ప్రభుత్వ బ్యాంకులకు జోష్‌!  | IOB, Punjab and Sind Bank, Central Bank gear up for share sales | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బ్యాంకులకు జోష్‌! 

Nov 12 2026 5:10 AM | Updated on Nov 12 2026 5:10 AM

IOB, Punjab and Sind Bank, Central Bank gear up for share sales

నిధుల సమీకరణకు మూడు బ్యాంకులు రెడీ 

క్విప్‌ ద్వారా ప్రభుత్వ వాటా తగ్గింపు 

పబ్లిక్‌కు కనీస వాటా పెంపునకు వీలు 

ముంబై: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులలో ప్రభుత్వం వాటాలు విక్రయించనుంది. తద్వారా ఆయా బ్యాంకులలో వాటాను తగ్గించుకోనుంది. ఇందుకు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌)కి తెరతీయనున్నట్లు వివిధ ప్రభుత్వ బ్యాంకుల అత్యున్నత అధికారులు తాజాగా వెల్లడించారు. 

ఈ జాబితాలో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ), పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేరాయి. క్విప్‌ ద్వారా మూలధన బేస్‌ను పటిష్టపరచుకోవడం, బిజినెస్‌ వృద్ధికి మద్దతివ్వడం, క్రమానుగతంగా ప్రభుత్వ వాటాను తగ్గించుకోవడం తదితర ప్రణాళికలు ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేయనున్నాయి. 

సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్‌ సంస్థలు పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా కలి్పంచవలసిన విషయం విదితమే. మార్కెట్లు బలపడుతుండటం, లిక్విడిటీ తదితర సానుకూలతల నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్‌–మార్చి)లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో నిధుల సమీకరణ ఊపందుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. 

ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో క్విప్‌ ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించేందుకు అనుమతి లభించినట్లు పీఎస్‌యూ దిగ్గజం ఐవోబీ ఎండీ, సీఈవో అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులనూ దాదాపు పొందినట్లు వెల్లడించారు. వెరసి ప్రస్తుత క్వార్టర్‌(అక్టోబర్‌–డిసెంబర్‌) లేదా చివర్లో(జనవరి–మార్చి) ప్రతిపాదిత క్విప్‌ను చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరిస్తే, ఇందుకు 6 శాతం ప్రభుత్వ వాటా విక్రయించే వీలుంది. దీంతో బ్యాంకులో ప్రభుత్వ వాటా ప్రస్తుత 92.44 శాతం నుంచి దాదాపు 86 శాతానికి దిగిరానున్నట్లు వివరించారు. 

పంజాబ్‌ అండ్‌ సింద్‌ 
షేర్ల ప్లేస్‌మెంట్‌(క్విప్‌) మార్గంలో నిధుల సమీకరణ చేపట్టే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ పంజాబ్‌ అండ్‌ సింద్‌ ఇప్పటికే తెలియజేసింది. ఇందుకు అనుమతులు పొందడంతోపాటు.. మర్చంట్‌ బ్యాకర్లను నియమించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పెట్టుబడికి ఆసక్తిగల ఇన్వెస్టర్లతో చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు ఈ ఏడాది జూలై–సెపె్టంబర్‌(క్యూ2) ఫలితాల విడుదల సందర్భంగా బ్యాంక్‌ ఎండీ, సీఈవో స్వరూప్‌ కుమార్‌ సాహా ఇన్వెస్టర్లకు వెల్లడించారు. ఇందుకు విభిన్న అవకాశాలను పరిశీలిస్తున్నప్పటికీ క్విప్‌నకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అయితే మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా మర్చంట్‌ బ్యాంకర్ల సలహాలనుబట్టి ఇందుకు వీలున్నట్లు తెలియజేశారు.  

సెంట్రల్‌ బ్యాంక్‌ 
వివిధ మార్గాలలో రూ. 7,000 కోట్లు సమకూర్చుకునేందుకు పీఎస్‌యూ దిగ్గజం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఇప్పటికే వాటాదారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ఏడాది జూలైలో క్విప్‌సహా ఎఫ్‌పీవో, రైట్స్‌ తదితర మార్గాల ద్వారా నిధుల సమీకరణకు అనుమతి లభించింది. పెట్టుబడుల సమీకరణ వ్యూ హాలలో భాగంగా బ్యాంకులో ప్రభుత్వ వాటా తగ్గించుకోవాలని సెంట్రల్‌ బ్యాంక్‌ భావిస్తోంది. అయితే మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ప్రతిపాదిత నిధుల సమీకరణ మార్గాలు, సమయం తదితర అంశాలు నిర్ధారితం కానున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు తెలియజేశాయి. నిజానికి క్విప్‌ చేపడితే సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా బ్యాంకులో పబ్లిక్‌ వాటాను పెంచడంసహా ప్రభు త్వ వాటా నిబంధలనకు అనుగుణంగా దిగిరానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement