అదుపులోకి తెచ్చేందుకు ఫిన్లాండ్, ఎస్టోనియా, రష్యా సిబ్బంది ప్రయత్నాలు
హెల్సింకి: బాల్టిక్ సముద్రంలోని ఫిన్లాండ్ జలసంధి గుండా వెళ్తుండగా దాడికి గురైన రష్యా సరుకు నౌకలో మంటలు అదుపులోకి రాలేదు. స్పార్టా–2 అనే పేరున్న ఈ నౌక బాల్టిక్ సముద్ర తీర నగరం కలినిన్‌గ్రాడ్‌కు వెళ్తుండగా శనివారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడి ఉంటుందని ఫిన్లాండ్ అనుమానం వ్యక్తం చేసింది. తమ సుర్సారీ దీవికి 50 కిలోమీటర్ల దూ రంలో ఉండగా ఉదయం 8.50 సమయంలో ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం అందిందని తెలిపింది.
తమ స్పార్టా–2 రవాణా నౌకపై రెండు డ్రోన్లు దాడి జరిపినట్లు గుర్తించామని కలినిన్‌గ్రాడ్ గవర్నర్ అలెక్సీ చెప్పారు. దాడి అనంతరం నౌకలో మంటలు చెలరేగడంతో ఫిన్లాండ్ సరిహద్దు రక్షణ దళం రంగంలోకి దిగింది. మంటలను అదుపులోకి తెచ్చి, నౌకను మునిగిపోకుండా చర్యలు తీసుకుంటోంది. ఎస్టోనియా, రష్యా సిబ్బంది కూ డా రంగంలోకి దిగారు. ఈ ఘటన కారణంగా ఇరుగ్గా ఉండే ఈ ప్రాంతంలో నౌకల సంచారానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపింది.
పర్యావరణానికి, ప్రజలకు ఎటువంటి అపా యం లేదని పేర్కొంది. కొద్దిసేపు మాత్రం ఆ ప్రాంతంలో విమాన, నౌకల రాకపోకలపై నియంత్రణలను అమలు చేశామన్నారు. కాగా, నౌకలోని సరుకును బయటకు తరలించాల్సిన అవసరం లేదని రష్యా అధికారులు తెలిపారు. ఆ నౌకలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, వారు రష్యాకు వెళ్తున్నారని ఫిన్లాండ్ తెలిపింది.
సరుకు రవాణా నౌకపై జరిగిన దాడిపై తమ సరిహద్దు విభాగం దర్యాప్తు జరుపుతుందని, సంబంధిత ఇతర ప్రభుత్వాల అధికారులు సహకరిస్తారని ఫిన్లాండ్ ప్రభుత్వం తెలిపింది. రష్యాకు చెందిన కంపెనీ నిర్వహిస్తున్న స్పార్టా–2 నౌకపై అమెరికా, ఉక్రెయిన్ ప్రభుత్వాల ఆంక్షలు అమలవుతున్నాయి. తమ సంస్థ 2011లో రష్యా రక్షణ శాఖ నియంత్రణలో ఏర్పాటైందని, 2015 నుంచి మిలటరీ కన్‌స్ట్రక్షన్ కాంప్లెక్స్ పరిధిలో పనిచేస్తోందని ఆ కంపెనీ వెబ్‌సైట్ పేర్కొంది. ఇలా ఉండగా, ఈ నెల ఆరంభంలో ఫిన్లాండ్ జలసంధి గుండా వెళ్తున్న ఓ రష్యా నౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. తాజా ఘటనపై ఉక్రెయిన్ స్పందించలేదు.


