నిన్ను కోరి, మజిలీ.. ఇలా నా సినిమాలన్నీ మళ్లీ మళ్లీ చెప్పుకునేలా ఉంటాయి. ఇండస్ట్రీ నుంచి నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నా కథలు గుర్తుండిపోవాలన్నదే నా ఉద్దేశం. అందుకే నా ప్రతి కథ అలానే ఉంటుంది. అయితే 'ఇరుముడి'లో ఇంటెన్సిటీతో పాటు ఒక క్రైమ్ యాంగిల్‌తో అద్భుతమైన కథ కుదిరింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ఆశిస్తున్నాను’’ అని దర్శకుడు శివ నిర్వాణ చెప్పాడు. రవితేజ, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర, సాయికుమార్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా ‘ఇరుముడి’. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ ఆసక్తికర విశేషాలు చెప్పారు.
మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమాలో అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, అలాగే ఫ్యామిలీ, క్రైమ్ యాంగిల్... ఇలా మూడు లేయర్స్ ఉంటాయి. చిన్నపాటి సందేశం కూడా ఉంది. తాగుబోతు త్రినాథ్ (సినిమాలో రవితేజ పాత్ర పేరు) అయ్యప్ప మాల ధరించక ముందు చేసిన కొన్ని ఘటనలు అతను అయ్యప్ప మాల ధరించిన తర్వాత వెంటాడతాయి. ఆ సమయంలో అతను ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ.
రవితేజగారు చేసిన ఈ పాత్ర చుట్టూ ఒక మంచి హ్యూమన్ డ్రామా కుదిరింది. కథలో అయ్యప్ప స్వామి మాల బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. కానీ పూర్తిగా అయ్యప్ప స్వామి మాల బ్యాక్‌డ్రాప్‌తో సాగే అయ్యప్ప స్వామి కథ కాదు. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు హీరో ఎలా ఉంటాడు? మాలలో లేనప్పుడు ఎలా ఉంటాడు? అనేది అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కథ ముందుకు వెళ్తుంది.
ఈ సినిమా కోసమే నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. అసలు అయ్యప్ప స్వామి మాలలోనే అద్భుతమైన హ్యూమన్ డ్రామా ఉందనిపిస్తోంది. ఆ మాల వేసుకున్న తర్వాత ఎవరైనా సరే చాలా నిష్టగా, భయభక్తులతో ఉంటారు. ఈ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి..’ పాట అద్భుతంగా ఉంటుంది. ఒరిజినల్ పాటలో ఉన్న వైబ్ మా సినిమాలోని వాయిస్‌లో లేదనే మాటలు వినిపిస్తున్నాయి. డప్పు శ్రీనుగారు 15 ఏళ్ల క్రితం ఈ పాట పాడారు. ఇప్పుడు ఆయన వయసు 60. అప్పటికి, ఇప్పటికీ ఎనర్జీలో కొంత మార్పు రావడం సహజం. ఈ పాటను థియేటర్లో ఒక పూనకంతో చూస్తారు. ఈ పాటలో రామ్ చరణ్ కనిపిస్తారన్న వార్తల్లో నిజం లేదు. ‘మాలికాపురం’ చిత్రంతో కూడా మా సినిమాకు పోలికలు ఉండవు.


