో రైతు ఖాతాలో కర్ణాటక ప్రభుత్వం రూ.2,500, మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 చొప్పున జమచేశాయి. గుజరాత్‌ ప్రభుత్వం అయితే హెక్టారుకు రూ.8,500 చొప్పున కరువు సాయం అందించింది.  రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా ప్రత్యేక కరువు ప్యాకేజీలను ప్రకటించి రైతులకు అండగా నిలిచాయి. పైగా.. కరువు ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌ చేయడంతో పాటు కొత్త రుణాల మంజూరుకు ఆదేశాలు జారీచేశాయి. వలసల నివారణకు ఉపాధి హామీ పథకం కింద పెద్దఎత్తున పని దినాలు సైతం కల్పిస్తున్నాయి. 

42.30 లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్‌ 
వర్షాభావంతో పంటలు దెబ్బతిని, ఆదాయం కోల్పోయిన రైతు కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి రాని, దారి్రద్యరేఖకు దిగువనున్న రైతు కుటుంబాలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 33 కరువు ప్రభావిత జిల్లాల్లో 42.30 లక్షల మందికి పైగా రైతులకు రానున్న మూడునెలల పాటు నెలకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పంపిణీ చేయనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.  

ఏపీలో అందని సాయం.. 
తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 412 కరువు మండలాలను ప్రకటించినప్పటికీ, ఆచరణలో రైతులకు ఒక్కపైసా సాయం అందడంలేదని విపక్షాలు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గడిచిన మూడునెలల్లో 15 రోజులకోసారి కేబినెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, కరువు బాధిత రైతులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోలేదని మండిపడుతున్నాయి. కరువు సాయంతో పాటు వరుస వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారం అందజేయడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. 

ప్రత్యేక కరువు ప్యాకేజీ కోసం పొరుగు రాష్ట్రాలు ఢిల్లీకి ప్రత్యేక బృందాలను పంపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధిస్తుంటే, కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిధుల సాధనలో చతికిలపడుతోందని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. గోదావరి–కృష్ణ–పెన్నా నదుల అనుసంధానం, రూ.లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్‌ హార్టీకల్చర్‌ హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, బడ్జెట్‌లో అందుకు తగిన నిధులు కేటాయించలేదని వారు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం ఒక్కపైసా సాయం చేయలేదు.. 
రైతులను పట్టించుకోవడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పొరుగు రాష్ట్రాలు ఉదారంగా స్పందిస్తుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర నటిస్తోంది. కరువు సాయం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి సాయం కూడా అందించలేదు.  – గుజ్జుల ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం 

అన్నదాతలకు ఆహార భద్రత కల్పించాలి.. 
రాష్ట్రం తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంది. 412 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినందున బాధిత రైతులకు తక్షణమే కరువు సాయం అందించాలి. ఆయా మండలాల్లో అదనపు పనిదినాలు కల్పించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలకు ఉచితంగా రేషన్‌ సరుకులు అందించి ఆహార భద్రత కల్పించాలి.  – వి. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవసాయ కారి్మక సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement