బండ్ల గణేష్‌ ఆస్తి వేలంపై హైకోర్టు కీలక తీర్పు | Telangana High Court Clears Union Bank Sale Of Producer Bandla Ganesh Property | Sakshi
Sakshi News home page

బండ్ల గణేష్‌ ఆస్తి వేలంపై హైకోర్టు కీలక తీర్పు

Jul 4 2026 1:17 PM | Updated on Jul 4 2026 1:38 PM

Telangana High Court Clears Union Bank Sale Of Producer Bandla Ganesh Property

సాక్షి, హైదరాబాద్‌: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు చెందిన జూబ్లీహిల్స్‌ ఆస్తి వేలానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను ఆమోదిస్తూ, బ్యాంకు సర్ఫేసీ చట్టం–2002 కింద చేపట్టిన ఆస్తి వేలం సమర్థనీయమేనని తేల్చిచెప్పింది. వేలం ద్వారా చేసిన విక్రయాన్ని రద్దు చేసి, ఆ సొమ్మును ఆస్తి యజమానులకు చెల్లించాలంటూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. బండ్ల గణేశ్, ఆయన తండ్రి, సోదరుడు తదితరులకు చెందిన ఆస్తి వేలం వేయడాన్ని రద్దు చేస్తూ డీఆర్‌టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బ్యాంక్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌ కుమార్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. బ్యాంక్‌ తరఫున మాజీ ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. శ్రీపరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తీసుకున్న రుణ రికవరీలో భాగంగా హామీదారులైన కుటుంబానికి చెందిన ఆస్తిని 2019లో స్వాధీనం చేసుకున్నామని. 2022లో వేలం నిర్వహించగా రూ.8.51 కోట్లు వచ్చిందన్నారు. డీఆర్‌టీ ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని చెప్పారు. రుణగ్రహీత కంపెనీకి సంబంధించి ఎన్‌సీఎల్‌టీలో దివాళా ప్రక్రియ ప్రారంభమైనంత మాత్రాన వ్యక్తిగత గ్యారెంటర్ల ఆస్తులపై మారటోరియం వర్తించదన్నారు. 

వ్యక్తిగత గ్యారెంటర్లపై ప్రత్యేకంగా దివాళా చర్యలు ప్రారంభించినప్పుడే ఆ రక్షణ వర్తిస్తుందన్నారు. రూ. 8.50 కోట్ల విక్రయ మొత్తాన్ని ఇప్పటికే వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద బ్యాంక్‌ సర్దుబాటు చేసినట్లు తెలిపారు. పిటిషనర్లు ఓటీఎస్‌ కింద చెల్లించడానికి ముందుకొచ్చారని, దీనికి బ్యాంకు అంగీకరించిందన్నారు. వేలాన్ని సవాలు చేయడంతోపాటు బ్యాంకుపై వేసిన ఇతర పిటిషన్లను ఉపసంహరించుకోవడానికి బండ్ల గణేశ్‌ అంగీకరించారన్నారు. అది చేయకుండానే డీఆర్‌టీని ఆశ్రయించారని, ట్రిబ్యునల్‌ బ్యాంక్‌ రికార్డులను పరిశీలించకుండా వేలాన్ని రద్దు చేసిందన్నారు.

సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తా : బండ్ల గణేశ్‌
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  నిర్మాత బండ్ల గణేశ్‌ స్పందించారు. తన ఆస్తిని బ్యాంక్‌ వాళ్లు అన్యాయంగా విక్రయించారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌ లో సుధీర్గమైన పోస్ట్‌ పెట్టాడు.‘అన్యాయంగా, లోపాయికారీ ఒప్పందంతో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు బ్యాంకు అధికారులు నా ఆస్తిని విక్రయించారు. ఈ అన్యాయాన్ని సవాలు చేస్తూ 2022లో నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. ఈ కేసులో కింది డీఆర్‌టీ (DRT)లో నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే తాజాగా హైకోర్టులో నాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. అయినప్పటికీ నాకు భారత న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించి, నిజాయతీగా నా హక్కుల ఆధారంగా న్యాయం సాధిస్తాననే అచంచలమైన నమ్మకం నాకు ఉంది’ అని తెలిపారు

గతంలోనూ అనేక కేసులు..
రుణాలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా లీగల్‌ చిక్కుల్లో పడడం బండ్ల గణేశ్‌కు కొత్తేమి కాదు. గతంలోనూ ఆయనపై పలు ప్రాంతాల్లో చెక్‌ బౌన్స్‌ కేసులు నమోదు అయ్యాయి. టెంపర్‌ సినిమాకు రచయితగా పని చేసిన వక్కంతం వంశీకి ఇవ్వాల్సిన  రూ. 26 లక్షల రెమ్యునరేషన్ చెక్ బౌన్స్ కావడంతో.. ఆయనకు ఎర్రమంజిల్‌ కోర్టు 6 నెలల కఠినగారా శిక్షతో పాటు రూ.16లక్షల జరిమానా కూడా విధించింది. ఆ తర్వాత ఆయన పర్సనల్‌  బాండ్లపై బెయిల్‌ పొందాడు. అలాగే కడప జిల్లాకు చెందిన ఒక ఫైనాన్షియర్ నుంచి తీసుకున్న ఆర్థిక సహాయానికి ప్రతిగా ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కడప కోర్టులో కూడా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టుకు సకాలంలో హాజరు కాకపోవడంతో ఆయనపై ఒకానొక దశలో నాన్-బెలబుల్ వారెంట్ (NBW) కూడా జారీ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement