బాక్సాఫీస్‌ బంగారం | Star heroines focus on Lady oriented Movie in Tollywood | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ బంగారం

Aug 19 2026 12:13 AM | Updated on Aug 19 2026 12:13 AM

Star heroines focus on Lady oriented Movie in Tollywood

ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టిన స్టార్‌ హీరోయిన్స్‌

కథలో ఆడియన్స్‌కు కనెక్ట్‌ చేయగల అంశాలు మెండుగా ఉంటే చాలు... ఉమన్‌ సెంట్రిక్‌ సినిమాలు సైతం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాయి. 2024లో శ్రద్ధాకపూర్‌ ‘స్త్రీ 2’ సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి, రూ. 850 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. తెలుగులో సమంత లీడ్‌ రోల్‌ చేసిన ‘మా ఇంటి బంగారం’ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ఈ ఏడాది రాబోయే, ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఉమన్‌ సెంట్రిక్‌ చిత్రాలపై ఇటు ఆడియన్స్‌లో, అటు ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మరి... రానున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో ఏవి కనక వర్షం కురిపించి,  ‘బాక్సాఫీస్‌ బంగారం’గా నిలుస్తాయో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

మహాదేవి 
నయనతార, ఆర్‌జే బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మూకుత్తి అమ్మన్‌’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్‌ 2’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా తెలుగులో ‘మహాదేవి’గా విడుదల కానుంది. ఈ సినిమాకు సుందర్‌ .సి దర్శకత్వం వహించారు. వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నుంచి ఆల్రెడీ నయనతార ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 

ఈ మైథాలజీ సినిమాలో భారీ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ ఉన్నాయట. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. దునియా విజయ్, రెజీనా కసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, ఇనయ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో స్నేహ ఓ కీలక పాత్రలో నటించనున్నారని కోలీవుడ్‌ సమాచారం.

గిరిజన యువతి మైసా 
రష్మికా మందన్నా నటించిన తొలి ఉమన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇదొక రొమాంటిక్‌ లవ్‌స్టోరీ సినిమా. కాగా రష్మికా మందన్నా ప్రస్తుతం ‘మైసా’ అనే ఉమన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో గోండు గిరిజన యువతి పాత్రలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌ అంతా కూడా యాక్షన్‌ విజువల్స్, యాక్షన్‌ స్టిల్స్‌గా కనిపిస్తున్నాయి. దీంతో ‘మైసా’ సినిమాలో మేజర్‌ పార్ట్‌ యాక్షన్‌దే అనిపిస్తోంది.

ఇటీవల కేరళలో జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు మేకర్స్‌. రెండు రోజుల్లో 20 గంటల పాటు ఓ అండర్‌ వాటర్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లో కూడా పాల్గొన్నారు రష్మిక. సో... యాక్షన్‌ పరంగా ‘మైసా’ సినిమా మరో లెవల్లో ఉండబోతోందని స్పష్టం అవుతుంది. ఈ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసమే రష్మిక మందన్నా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే ఇటీవల ‘మైసా’ చిత్రీకరణలో రష్మికా మందన్నా గాయపడ్డారు. దీంతో ఆమెకు దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతిని సూచించారు వైద్యులు. 

ప్రస్తుతం రెస్ట్‌ మోడ్‌లో ఉన్నారు రష్మిక. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె ‘మైసా’ సినిమా షూటింగ్‌ను మళ్లీ షురూ చేస్తారని ఊహింవచ్చు. ఈ చిత్రాన్ని తొలుత ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ రష్మికా మందన్నా గాయం వల్ల ‘మైసా’ సినిమా చిత్రీకరణ రిలీజ్‌పై ఎఫెక్ట్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నాతో పాటు రాహుల్‌ రవీంద్రన్, ఈశ్వరీ రావు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. 

డోరతీ 
లేడీ ఓరియెంటెడ్‌ జానర్‌లో ‘మహానటి’ సినిమాతో ఓ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేశారు కీర్తీ సురేష్‌. ఆ తర్వాత ఆమె ‘మిస్‌ ఇండియా, పెంగ్విన్, రివాల్వర్‌ రీటా’ వంటి మరికొన్ని ఉమన్‌ సెంట్రిక్‌ చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె మరో ఉమన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌లో నటించారు. అదే ‘డోరతీ’. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించిప ఈ సినిమా సెప్టెంబరు 25న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. కీర్తీ సురేష్‌ లీడ్‌ రోల్‌ చేసిన ఈ సినిమాలో సనంత్, రిషి కాంత్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నట్లు ఈ చిత్రదర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఇటీవల పేర్కొన్నారు.  

బొగ్గు గనుల నేపథ్యంలో..! 
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపొందిన సినిమా ‘ది బ్లాక్‌గోల్డ్‌’. హీరోయిన్‌ సంయుక్త నటించిన తొలి ఉమన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ఇది. దేశాన్ని కుదిపేసిన కోల్‌ సిండికేట్‌ల బ్యాక్‌డ్రాప్‌ కథనంతో సాగే ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించారు సంయుక్త. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌ నగర్, ఆదిలాబాద్‌ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరించారు.

మొత్తం 60కి పైగా వర్కింగ్‌ డేస్‌లో షూటింగ్‌ పూర్తి చేశారు. ఐదు పవర్‌ఫుల్‌ షెడ్యూల్స్‌లో, 10కి పైగా భారీ సెట్లలో, రోజుకు 300 మందికి పైగా క్రూ పాల్గొంటూ చిత్రీకరణ జరిగిందిని మేకర్స్‌ తెలి పారు. అంతేకాదు... ఈ సినిమా కోసం సంయుక్త కొన్ని రిస్కీ యాక్షన్‌ స్టంట్స్‌ సీక్వెన్స్‌ చేశారు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా వెండితెరపై సంయుక్త నటన, బొగ్గు గనుల సిండికేట్‌ వంటి అంశాలను వెండితెరపై చూసేందుకు కాస్త సమయం ఉంది. 

ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్‌. ‘ది బ్లాక్‌ గోల్డ్‌’ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియన్‌ స్థాయిలో రిలీజ్‌ కానుంది. కేఎమ్‌సీ యోగేష్‌ దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్‌ సహకారంతో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్‌ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడు కలం నరేన్, బీవీఎస్‌ రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

మైథాలజీ అండ్‌ సస్పెన్స్‌ 
‘సవ్యసాచి’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘ది రాజా సాబ్‌’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు నిధీ అగర్వాల్‌. కాగా, తొలి సారి ఆమె ఓ ఉమన్‌ సెంట్రిక్‌ సినిమా చేయడానికి సిద్ధమైయ్యారు. నిధీ అగర్వాల్‌ నటించనున్న ఈ మైథాలజీ అండ్‌ సస్పెన్స్‌ డ్రామా ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాను ‘తంత్ర’ ఫేమ్‌ శ్రీనివాస్‌ గోపిశెట్టి తెరకెక్కించనున్నారు. ఆగస్టు 17న నిధీ అగర్వాల్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమాను హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు మేకర్స్‌. అలాగే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు. వరాహ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై సునీత్‌ పడోల్కర్‌ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్‌ కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

సంక్రాంతికి మహాకాళి 
ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఫీమేల్‌ సూపర్‌ హీరో సినిమా ‘మహాకాళి’. భూమిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్‌ ఖన్నా, రోహిత్‌ సరాఫ్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. 125 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆర్కేడీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్‌ రమేష్‌ దుగ్గల్‌ నిర్మించిన ఈ మైథాలజీ సినిమాకు క్రియేటర్‌గా ప్రశాంత్‌ వర్మ కథ అందిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఇక ‘మహాకాళి’ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరిలో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట ప్రశాంత్‌ వర్మ. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

విదేశాల్లో హ్యాపీ జర్నీ 
ఏడుగురు మహిళల జీవితాల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘హ్యాపీ జర్నీ’. ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్‌ ఝాన్సీ, పాయల్‌ రాధాకృష్ణ, జినీషా అలి శెట్టి, రూ పా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటించారు. పారిస్, మాంట్‌ పెలియర్‌ వంటి అందమైన యూరప్‌ ప్రాంతాల లొకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు మేకర్స్‌. మేజర్‌ షూటింగ్‌ యూరప్‌లోనే జరిగింది. వేర్వేరు వయసులకు చెందిన ఏడుగురు మహిళలు ఒక రోడ్‌ ట్రిప్‌ (ప్రయాణం) ప్రారంభించి, ఆ ప్రయాణంలో వారి జీవితాలను, బంధాలను, భావోద్వేగాలను ఎలా అన్వేషించుకున్నారనే కోణంలో ‘హ్యాపీ జర్నీ’ సినిమా కథనం సాగుతుందని సమాచారం. 

‘‘కథ విదేశీ నేపథ్యంలో సాగినా అందులోని మనుషుల అనుబంధాలు, భావాలు ప్రతి ఒక్కరికీ దగ్గరగా అనిపించేలా ఉంటాయి. నటీనటుల సహజమైన నటన, వారి మధ్య ఉన్న స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఈ సినిమాకు మరింత బలం చేకూర్చాయి’’ అని యూనిట్‌ పేర్కొంది. గుత్తా ప్రోడక్షన్స్, కమలాకర్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకాలపై  బాలాజీ గుత్తా, కౌశిక్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తరుణ్‌ రెడ్డి సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివతేజ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు.

హీరోయిన్‌ సాయి పల్లవి నటించిన పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్‌ సినిమా ‘గార్గి’. ఆ తర్వాత ఈ స్థాయిలో మరో ఉమన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ చేయలేదు సాయి పల్లవి. అయితే కొంతకాలంగా రెండు భాగాలుగా విడుదల కానున్న హిందీ ‘రామాయణ’, ఆల్రెడీ రిలీజైన హిందీ చిత్రం ‘ఏక్‌ దిన్‌’తో సాయి పల్లవి బిజీగా ఉన్నారు. కాగా, సాయిపల్లవి ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమా చేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ‘నేను.. శైలజ’, ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’  ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిషోర్‌ తిరుమల మైథాలజీ అంశాలతో ఓ ఉమన్‌ సెంట్రిక్‌ సినిమా కథను రెడీ చేస్తున్నారట. 

ఈ చిత్రంలో సాయి పల్లవి మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేయనున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, భారతరత్న అవార్డు గ్రహీత ఎమ్‌.ఎస్‌ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమా రానుందని, ఈ చిత్రంలో సాయి పల్లవి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. బన్నీ వాసు, రాక్‌లైన్‌ వెంకటేశ్‌ ఈ సినిమాను నిర్మించనున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రోడక్షన్‌ పనులు మొదలయ్యాయని, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చనే టాక్‌ వినిపిస్తోంది.

ఉమన్‌ సెంట్రిక్‌ సినిమాల ట్రెండ్‌ బాలీవుడ్‌లోనూ బాగానే కనిపిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కళాకారిణి విఠాబాయి నారాయణ్‌ గావ్‌కర్‌ జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న సినిమా ‘ఈఠా’. మహారాష్ట్ర సంప్రదాయ కళలు ‘లవానీ’, ‘తమాషా’లో అత్యంత ప్రావీణ్యురాలైన విఠాబాయి బయోపిక్‌కు ‘చావా’ ఫేమ్‌ లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెండితెర విఠాబాయిగా శ్రద్ధా కపూర్‌ నటిస్తున్నారు. మరో లీడ్‌ రోల్‌లో రణ్‌దీప్‌ హుడా నటిస్తున్నారు. దినేష్‌ విజన్, లక్ష్మణ్‌ ఉటేకర్, కరిష్మా శర్మ నిర్మిస్తున్న ‘ఈఠా’ సినిమా డిసెంబరు 4న రిలీజ్‌ కానుంది. 

ఈ సినిమా కోసం  శ్రద్ధా కపూర్‌ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా గురించి శ్రద్ధా కపూర్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ–‘‘ఈఠా’ సినిమా కోసం 15 కేజీల బరువు పెరిగాను. విఠాబాయి పాత్రలో ఓ సన్నివేశంలో చీరకట్టుతో పాటు భారీ ఆభరణాలు ధరించి డ్యాన్స్‌ చేయాల్సి వచ్చింది. దీంతో కాలి కండరాలు ఒత్తిడికి గురయ్యాయి. వైద్యుల సూచనల మేరకు ఓ వారం రెస్ట్‌ తీసుకున్నాను’’అని పేర్కొన్నారు. ఇంకా ‘స్త్రీ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత శ్రద్ధా కపూర్‌ నటిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్‌లో అంచనాలు ఉన్నాయి. 

మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ సైతం ఓ మహిళ పాత్ర బలంగా ఉన్న కథతో ‘తుంబాడ్‌ 2’ అనే సినిమా చేస్తున్నారు. సోహమ్‌ షా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆదేశ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబరు 3న రిలీజ్‌ కానుంది. ఇంకా ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌’ ఫ్రాంచైజీలోని ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌ 3’లో తమన్నా టైటిల్‌ రోల్‌ చేయనున్నారని, ఈ సినిమాను ఏక్తా కపూర్‌ నిర్మించనున్నారనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకా ‘మడాక్‌ హారర్‌ కామెడీ యూనివర్స్‌’ నుంచి ‘శక్తి శాలినీ’ అనే ఉమన్‌ సెంట్రిక్‌ సినిమా రానుంది. 

ఈ చిత్రంలో అనీత్‌ పద్దా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, విశాల్‌ జెత్వా కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్‌ కుమార్, వరుణ్‌ ధావన్‌ గెస్ట్‌ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆదిత్య సర్పోత్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 24న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.  

– ముసిమి శివాంజనేయులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement