సాఫ్ట్‌వేర్ జాబ్స్ వల్ల వీకెండ్స్ అంటూ శని, ఆదివారాలను సెలవు దినాలుగా మనం పరిగణిస్తాం. కానీ.. ఒకప్పుడు సెలవంటే ఆదివారమే. వారమంతా కష్టపడి వారాంతంలో దొరికే ఆ ఒక్కరోజే ఉద్యోగికి ఊరట. అయితే ఇప్పుడు ఉద్యోగులకి మరింత ఊరటనిచ్చే మరో అంశం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదే 'ఫోర్ డే వర్కింగ్ వీక్'. అంటే వారానికి నాలుగు రోజులు మాత్రమే పని దినాలు.
ఇప్పటికే బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు మరికొన్ని దేశాలలో పలు కంపెనీలు ప్రయోగాత్మకంగా ఈ కొత్త పద్ధతిని అనుసరించాయి. 'నేచర్ హ్యూమన్ బిహేవియర్' జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ విధానం అమలు చేసిన కంపెనీలలో ఫలితాలు ఆశాజనకంగా రావడంతో ఏకంగా 90శాతానికి పైగా సంస్థలు దీన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పని దినాలు తగ్గినా కంపెనీల ఉత్పాదకత తగ్గకపోగా, కొన్ని సంస్థల్లో రెవెన్యూ 8 శాతం వరకు పెరిగింది. వారాంతానికి అదనంగా మరోరోజు దొరకడం, ఉద్యోగులు తమ కుటుంబాలతో గడపడం వల్ల వారిలో ఒత్తిడి తగ్గి, సృజనాత్మకత పెరిగిందని నేచర్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్ పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధికంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పని చేస్తున్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. మన దేశంలో కూడా ఈ పద్ధతి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇదీ చదవండి: భారత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!


