ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
పూర్తయిన లబ్ధిదారుల జాబితా
రేషన్‌కార్డులు ఉన్న వారందరికీ చీరలు
హైదరాబాద్, బంజారాహిల్స్: జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధి కిందకు వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో ఇందిరమ్మ చీరల పంపిణీకి జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ సారి చీరలను పంపిణీ చేయడం జరిగింది. మహిళల అభివృద్ధికి అనుగుణంగా ఆకర్శణీయమైన చిలకపచ్చ రంగులో ప్రత్యేకంగా చీరలు రెండు రకాల డిజైన్లలో ప్రభుత్వం తయారు చేయించింది. ఖైరతాబాద్ జోన్ పరిధి కిందకు వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బోరబండ, యూసూఫ్‌గూడ, అమీర్‌పేట సర్కిళ్ల పరిధిలో లబ్ధిదారుల జాబితాను సంబంధిత అధికారులు రూపొందిస్తున్నారు.
ఈ ఐదు సర్కిళ్ల పరిధిలో తెల్లరేషన్ కార్డులు ఉన్న వారికి, మహిళా గ్రూపుల సభ్యులకు వీటిని పంపిణీ చేస్తున్నారు. గతంలో పాల పిట్టరంగు చీరలు పంపిణీ చేయగా, ఈ సారి చిలక పచ్చరంగులో కొత్త చీరలు రూపొందించారు. ఇంట్లోనే కాకుండా శుభకార్యాలు, పండుగల వేలల్లోనూ ధరించే నాణ్యతా ప్రమాణాలతో రూపొందించారు.
చిలకపచ్చ రంగు చీరలపై ఎరుపు రంగు పట్టు, జెరీ అంచుతో చీరలు ఆకట్టుకునేలా తయారు చేయడంతో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. చీరల కోసం వచ్చినప్పుడు మహిళల ఆధార్ కార్డులు చూపించాలి. చీర తీసుకునే సమయంలో లబ్ధిదారు ఫొటోను మొబైల్ యాప్‌లో సేకరిస్తారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని సర్కిళ్లలో ఇందుకు సంబంధిచిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. త్వరలోనే ఆయా సర్కిళ్లకు చీరలను తరలించనున్నారు.
ఇదీ చదవండి: క్షుద్ర పూజలు చేస్తాం.. నీ కూతురు తిరిగొస్తుంది!


