‘మోదీ సలహాతో భారీ బంగారు నష్టం తప్పింది’ | Gold Traders thank PM Modi as gold price falls 65 lakh per kg | Sakshi
Sakshi News home page

‘మోదీ సలహాతో భారీ బంగారు నష్టం తప్పింది’

Nov 22 2026 4:40 PM | Updated on Nov 22 2026 4:45 PM

Gold Traders thank PM Modi as gold price falls 65 lakh per kg

బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సలహా లక్షలాది మంది వ్యాపారులను భారీ నష్టాల నుంచి కాపాడిందని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 22న మోదీకి లేఖ రాసిన సంస్థ.. ఆయన సూచనను పాటించడం వల్ల అధిక ధరలకు బంగారం కొనుగోలు చేయకుండా వ్యాపారులు నష్టాల నుంచి తప్పించుకున్నారని తెలిపింది.

బంగారం ధరలు కిలోకు సుమారు రూ.1.90 కోట్ల వద్ద ఉన్న సమయంలో మోదీ కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారని సీటీఐ గుర్తుచేసింది. ఆ తర్వాత ధరలు కిలోకు రూ.1.25 కోట్ల స్థాయికి పడిపోయాయని పేర్కొంది. అంటే కిలో బంగారంపై సుమారు రూ.65 లక్షల తగ్గుదల నమోదైందని తెలిపింది. ఆ సమయంలో వ్యాపారులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి ఉంటే భారీ నష్టాలను ఎదుర్కొనేవారని, అప్పులపాలై దివాలా తీసే పరిస్థితి వచ్చేదని లేఖలో వివరించింది.

దేశవ్యాప్తంగా లక్షలాది ఆభరణాల వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బంగారం విక్రయదారులు ఈ సూచనతో ప్రయోజనం పొందారని సీటీఐ పేర్కొంది. ప్రధాని సలహా తమను కాపాడిందంటూ పలువురు వ్యాపారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వెల్లడించింది.

మరోవైపు, బంగారం ధరలు తగ్గడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్‌లో సామాన్య కుటుంబాలకు ఊరట లభిస్తోందని సంస్థ తెలిపింది. సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్న నేపథ్యంలో తక్కువ ధరలకు బంగారం కొనుగోలు చేసే అవకాశం కలిగిందని పేర్కొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్లలో ఊహాగానాలు, నిల్వల నియంత్రణ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేయాలని సీటీఐ కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement