ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కోడూరులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయంతో గ్రామస్తుల సంబరాలు
పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయభేరి
తొలివిడత పోలింగ్ జరిగిన 3,189 పంచాయతీల్లో 1,142 చోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల గెలుపు
ఏకగ్రీవాలతో కలిపి వైఎస్సార్‌సీపీ నెగ్గినవి 1,182
అధికారం అండతో బరి తెగించి నామినేషన్లకు ముందే పచ్చ ముఠాల దౌర్జన్యాలు.. బలవంతంగా ఏకగ్రీవాలు
ఓటర్లకు బెదిరింపులు.. విపక్ష ఏజెంట్లపై దాడులు
కౌంటింగ్‌లో అక్రమాలు.. చెల్లని ఓట్ల పేరుతో మాయాజాలం
అధికారులపై ఒత్తిడి తెచ్చి పలుచోట్ల ఫలితాలు తారుమారు
వైఎస్సార్‌సీపీ గెలిచిన చోట.. చెల్లని ఓట్ల పేరిట కుతంత్రాలు
పంచాయతీ ఫలితాలపై టీడీపీ శిబిరంలో తీవ్ర కలకలం
ఇంత బల ప్రయోగం చేసినా ఏం లాభమని నైరాశ్యం
కుప్పంలో ఏకంగా 25 పంచాయతీలు కూటమి చేజారడంపై టీడీపీ పెద్దల్లో ఆందోళన
గన్నవరంలో కూటమిని వెనక్కి నెట్టి వైఎస్సార్‌సీపీ అద్భుత విజయంపై సర్వత్రా చర్చ
బాబు ప్రజా కంటక పాలనపై బట్టబయలైన వ్యతిరేకత
ఎమ్మెల్యేల సొంతూళ్లలోనే ఎదురు దెబ్బలతో కలవరం
మిగిలిన రెండు విడతలపై కూటమి నేతల్లో టెన్షన్
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేస్తూ మోసాల పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్ చెంప చెళ్లుమనిపించేలా పల్లె ప్రజలు తీర్పు ఇచ్చారు. అడుగడుగునా అధికార దుర్వినియోగం, నిర్బంధాలు, ఖాకీలతో బెదిరింపులు, బైండోవర్లు, అక్రమ కేసులు, కుట్రలతో నామినేషన్ల పర్వం నుంచి ఫలితాలు వెలువడే దాకా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన బాబు సర్కార్‌కు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. చంద్రబాబు ఎన్నికల మోసాలు, ఆటవిక పాలనపై వైఎస్సార్‌సీపీ సాగిస్తున్న ప్రజా పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్‌కు సైకిల్ కుదేలైంది. తొలి సంగ్రామంలో వైఎస్సార్‌సీపీ విజయభేరీ మోగించింది.
పంచాయతీల్లో మూడో వంతుకు పైగా చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే గెలుపొందారు. తొలి విడతలో 3,949 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడగా అసలు నామినేషన్లే వేయనివ్వకుండా దాదాపు 720 చోట్ల బలవంతంగా టీడీపీ కూటమి ఏకగ్రీవాలు చేసుకుంది. మిగిలిన వాటిల్లో ఎన్నికలు జరిగిన చోట్ల కూడా ఓటర్లను రానివ్వకుండా టీడీపీ గూండాలను, పోలీసులను మోహరించారు. బూత్‌లలో విపక్ష ఏజెంట్లు కూర్చోకుండా బెదిరిస్తూ.. ఒకవేళ ఎక్కడైనా కూర్చున్నా బయటకు గెంటేశారు. అధికార పార్టీ కౌంటింగ్‌లో లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడింది.
వైఎస్సార్ సీపీ కచ్చితంగా గెలుస్తుందనుకునే చోట ఇన్ వ్యాలిడ్ ఓట్లుగా ప్రకటించడం.. కరెంట్ నిలిపివేసి అధికారుల సహకారంతో అక్రమాలకు పాల్పడటం లాంటి ఎన్నికల అక్రమాలకు టీడీపీ నేతలు పాల్పడ్డారు. కూటమి ఇన్ని అరాచకాలకు పాల్పడినా... ఎన్నికలు జరిగిన చోట్ల 1,142 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ విజయ దుందుభి మోగించింది. మరో 40 చోట్ల పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా నెగ్గారు. అదే పారదర్శకంగా ఎన్నికలు జరిగితే టీడీపీ కూటమి అడ్రస్ గల్లంతయ్యేదని పరిశీలకులు చెబుతున్నారు.

అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో వైఎస్సార్‌సీపీ నాయకులు సంబరాలు
ప్రజాగ్రహానికి ప్రతిరూపం..
ఏకగ్రీవాల అనంతరం 26 జిల్లాల పరిధిలోని 3,189 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు గురువారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగగా, రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు లెక్కింపు కొనసాగుతూనే ఉంది. పోలింగ్ జరిగిన 3,189 గ్రామ పంచాయతీలకుగానూ 1,142 చోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు సర్పంచులుగా విజయం సాధించారు. ఏకగ్రీవంగా గెలిచిన 40తో కలిపి తొలివిడతలో మొత్తం 1,182 చోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు జయభేరి మోగించారు.
