రూ.10 కోట్లకు అమ్ముడైన కంప్యూటర్.. దీని ప్రత్యేకత ఏమిటంటే? | Rare Apple 1 Computer Sells For Rs 10 9 Crore With Steve Jobs Letter Wozniak Autograph | Sakshi
Sakshi News home page

రూ.10 కోట్లకు అమ్ముడైన కంప్యూటర్.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

Oct 21 2026 7:19 AM | Updated on Oct 21 2026 7:22 AM

Rare Apple 1 Computer Sells For Rs 10 9 Crore With Steve Jobs Letter Wozniak Autograph

నేడు మనం ఉపయోగిస్తున్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ల వెనుక ఎన్నో ఏళ్ల సాంకేతిక అభివృద్ధి ఉంది. అలాంటి కంప్యూటర్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న యాపిల్-1 కంప్యూటర్ ఇటీవల వేలంలో ఏకంగా రూ. 10.9 కోట్లకు అమ్ముడైంది.

యాపిల్ కంప్యూటర్ భారీ ధరకు అమ్ముడవ్వడానికి ప్రధాన కారణం, ఇది కేవలం చాలా పాతది అని మాత్రమే కాదు.. కంపెనీ మొదటి ఉత్పత్తుల్లో ఒకటి కావడం. ఈ కంప్యూటర్‌ను 'హ్యాట్‌ఫీల్డ్' యాపిల్-1 అని పిలుస్తారు. బోన్‌హామ్స్ అనే అంతర్జాతీయ వేలం సంస్థ దీనిని వేలానికి ఉంచగా, ఇద్దరు కొనుగోలుదారుల మధ్య దాదాపు 28 నిమిషాల పాటు పోటీ జరిగింది. చివరకు 1.15 మిలియన్ డాలర్లకు ఒకరు దీనిని సొంతం చేసుకున్నారు.

మదర్‌బోర్డుపై వోజ్నియాక్ సంతకం
ఈ కంప్యూటర్ వెనుక స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్‌ల కృషి ఉంది. 1976లో స్టీవ్ వోజ్నియాక్ ఈ కంప్యూటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్‌ను రూపొందించి నిర్మించారు. స్టీవ్ జాబ్స్ మాత్రం.. దానిని వ్యాపారపరంగా ప్రజలకు పరిచయం చేయడంపై దృష్టి పెట్టారు. వీరిద్దరి ఆలోచనలు, కృషి కలిసి యాపిల్ కంపెనీ ఎదుగుదలకు పునాది వేశాయి. ఈ కంప్యూటర్ మదర్‌బోర్డుపై వోజ్నియాక్ సంతకం కూడా ఉండటం దాని ప్రత్యేకతను మరింత పెంచింది.

వేలంలో కంప్యూటర్‌తో పాటు కొన్ని అరుదైన వస్తువులు కూడా ఉన్నాయి. వాటిలో 1978లో స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన ఒక లేఖ ముఖ్యమైనది. ఈ లేఖను కంప్యూటర్ అసలు కొనుగోలుదారుడైన ఫ్రెడ్ హ్యాట్‌ఫీల్డ్‌కు పంపించారు. ఇందులో కొత్తగా వచ్చిన యాపిల్-2 కంప్యూటర్‌కు మారే అవకాశం గురించి వివరించారు. దీంతో పాటు పాత వినియోగదారు పుస్తకాలు, హార్డ్‌వేర్ భాగాలు, యాపిల్-1 యజమానుల ప్రత్యేక క్లబ్‌లో చేరేందుకు పంపిన ఆహ్వాన పత్రం కూడా ఉన్నాయి.

ఆశ్చర్యపరిచిన స్క్రీన్‌పై అక్షరాలు
ఈ కంప్యూటర్ మరో కారణంతో కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. అదేమిటంటే.. యాపిల్-1 రిజిస్ట్రీలో దీనిని 48వ కంప్యూటర్‌గా నమోదు చేశారు. ప్రారంభంలో తయారైన యాపిల్-1 కంప్యూటర్లలో ప్రస్తుతం 75 కంటే తక్కువ మాత్రమే మిగిలి ఉన్నాయని అంచనా. అందుకే ఇలాంటి కంప్యూటర్లు సేకరణదారులకు ఎంతో విలువైనవిగా మారాయి.

స్టీవ్ వోజ్నియాక్ తన ఐవోజ్ అనే ఆత్మకథలో కంప్యూటర్ అభివృద్ధికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. కీబోర్డుపై టైప్ చేసిన అక్షరాలు వెంటనే స్క్రీన్‌పై కనిపించడం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. ఆ రోజుల్లో ఇది ఒక గొప్ప సాంకేతిక ముందడుగు. నేడు మనం కంప్యూటర్లపై చేసే పనులు సాధారణంగా అనిపించినా, వాటి వెనుక ఇలాంటి ఎన్నో ప్రయోగాలు, ఆవిష్కరణలు ఉన్నాయి.

ఇదీ చదవండి: 109 ఏళ్ల క్రితం బ్రిటన్‌కు ఇచ్చిన డబ్బు.. ఇప్పటికీ తేలని లెక్క!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement