లిబియాలో రష్యా నౌకను ముంచింది మేమే  | Ukraine sinks Russian warship off Libya in latest expansion of the war | Sakshi
Sakshi News home page

లిబియాలో రష్యా నౌకను ముంచింది మేమే 

Nov 24 2026 6:03 AM | Updated on Nov 24 2026 6:05 AM

Ukraine sinks Russian warship off Libya in latest expansion of the war

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటన  

కీవ్‌: లిబియా తీరంలో ఉన్న రష్యా యుద్ధ నౌకపై దాడి చేసింది తామేనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం ప్రకటించారు. ఆదివారం మధ్యధరా సముద్ర తీర బెంఘాజీ నౌకాశ్రయంలో లంగరేసి ఉన్న ఈ మెర్క్యురీ అనే నౌకను ముంచి వేశామని చెప్పారు. ఇదొక ప్రత్యేక ఆపరేషన్‌ అని అభివరి్ణంచారు. ఇందుకోసం దేశీయంగా అభివృద్ధి చేసుకున్న ఏడు డ్రోన్లను వినియోగించామని చెప్పారు. రష్యా నేవీలోని కొత్త నౌకల్లో ఇదొకటని చెప్పారు. సైబీరియా నుంచి లిబియా వరకు రష్యా ఆస్తులను నాశనం చేయగల సత్తా తమకుందని నిరూపించామన్నారు. 

ఆ దేశ దురాక్రమణకు ప్రతిస్పందనగానే సొంతంగా సమకూర్చుకుంటున్న ఆయుధ శ్రేణితో లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నామంటూ ప్రకటించారు. సోమవారం బెర్లిన్‌లో జరిగిన నాటో సమావేశాన్ని ఉద్దేశించి జెలెన్‌స్కీ వర్చువల్‌గా మాట్లాడారు. రష్యాలోని రొస్టొవ్‌లో ఉన్న చమురు శుద్ధి ప్లాంట్‌పై ఆరు గంటలపాటు డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపి పనికి రాకుండా చేశామన్నారు. రష్యా ఆయుధ సరఫరా కోసం వాడే ఎంవీ అంగారా అనే నౌకతోపాటు, కేఏ–27 అనే హెలికాప్టర్‌ను ధ్వంసం చేసినట్లు ప్రకటించారు.

 ఉక్రెయిన్‌ మార్చిలో మధ్యధరా సముద్ర జలాల్లో ఉన్న రష్యా నౌకపై డ్రోన్‌ దాడి జరిపి, ముంచేసింది. మరోవైపు, రష్యా యుద్ధ నౌకపై డ్రోన్‌ దాడి ఘటనకు లిబియాలోని ప్రభుత్వం స్పందించింది. ‘డ్రోన్‌లను ముందుగానే గుర్తించి, అప్రమత్తమయ్యాం. నాలుగింటిని కూల్చి వేశాం. రెండు డ్రోన్లు మాత్రం నౌకను ఢీకొట్టాయి. ఈ ఘటనతో తీవ్రంగా దెబ్బతిన్న మెర్క్యురీ యుద్ధ నౌక మునిగిపోయింది. దీంతో అందులోని పది మంది గాయపడ్డారు’ అని వివరించింది. అయితే, రష్యా నౌక ఎందుకు వచ్చింది? అందులో ఏమున్నది? అనే విషయాలను వెల్లడించలేదు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement