లండన్: గతంలో బ్రిటిష్, రష్యా ప్రభువులు, అమెరికన్ బ్యాంకర్ జాన్ పియర్‌పాంట్(జేపీ) మోర్గాన్ వంటి వారి వద్ద ఉన్న ట్యూరీన్ ఇది. సూప్ వంటి వాటిని అథితులకు వడ్డించేందుకు ఈ పాత్రను వాడేవారు. ఇది ఇప్పుడు, డిసెంబర్ ఒకటిన లండన్‌లోని క్రిస్టీస్ సంస్థలో జరిగే వేలానికి సిద్ధంగా ఉంది. కనీసంగా రూ.74 కోట్లు పలకవచ్చని అంచనా. ఫ్రాన్స్‌కు చెందిన కళాకారుడు జస్ట్–ఔరెల్ మీసోనియర్ 1730లో దీనిని ‘రొకొకో’శైలిలో రూపొందించారు.
ఈయనే తయారు చేసిన మరో ట్యూరీన్ ఇప్పుడు క్లీవ్‌లాండ్ మ్యూజియంలో ఉంది. వెండితో తయారైన ఈ ట్యూరీన్ బరువు సుమారు 20 కిలోలు కాగా, వెడల్పు 46 సెంటీమీటర్లు. గవ్వ ఆకారంలో ఉన్న ఈ పాత్ర మూతపై మొక్కలు, జంతువుల కళాకృతులున్నాయి. అర్జెంటినాకు చెందిన సంపన్న కుటుంబం బ్లాక్వియర్–అరియెటా దీనిని విక్రయానికి ఉంచింది.