గ్రామాల్లో టీడీపీ గూండాల ఆగడాలు, ఎన్నికల అక్రమాలకు ఎదురొడ్డి పోరాడుతూనే తొలివిడత ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటడం గమనార్హం. రాయలసీమతోపాటు మార్కాపురం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున గెలుపొందారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోగా.. గత ప్రభుత్వ పథకాలనూ రద్దు చేసిన చంద్రబాబు సర్కారుపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలు గీటురాయిగా నిలుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీడీపీ కూటమికి తేరుకోలేని షాక్..
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ ఇవ్వడంతో టీడీపీ కూటమిలో తీవ్ర కలవరం మొదలైంది. పల్లె ప్రజల తీర్పు చూసి ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు కరువైంది. ఇంత అధికార బలాన్ని ప్రయోగించినా ఫలితాలు ఇలా రావడం ఏమిటని నిశ్చేషు్టలవుతున్నారు. బెదిరించి ఏకగ్రీవాలు.. నామినేషన్ల అడ్డగింత.. అధికారం.. పోలీసులు.. డబ్బు.. ఇలా అన్నీ వాడినా గ్రామ సీమల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటడం పచ్చ శిబిరాన్ని వణికిస్తోంది. పంచాయతీల్లోనే ఇలా ఉంటే రేపు సాధారణ ఎన్నికల్లో పరిస్థితి ఏమిటని మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు వరకు ఆందోళన చెందుతున్నారు.
ఏకగ్రీవాలు లేకపోతే మన గతేంటి?
ఏకగ్రీవాలను మినహాయిస్తే ఓటింగ్ జరిగిన పంచాయతీల ఫలితాలను చూసి టీడీపీ నేతలు బెంబేలెత్తుతున్నారు. టీడీపీతో దాదాపు సమానంగా వైఎస్సార్‌సీపీ పంచాయతీలను గెలుచుకోవడం వారిని నివ్వెరపరిచింది. ఇంత నిర్బంధం, ఒత్తిడి ఉన్నా ఓటింగ్ జరిగిన చోట్ల ప్రతి మూడు పంచాయతీల్లో ఒకటి వైఎస్సార్‌సీపీ ఖాతాలో పడిందని చర్చించుకుంటున్నారు. బాపట్ల, కృష్ణా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ మద్ధతుదారులు కూటమితో సమానంగా పంచాయతీలను గెలుచుకున్నారు.
తిరుపతి, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, ఏలూరు జిల్లాల్లోనూ అదే ట్రెండ్ కనిపించింది. అన్నమయ్య, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో బలవంతపు ఏకగ్రీవాలతో కూటమి గట్టెక్కినా సాధారణ ఎన్నికల్లో అలాంటి అవకాశం ఉండదన్న భయం ఆయా జిల్లాల ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. ‘ఏకగ్రీవాలతో పరువు నిలబెట్టుకున్నాం. అదే ఓటింగ్ జరిగి ఉంటే అసలు బండారం బయటపడేది’ అని అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక నేత వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
సొంత నియోజకవర్గాల్లో షాక్..
కీలక నియోజకవర్గాల్లో ఎదురు దెబ్బతిన్న కూటమి ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. గన్నవరంలో కూటమిని వెనక్కి నెట్టి వైఎస్సార్ సీపీ అద్భుత రీతిలో విజయాలు సాధించడం టీడీపీని నివ్వెరపరిచింది. బాబు పాలనపై ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత నెలకొందని మంత్రులు సైతం చర్చించుకుంటున్నారు. రాజధాని పక్కనే ఇలాంటి ఫలితం రావడం చంద్రబాబు ప్రజా కంటక పాలనకు నిదర్శనమని చర్చ సాగుతోంది. అనంతపురం అర్బన్, కోవూరు ఫలితాలు టీడీపీని ఆత్మరక్షణలో పడేశాయి. ధర్మవరంలో అధికార పక్షంతో సమానంగా వైఎస్సార్ సీపీకి పంచాయతీలు రావడం వారికి మింగుడు పడట్లేదు. రాప్తాడు, రాయదుర్గం, ఆదోని, పత్తికొండ, రాజంపేట, కోడూ రు, చింతలపూడి, పోలవరం ఎమ్మెల్యేలు హోరా హోరీ ఫలితాలతో తమ పట్టు పోయిందని ఆందోళన చెందుతున్నారు.
కుప్పం కుదుపుతో కలవరం..
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే 92 పంచాయతీల్లో ఏకంగా 25 కూటమి చేజారడం పార్టీ పెద్దలకు శరాఘాతంగా మారింది. సీఎం నియోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏమిటనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఏజెన్సీలో రంపచోడవరం, పాడేరు ప్రాంతాల్లో గిరిజనులు వైఎస్సార్‌సీపీ వైపే నిలవడంతో కూటమి నేతల్లో నిర్వేదం వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ప్రైవేటు సంభాషణల్లో మాత్రం ఇక తమ పని అయిపోయిందని చర్చించుకుంటున్నారు. ‘ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో చేస్తామన్నవి చేయలేదు. ఇస్తామన్న సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదు. అదే ఫలితాల్లో ప్రతిఫలించింది’ అని ఒక మంత్రి తన సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, 2029లో కష్టమే.. అని పార్టీ సీనియర్ నేత పేర్కొన్నట్లు తెలిసింది.
హెచ్చరికల వెనుక భయం
తాము గెలిచామని చెప్పుకుంటున్న పార్టీ అగ్ర నాయకత్వమే ‘అజాగ్రత్త వద్దు.. మరింత కష్టపడండి..’ అని శ్రేణులను హెచ్చరించడం టీడీపీలో నెలకొన్న భీతికి అద్దం పడుతోంది. పైకి మాత్రం ప్రభంజనం అని ఎల్లో మీడియాతో రాయించుకుంటూ, లోపల మాత్రం వణుకుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మిగిలిన రెండు విడతల ఎన్నికల్లో కోలుకోలేని షాక్ ఖాయమనే ఆందోళన టీడీపీ పెద్దల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
తారుమారు కుతంత్రాలు..
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఒకపక్క వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల విజయ భేరి కొనసాగుతుంటే.. మరోవైపు పచ్చమూకలు ఫలితాలను తారుమారు చేసి ప్రజా తీర్పును అపహాస్యం చేసేందుకు చివర వరకు యత్నించాయి. వాటిలో మచ్చుకు కొన్ని ఇవీ..
» అనకాపల్లి జిల్లా చోడవరంలో 14,381 ఓట్లు పోలవగా.. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడు 36 ఓట్లతో గెలిచినట్లు ఆర్వో ప్రకటించారు. ఆ తర్వాత కూటమి ఎమ్మెల్యే కౌంటింగ్ కేంద్రానికి రావడంతో ఎన్నికల ఫలితం ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీ సానుభూతిపరుడు 8 ఓట్లతో గెలిచినట్లు రాత్రి ఒంటి గంటకు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు రీకౌంటింగ్ కోరినా పట్టించుకోలేదు.
» అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మాకొడికి గ్రామంలో 1,431 ఓట్లు పోల్ కాగా.. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు 180 ఓట్ల ఆధిక్యంతో ఉన్నసమయంలో టీడీపీ అల్లరి మూకలు కౌంటింగ్ కేంద్రం వద్దకు చొరబడి కరెంట్ నిలిపివేశాయి. బ్యాలెట్ పత్రా లపై సిరా పోశాయి. చివరకు 210 ఓట్లు చెల్లనివిగా తేల్చి.. ఐదు ఓట్లతో టీడీపీ మద్దతుదారుడు గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారుడికి పడిన ఓట్లపై ఇంకు చల్లి ఫలితం మార్చేశారు.
» చిత్తూరు జిల్లా కుప్పం మండలం మంకలదొడ్డి గ్రామంలో 2,950 ఓట్లు పోల్ కాగా 156 చెల్లనివిగా తేల్చి టీడీపీ మద్దతుదారుడు 66 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు.
» నంద్యాల జిల్లా యెల్లూరులో 235 ఓట్లు చెల్లనివిగా తేల్చి టీడీపీ మద్దతుదారు 56 ఓట్లతో గెలిచారు.
» అనంతపురం జిల్లా హన్‌కన్‌హాల్ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు గెలుపొందగా.. ఎన్నికల ఫలితం తారుమారుకు టీడీపీ గూండాలు చివరకు యత్నించారు. 2,228 ఓట్లు పోలైన ఆ పంచాయతీల్లో ఏకంగా 710 చెల్లని ఓట్లుగా అధికారులు ప్రకటించినా, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడే అధిక్యంలో కొనసాగడంతో చివరకు 275 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు.
» కర్నూలు జిల్లా ఆలూరులో రాత్రి 8 గంటలకే ఓట్ల లెక్కింపు పూర్తయినా, గెలిచిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిని చెల్లని ఓట్ల పేరుతో అడ్డుకునేందుకు చివరి దాకా యత్నించారు. చేసేదిలేక రాత్రి ఒంటి గంట సమయంలో గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.
» కంబదూరు మండలం తిమ్మాపురంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలుపొందడంతో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్ని కల అధికారి (ఆర్వో)కి ఫోన్ చేసి దుర్భాషలకు దిగారు. టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించలేదని చెప్పు తో కొడతా.. లం.. కొ... అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయు డిని దూషించారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కళ్యాణదుర్గం మండలం మానిరేవు, పాలవాయి, కంబదూరు, కురాకులపల్లి, కుందుర్పి, మహంతపురం, సెట్టూరు, మాకోడికిల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలిచినా ఫలితాన్ని తారుమారు చేశారు.


