సాధారణంగా పండుగ సీజన్ వచ్చిందంటే.. బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ధనత్రయోదశి, దీపావళి, పెళ్లిళ్ల సమయంలో చాలామంది ఆభరణాలు కొనాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే.. ఈసారి బంగారం ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్న వారికి కొంత ఊరట లభించిందనే చెప్పాలి. ఎందుకంటే మార్కెట్‌లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,300 వద్ద ట్రేడవుతూ 0.42 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.3 శాతం తగ్గి 4,128.92 డాలర్లకు చేరింది. అమెరికాలో డిసెంబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 0.3 శాతం తగ్గి 4,148.50 డాలర్లకు పడిపోయింది.
బంగారం ధరలు తగ్గడానికి కారణం
గోల్డ్ రేటు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ముడి చమురు ధరల పెరుగుదల. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో.. బ్రెంట్ క్రూడ్ ధర ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరువలో కొనసాగింది.
చమురు ధరలు పెరిగితే.. రవాణా ఖర్చులు పెరుగుతాయి. వస్తువుల తయారీకి అయ్యే ఖర్చు కూడా అధికమవుతుంది. చివరకు ఇవన్నీ నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేందుకు వెనుకాడవచ్చు.
సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు.. చాలామంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. కానీ, బంగారం నుంచి వడ్డీ రూపంలో ఆదాయం రాదు. బ్యాంకు డిపాజిట్లు, బాండ్ల వంటి పెట్టుబడులపై వడ్డీ ఎక్కువగా లభిస్తే కొంతమంది పెట్టుబడిదారులు బంగారం కంటే వాటివైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గుతుంది, ధరలు కూడా తగ్గుతాయి.
అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయం
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్‌పై ఉంది. అక్టోబర్ 27, 28 తేదీల్లో జరిగే సమావేశంలో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి.
ఇటీవల ఫెడ్ అధికారులు చేసిన వ్యాఖ్యలతో అక్టోబర్‌లోనే వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు కొంత తగ్గాయి. అయితే.. డిసెంబర్‌లో రేట్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడర్లు భావిస్తున్నట్లు సమాచారం. సీఎంఎఫ్ ఫెడ్‌వాచ్ టూల్స్ అంచనాల ప్రకారం, డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపునకు 92 శాతం అవకాశం ఉందని అంచనా.
బంగారం ధరలు పెరుగుతాయా?, తగ్గుతాయా?
రానున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉంటాయనేది.. అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. చమురు ధరలు పెరుగుతూనే ఉండి, ద్రవ్యోల్బణం తగ్గకపోతే వడ్డీ రేట్లపై ఒత్తిడి కొనసాగవచ్చు. ఇది బంగారం ధరలకు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒకవేళ అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచకుండా కొనసాగిస్తూ.. భవిష్యత్తులో రేట్ల విషయంలో కొంత వెసులుబాటు ఉంటుందని సంకేతాలు ఇస్తే బంగారం ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రూ.10 కోట్లకు అమ్ముడైన కంప్యూటర్.. దీని ప్రత్యేకత ఏమిటంటే?


