భారతదేశంలో బంగారానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మన దేశంలో చాలామంది బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా.. భవిష్యత్తుకు భద్రతను ఇచ్చే పెట్టుబడిగా కూడా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు.. ఇలా అన్ని శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంలో భాగంగా మారిపోయింది. అయితే.. గోల్డ్ కొనుగోలు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో.. ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు.
మోదీ విజ్ఞప్తి
మే నెలలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే.. భారతదేశం తన అవసరాలకు సరిపడా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతుల కోసం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగి భారతదేశంపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడింది.
ఇలాంటి సమయంలో బంగారం దిగుమతులను తగ్గిస్తే దేశానికి కొంత విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని మోదీ భావించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని గుర్తుచేశారు. 1965లో దేశం ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో శాస్త్రి ప్రజలకు వారంలో ఒకరోజు భోజనం మానేయాలని పిలుపునిచ్చారు. అప్పట్లో ప్రజలు ఆయన మాటను గౌరవించి సహకరించారు. అదే విధంగా ఇప్పుడు తాను బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కోరితే ప్రజలు స్పందించారని మోదీ అన్నారు. ప్రజలు తన విజ్ఞప్తిని పాటించి తమ డబ్బును ఆదా చేసుకున్నామని తనతో చెబుతున్నారని పేర్కొన్నారు.
గణనీయమైన మార్పు!
మోదీ విజ్ఞప్తి చేసిన తరువాత.. బంగారం ధరల్లో కూడా గణనీయమైన మార్పు కనిపించింది. మే నెలలో 9న ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,250 ఉండగా.. ఇప్పుడు రూ.12,508 వద్దకు చేరింది. అంటే గ్రాము ధర స్వల్ప కాలంలోనే 2742 రూపాయలు తగ్గింది.
బంగారం ధరలు తగ్గడానికి ప్రజల ప్రధాన కారణం ప్రజలు కొనుగోళ్లు తగ్గించడమే. అంతే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, దిగుమతి సుంకాలు వంటి అంశాలు కూడా గోల్డ్ రేటును ప్రభావితం చేశాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవడం మరింత ఖరీదైనదిగా మారిపోయింది.
తగ్గిన దిగుమతులు
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు భారతదేశ బంగారం దిగుమతులు, గత ఏడాదితో పోలిస్తే దాదాపు 40 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 41.24 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి కాగా, ఈసారి అది 24.78 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య భారతదేశంలో బంగారం డిమాండ్ 29 శాతం తగ్గి 162 టన్నులకు చేరింది. బంగారు ఆభరణాల డిమాండ్ కూడా 20 శాతం తగ్గింది.
ఇదీ చదవండి: కొత్త ట్రెండ్.. వారానికి నాలుగు రోజులే పని!


