మా ఓట్లను టీడీపీ నేతలే వేసుకున్నారు
పోలింగ్ ఏజెంట్లను రానివ్వకుండా దౌర్జన్యకాండ సాగించారు
పోలీసులు, ఎన్నికల అధికారులు పూర్తిగా సహకరించారు
ఎన్నిక రద్దుచేసి రీపోలింగ్ నిర్వహించండి
పోలింగ్ బూత్ రికార్డులు, సీసీ కెమెరాలు భద్రపరచండి
పుల్లంపేట టి.కమ్మపల్లి జనసేన సానుభూతిపరుల ఆవేదన
తిరుపతి కలెక్టర్, డీపీఓ, ఆర్డీఓలకు వినతిపత్రం అందజేత
సాక్షి, తిరుపతి: ‘మేం కూటమి ప్రభుత్వం రావడానికి శాయశక్తులా కృషి చేశాం. అధికారం వచ్చాక మంచి జరగపోయినా పర్లేదు. కనీసం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా ఉపయోగించుకోలేని దౌర్భగ్యస్థితికి వచ్చాం’ అని తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం టి.కమ్మపల్లి పంచాయతీ జనసేన మద్దతుదారులైన ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి సర్పంచ్ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, ఓటర్లు మొత్తం సుమారు 50 మంది దాకా శుక్రవారం తిరుపతి కలెక్టరేట్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘టి.కమ్మపల్లి పంచాయతీ ఎన్నికల్లో మా ముగ్గురితోపాటు మా డమ్మీ అభ్యర్థులు ముగ్గురు సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాం. మా తరపు పోలింగ్ ఏజెంట్లు ఎవర్ని పోలింగ్ బూత్‌లలోకి రానివ్వకుండా టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. అదేంటని ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే దాటవేస్తూ సమయం వృథా చేశారు. పోలీసులను అడిగితే మాపైనే దురుసుగా ప్రవర్తించారు. దీంతో 1, 2, 3, 7, 8, 9, 10 బూత్‌లలో ఉన్న సుమారు 700 మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరిస్తూ రోడ్డుపై బైఠాయించారు.
గెలిచారని అక్రమంగా ప్రకటించిన అభ్యర్థి పార్వతి తరఫు ఏజెంట్లు తప్ప మిగిలిన ఏడు మంది సర్పంచ్ అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎలా పోలింగ్, కౌంటింగ్ నిర్వహిస్తారు’ అని ప్రశ్నించారు. జనసేన సానుభూతిపరులెవరూ ఓటు వేయకపోయినా టీడీపీ నేతలే అక్రమంగా ఆయా బూత్‌లలో ఓట్లు వేసుకున్నారని సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టాలని సవాల్ విసిరారు. టి.కమ్మపల్లి సర్పంచ్ ఎన్నికను వెంటనే రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన మొత్తం సీసీటీవీ ఫుటేజీ, పీఓ డైరీలను భద్రపరచాలని కోరారు. విధి నిర్వహణలో పక్షపాతంగా వ్యవహించిన ఆర్వో, పోలీసులపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీపీఓ, ఆర్డీఓ తదితరులకు సర్పంచ్ అభ్యర్థులు వినతి పత్రాలు అందజేశారు.
రీపోలింగ్ నిర్వహించాలి
నా భార్య అన్నపూర్ణమ్మ సర్పంచ్ పదవికి పోటీలో నిలిచినా మా తరఫుపోలింగ్ ఏజెంట్లను ఎవర్ని అనుమతించలేదు. ప్రశ్నిస్తే దౌర్జన్యం చేశారు. సర్పంచ్ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎలా పోలింగ్, కౌంటింగ్ నిర్వహిస్తారు. అక్రమంగా ప్రకటించిన ఫలితాలను రద్దు చేసి వెంటనే రీకౌంటింగ్ నిర్వహించాలి. – కుప్పాల రామకృష్ణయ్య, సర్పంచ్
అభ్యర్థి భర్త, ఎగువరెడ్డి పల్లి, పుల్లంపేట మండలం అధికారంలో ఉన్నా అన్యాయమేనా..
కూటమి ప్రభుత్వంలో ఉన్నా జనసేన నేతలు, కార్యకర్తలకు అన్యాయం జరుగు తోంది. కనీసం ఓటు హక్కు కూడా వినియోగించుకోలేకపోయాం. అధికారులు కావాలనే టీడీపీ నేతల ఇళ్ల మధ్య మా బూత్‌లను ఎన్నడూ లేనివిధంగా ఏర్పాటు చేశారు. దీంతో మా ఓట్లను వారే అక్రమంగా వేసుకున్నారు. – కొండేటి వెంకటరమణ, సర్పంచ్ అభ్యర్థి
తండ్రి, ఎగువరెడ్డిపల్లి, టి.కమ్మపల్లి పంచాయతీ ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినా..
గత 60 ఏళ్ల నుంచి కృష్ణంపల్లి నుంచి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో మా నాన్నమ్మ వెంకట కృష్ణమ్మతో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయించాను. అయినా మా ఏజెంట్లను రానివ్వకుండా పోటీచేసే హక్కును కాలరాశారు. ఎస్‌ఐ చిన్నరెడ్డప్పకి ఫిర్యాదుచేస్తే పట్టించుకోకపోగా మాపైనే దురుసుగా ప్రవర్తించారు. – తోట దినేష్‌రామ్‌చరణ్ రాయల్, కృష్ణంపల్లి, టి.కమ్మపల్లి పంచాయతీ


