విజయవాడ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టగా, విజయవాడలోని గొల్లపూడి గుంటుపల్లి హైవేలో ఉన్న సీఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక వేడుక నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ ఎ.ఓ. బషీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజయవాడ జోనల్ హెడ్, జనరల్ మేనేజర్ కట్టా శ్రీధర్ బాబు, రీజినల్ హెడ్ ఎం.వి. తిలక్ తదితర అధికారులు, ఉద్యోగులు, ఖాతాదారులు, విశ్రాంత ఉద్యోగులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 108 ఏళ్లుగా ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొంటూ బ్యాంకు అభివృద్ధి చెందుతోందని తెలిపారు. బ్యాంకు విజయ ప్రస్థానంలో ఖాతాదారులు, ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విజయవాడ జోన్ పరిధిలో 489 శాఖలు, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,234 శాఖలతో బ్యాంకు సేవలందిస్తోందని వెల్లడించారు.
మరోవైపు, ముంబైలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఆధునిక బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన పలు డిజిటల్ ఉత్పత్తులను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 108 కొత్త శాఖలను వర్చువల్‌గా ప్రారంభించారు. వీటిలో ఈశాన్య ప్రాంతంలో 25, సాధారణ వ్యాపార సేవలకు 51, యువత కోసం 16, స్టార్టప్‌ల కోసం 9, వ్యవసాయ విలువ ఆధారిత ఆర్థిక సేవలకు 7 శాఖలు ఉన్నాయి. అలాగే జాతీయ రక్షణ నిధికి రూ.11.17 కోట్లు, సామాజిక బాధ్యత కార్యక్రమాలకు రూ.13.72 కోట్లు విరాళంగా అందించారు. ఆర్థిక సమ్మిళిత వృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా ముందుకు సాగుతామని బ్యాంకు ప్రకటించింది.


