విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో బాలేంద్ర షా భేటీ
నేడు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రదానమంత్రి హోదాలో ఆయన భారత్‌లో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద స్వాగతం పలికారు. ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో బాలేంద్ర షా సమావేశం కాబోతున్నారు.
భారత్, నేపాల్ మధ్య సంబంధాల్లో పురోగతితోపాటు ఇంధనం, జలవిద్యుత్, రైల్వేలు, అనుసంధానం, మౌలిక సదుపాయాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై వారు చర్చించనున్నారు.
ఆదివారం సాయంత్రం బాలేంద్ర షాతో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ అయ్యారు. నేపాల్‌తో ఉన్న ప్రత్యేక స్నేహాన్ని భారతదేశం ఎంతో గౌరవిస్తోందని జైశంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సోమవారం ఇరువురు ప్రధానమంత్రుల మధ్య జరిగిన సమావేశం.. రాబోయే సంవత్సరాల్లో ఇరుదేశాల అనుబంధాన్ని గణనీయంగా పెంచేందుకు దోహదపడనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చర్చల అనంతరం ఇద్దరు ప్రధానమంత్రులు నేపాల్‌లో పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. వివిధ రంగాల్లో సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉంది. నేపాల్‌లో ఈ ఏడాది మార్చిలో ప్రధానిగా బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా ప్రధాని మోదీ ఆయనకు ఆహ్వానం పంపారు. దీనిని నేపాల్ అంగీకరించింది. ఇది బాలేంద్ర షా చేపట్టనున్న మొదటి ద్వైపాక్షిక విదేశీ పర్యటన.


