జనవరిలో హాకీ ఇండియా లీగ్‌ | Hockey India League in January | Sakshi
Sakshi News home page

జనవరిలో హాకీ ఇండియా లీగ్‌

Nov 27 2026 4:13 AM | Updated on Nov 27 2026 4:13 AM

Hockey India League in January

డిసెంబర్‌ 7న ఆటగాళ్ల వేలం  

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) తదుపరి సీజన్‌ జరగనుంది. దానికి ముందు డిసెంబర్‌ 7న ప్లేయర్ల వేలం నిర్వహించనున్నారు. హెచ్‌ఐఎల్‌ పురుషుల విభాగంలో ఆరు ఫ్రాంచైజీలు, మహిళల విభాగంలో నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ప్లేయర్ల వేలానికి ముందు నవంబర్‌ 29 నుంచి ఆటగాళ్ల బదలీ ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 2 వరకు ఆటగాళ్ల బదిలీకి అవకాశం ఉంటుంది. అనంతరం ఫ్రాంచైజీలు తాము విడుదల చేసిన ప్లేయర్ల జాబితాను అందించాల్సి ఉంటుంది. అదే రోజు సాయంత్రం వేలంలో పాల్గొనే ప్లేయర్ల జాబితా విడుదల కానుంది. 

రాంచీ రాయల్స్‌ పురుషుల జట్టు ఆటగాళ్లతో పాటు హెచ్‌ఐఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ జట్టులోని ఆటగాళ్లు కూడా వేలానికి అందుబాటులో ఉండనున్నారు. హెచ్‌ఐఎల్‌ సీజన్‌ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత మహిళల హాకీ జట్టు కెపె్టన్‌ సలీమా టెటె ఆనందం వ్యక్తం చేసింది. ‘భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవం గడించేందుకు ఈ లీగ్‌ ఎంతగానో ఉపకరించనుంది. నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకునేందుకు ఇది చక్కటి వేదిక. దీంతో పాటు పలువురు కొత్త ప్లేయర్లు ఈ లీగ్‌ ద్వారా వెలుగులోకి వస్తారు. అది మరింత మంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది’ అని సలీమా పేర్కొంది. 

భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ... ‘వచ్చే ఏడాది ఆరంభంలోనే హాకీ ఇండియా లీగ్‌ జరగడం ఆనందంగా ఉంది. ప్రతీ సీజన్‌లో పోటీ పెరుగుతోంది. అంతర్జాతీయ స్టార్‌ ప్లేయర్లతో కలిసి ఆడటం మన ప్లేయర్లకు లాభం చేయనుంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో ఆ అనుభవం పనికివస్తుంది’ అని అన్నాడు. ప్లేయర్ల కోసం పురుషుల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా రూ. 4 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉండగా... మహిళల విభాగంలో రూ. 2 కోట్ల పరిమితి విధించారు. రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల కనీస ధరతో ప్లేయర్లు వేలంలో పాల్గొననున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement