62 ఏళ్లు.. 517 రకాల వంగడాలు | Today is the Foundation Day of Acharya NG Ranga Agricultural University | Sakshi
Sakshi News home page

62 ఏళ్లు.. 517 రకాల వంగడాలు

Jun 12 2026 5:10 AM | Updated on Jun 12 2026 5:10 AM

Today is the Foundation Day of Acharya NG Ranga Agricultural University

ఇది ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఘనత  

జాతీయ వరి ఉత్పత్తిలో 33 శాతం ఇక్కడి రకాలదే  

సన్నబియ్యం సృష్టి.. తెగుళ్లు, చీడపీడలకు అడ్డుకట్ట ఇక్కడే  

నేడు వ్యవస్థాపక దినోత్సవం  

ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, రైతులకు దాతృత్వ నిధి పురస్కారాలు  

సాక్షి, అమరావతి: దేశంలో పురాతనమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) శుక్రవారం 62 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో వర్సిటీ ఎన్నో విజయాలు సాధించింది. మొత్తం 517 రకాల వంగడాలను రూపొందించింది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త రకాల వంగడాలను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాల అభివృద్ధి మాత్రమే కాదు సన్నరకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి సాగులో ఈ వర్సిటీ రూపొందించిన రకాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. 

ఆరు కళాశాలలు, 41 పరిశోధన కేంద్రాలతో 1964లో ఈ యూనివర్సిటీ ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తరువాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 13 కళాశాలలు, 33 పరిశోధన కేంద్రాలు, 27 విస్తరణ విభాగాలతో సేవలందిస్తున్న ఈ వర్సిటీలో 973 మంది అధ్యాపకులున్నారు. ఇప్పటివరకు 36,664 మంది అండర్‌ గ్రాడ్యుయేట్లు, 11,668 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు కలిపి 48,332 మంది పట్టభద్రులను తయారు చేసింది. ఏటా బ్యాచిలర్‌ కోర్సుల్లో 2 వేలమంది, పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో 33 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు.  

వరిలోనే 136 రకాల అభివృద్ధి  
ఇప్పటివరకు వర్సిటీ 225 ధాన్యాలు, 87 పప్పు ధాన్యాలు, 56 నూనెగింజలు, 92 వాణిజ్య పంటలు, 57 పండ్లు, కూరగాయలు, సుగంధద్రవ్యాల పంటలకు చెందిన విత్తనాలను అభివృద్ధి చేసింది. ధాన్యాల్లో ఒక్క వరిలోనే 136 రకాలను అభివృద్ధి చేశారు. ఈ కోవలో అభివృద్ధి చేసిన ఎంటీయూ 7029 (స్వర్ణ), బీపీటీ 5204 (సాంబామసూరి), కాటన్‌ దొర సన్నాలు వంటి వరిరకాలు జాతీయస్థాయిలో విశేష ప్రజాదరణ పొందాయి. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణంలో 88 శాతం ఈ రకాలే సాగవుతున్నాయి. వేరుశనగలో కే–6, నారాయణి, లేపాక్షి వంటి రకాలు ఈ వర్సిటీ అభివృద్ధి చేసినవే. 

రాష్ట్రంలో వేరుశనగ సాగు విస్తీర్ణంలో 90 శాతం కే–6 రకమే సాగవుతోంది. బయో పోర్టిఫైడ్‌ సజ్జ రకం ఏబీవీ 04, పోర్టిఫైడ్‌ రాగి రకాలు వేగావతి (వీఆర్‌ 929), ఇంద్రావతి (వీఆర్‌ 1101) రకాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే మొట్టమొదటి బూజుతెగులు నిరోధక మినుము రకం ఎల్‌బీజీ 17 (కృష్ణయ్య) ఈ వర్సిటీ అభివృద్ధి చేసిందే. ప్రభుత్వరంగంలో మొదటిసారిగా బీటీ పత్తి రకమైన లాం బీజీ టూ–2208 (ఆదిత్య బీజీ–2) రకాన్ని ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ స్థాయిలో నూతన వంగడాలను అభివృద్ధి చేసిన వర్సిటీ దేశంలో మరొకటి లేదనే చెప్పాలి.

దేశంలోని 46 మిలియన్‌ హెక్టార్ల వరి సాగువిస్తీర్ణంలో 14 మిలియన్‌ హెక్టార్లలో ఈ వర్సిటీ రూపొందించిన రకాలే సాగవుతున్నాయంటే ఈ వంగడాలు ఏ స్థాయిలో రైతులకు చేరువయ్యాయో అర్థమవుతుంది. జాతీయస్థాయి వరి ఉత్పత్తి 131 మిలియన్‌ టన్నుల్లో 33.15 శాతం (37.76 మిలియన్‌ టన్నులు) ఈ వర్సిటీ రూపొందించిన రకాలే కావడం గమనార్హం. ఆంధ్రలో వరిసాగు విస్తీర్ణంలో 90.29 శాతం అంటే అక్షరాల 21.78 లక్షల హెక్టార్లలో ఈ వరి రకాలే సాగవుతున్నాయి. ఆంగ్రూ రకాల బియ్యం ఎగుమతి ద్వారా దేశం ఏటా సగటున రూ.8 వేలకోట్ల నుంచి రూ.10 వేలకోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది.  

ఆ ఐదేళ్లూ సువర్ణయుగమే 
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామస్థాయిలో ఏర్పాటైన రైతు సేవాకేంద్రాలు వ్యవసాయ పరిశోధన ఫలాలను రైతులకు చేరువచేయడంలో వర్సిటీకి, అన్నదాతలకు మధ్య వారధిగా పనిచేశాయి. జగన్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో వర్సిటీ అన్ని రంగాల్లోను అగ్రగామిగా నిలిచింది. అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన భవనాలు సమకూర్చడంతో విస్తృత పరిశోధనలతో దూసుకెళ్లింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆమోదించిన డ్రోన్‌ శిక్షణ కేంద్రాన్ని గుంటూరు లాంలోని అప్సరా సెంటర్‌లో ప్రారంభించారు. 

పురుగు, తెగులుమందుల పిచికారికి ఆంగ్రూ పుష్పక్‌–1, విత్తనాలు, ఎరువులు చల్లేందుకు పుష్పక్‌–2 డ్రోన్లను అభివృద్ధి చేశారు. 10 పంటల్లో పిచకారీ చేసి సత్ఫలితాలను సాధించారు. జాతీయస్థాయిలో డ్రోన్‌ పైలెట్‌ శిక్షణ కోసం డీజీసీఏ సర్టిఫికేషన్‌ పొందిన తొలి వర్సిటీగా ఆంగ్రూ నిలిచింది. ఇక్కడ ఇప్పటివరకు 534 మంది డ్రోన్‌ పైలెట్లకు శిక్షణ ఇచ్చారు. 2021లో సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ రీసెర్చ్‌ను ఏర్పాటు చేసి డేటా ఆధారిత విశ్లేషణాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

ఐసీఏఆర్‌ ర్యాంకింగ్స్‌లో 2022–23లో జాతీయస్థాయిలో వర్సిటీ ఏడోస్థానంలో, పీజీ అడ్మిషన్లలో రెండోస్థానంలో నిలిచింది. అన్ని ఇన్‌స్టిట్యూట్లలో 11వ స్థానం సాధించింది. అగ్రిప్రెన్యూర్‌షిప్‌ ఓరియంటేషన్, ఇంక్యుబేషన్‌ ప్రోగ్రాం (సంకల్ప–2021)లో 55 ఇంక్యుబేట్‌లు ఎంపికయ్యాయి. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌) అభివృద్ధి చేసిన మల్టీటాస్క్‌ టూల్‌బార్, నాప్‌సాక్‌ వీడర్‌ను వినూత్న వ్యవసాయ యంత్రాలుగా ఎంపికచేశారు. ఆ ఐదేళ్లు అవార్డులకు కొదవే లేదు. 2020లో రెండో అత్యధిక సంఖ్యలో ఐసీఏఆర్‌ పీజీ స్కాలర్‌íÙప్‌లు పొందిన వర్సిటీగా జాతీయ అవార్డు లభించింది. 

గిరిజన వ్యవసాయ వ్యవస్థల్లో అత్యుత్తమ పరిశోధన కోసం ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ అవార్డు–2020 వరించింది. వర్సిటీకి వ్యవసాయ పరిశోధన, విద్యారంగ కేటగిరిలో 2022లో స్కాచ్‌ సిల్వర్,, స్కాచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ తదితర అవార్డులెన్నో దక్కాయి. 2023–24లో ఏ కేటగిరిలో లాంలోని ఆర్‌ఏఆర్‌ఎస్‌కు, బీ కేటగీరిలో రాగోలులోని ఏఆర్‌ఎస్‌కు ఉత్తమ పరిశోధన కేంద్రం అవార్డు, కేవీకే కొండెంపూడిలోని కేవీకేకి ఉత్తమ కేవీకే అవార్డు, ఏలూరులోని డీఏఏటీటీసీకి ఉత్తమ డాట్‌ సెంటర్‌ అవార్డు లభించాయి. డయోబ్‌లైట్‌ స్మార్ట్‌ రైస్‌కుక్కర్, పాలిమర్‌ పుల్లీ డ్రివైన్‌ సెంట్రిప్యూగల్‌ పంప్‌ వంటి ఆవిష్కరణకు పేటెంట్‌ హక్కులు లభించాయి. అలాంటి యూనివర్సిటీ 2024–25లో వ్యవసాయ వర్సిటీల్లో 26వ స్థానానికి, ఓవరాల్‌గా 151వ స్థానానికి  దిగజారిపోయింది.  

నేడు 63వ వ్యవస్థాపక దినోత్సవం  
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం యూనివర్సిటీలోని కృష్ణ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. నాబార్డు మాజీ చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు విశిష్ట అతిధిగా పాల్గొనే ఈ వేడుకలో ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, రైతులకు దాతృత్వనిధి పురస్కారాలు అందించనున్నారు. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు వర్సిటీ నిరంతరం కృషిచేస్తోందని వీసీ డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ తెలిపారు. విద్య, పరిశోధన, విస్తరణ సేవలను సమన్వయపర్చుకుంటూ, వర్సిటీ ఘన చరిత్రను స్మరించుకుంటూ భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement