విదేశీ పెట్టుబడులకు రెడ్‌ కార్పెట్‌.. | SEBI Big Move Foreign Investors Set for Major Relief as India Plans | Sakshi
Sakshi News home page

విదేశీ పెట్టుబడులకు రెడ్‌ కార్పెట్‌..

Nov 21 2026 8:58 AM | Updated on Nov 21 2026 9:03 AM

SEBI Big Move Foreign Investors Set for Major Relief as India Plans

దేశీయ మూలధన మార్కెట్లలో విదేశీ నిధుల ప్రవాహాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు భారత సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు (సెబీ) అత్యంత కీలకమైన విధానపరమైన సంస్కరణకు తెరతీసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై (ఎఫ్‌పీఐ) నియంత్రణ భారాన్ని తగ్గిస్తూ 2023లో అమల్లోకి తెచ్చిన ‘అడిషనల్‌ డిస్‌క్లోజర్‌ ఫ్రేమ్‌వర్క్‌-ఏడీఎఫ్‌’ పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన సంప్రదింపుల పత్రం (కన్సల్టేషన్‌ పేపర్‌) మార్కెట్‌ వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

కఠిన నిబంధనల నుంచి విముక్తి

ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడీఎఫ్‌ నిబంధనల ప్రకారం.. ఒకే కార్పొరేట్‌ గ్రూపులో తమ మొత్తం భారతీయ ఈక్విటీ ఆస్తుల విలువలో (ఏయూఎం) 50 శాతానికి మించి పెట్టుబడి పెట్టిన ఎఫ్‌పీఐలు, లేదా దేశీయ మార్కెట్లలో రూ.50 వేల కోట్లకు పైగా ఈక్విటీ పెట్టుబడులు కలిగిన సంస్థలు కఠినమైన ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. ఎలాంటి కనీస వాటా పరిమితి లేకుండా తమ సంస్థలోని తుది వ్యక్తిగత యజమానుల (నేచురల్‌ పర్సన్స్‌) వరకు పూర్తి వివరాలను సెబీకి సమర్పించాల్సి వస్తోంది.

అమెరికా, బ్రిటన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, జపాన్‌ వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ప్రయోజన యాజమాన్య (బెనిఫిషియల్‌ ఓనర్‌షిప్‌) గుర్తింపునకు సాధారణంగా 25 శాతం వాటా పరిమితిని అనుసరిస్తున్నారు. కానీ భారత్‌లో మనీలాండరింగ్‌ నిరోధక నిబంధనల కింద 10 లేదా 15 శాతం వాటా పరిమితితో పాటు, ఏడీఎఫ్‌ పేరుతో సున్నా శాతం పరిమితి కూడా అమలవుతుండటం విదేశీ సంస్థలకు భారంగా మారింది.

నిధుల ఉపసంహరణకు అడ్డుకట్ట వేసే వ్యూహం

గత రెండేళ్లుగా భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతుండటం విధాన నిర్ణేతలను ఆలోచనలో పడేసింది. 2024 అక్టోబర్‌ నుంచి 2026 అక్టోబర్‌ మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.5.61 లక్షల కోట్లకు (62.24 బిలియన్‌ డాలర్లు) పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. ఈ భారీ అవుట్‌ఫ్లో రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. పెట్టుబడుల ఉపసంహరణకు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కారణమైనప్పటికీ ఇక్కడి సంక్లిష్టమైన నిబంధనలు కూడా విదేశీ ఫండ్లను వెనక్కి తగ్గేలా చేస్తున్నాయని సెబీ గుర్తించింది. ముఖ్యంగా హెడ్జ్‌ ఫండ్లు, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ వంటి బహుళ అంచెల నిర్మాణాలు కలిగిన గ్లోబల్‌ ఫండ్లు భారత్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి రావడం, వాటాదారుల వివరాలు మారినప్పుడల్లా నివేదికలు సమర్పించడం వాటి నిర్వహణ వ్యయాలను పెంచేసింది.

ఓడీఐ సబ్‌స్క్రైబర్లకూ వర్తింపు..

తాజా ప్రతిపాదన కేవలం ఎఫ్‌పీఐలకే పరిమితం కాకుండా ఆఫ్‌షోర్‌ డెరివేటివ్‌ ఇన్‌స్ట్రుమెంట్ల (ఓడీఐ) సబ్‌స్క్రైబర్లు, సెగ్రిగేటెడ్‌ పోర్ట్‌ఫోలియోలకు కూడా వర్తించనుంది. ఈ సంస్కరణలపై మార్కెట్‌ భాగస్వాములు, నిపుణులు డిసెంబర్‌ 11, 2026 వరకు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. అనంతరం సెబీ బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. నిబంధనల సడలింపు ద్వారా విదేశీ నిధుల ప్రవాహం మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్‌ పారదర్శకతకు భంగం కలగకుండా అక్రమ నిధుల (రౌండ్‌ ట్రిప్పింగ్‌) కట్టడిని సమర్థవంతంగా కొనసాగించడం నియంత్రణ సంస్థ ముందున్న అసలు పరీక్ష.

ఇదీ చదవండి: పాదరసం నుంచి బంగారం తయారీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement