టైటిల్: రూపాయనమః
నటీనటులు: అరవింద్ పండ్రాతే, వేణు పోల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కాని, క్రాక్ శ్రీమణి, విషన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు
నిర్మాణ సంస్థ: చిత్ర వేద ప్రొడక్షన్స్
నిర్మాత: పావని సాగి
దర్శకత్వం: అరవింద్ రెడ్డి
సంగీతం: రిషి ఎం
విడుదల తేదీ: అక్టోబర్ 2, 2026
కథ ఏంటంటే..
హరి నారాయణ తన తల్లి, భార్య, కూతురితో కలిసి ఓ పల్లెటూరిలో సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటాడు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అతని జీవితంలోకి అనుకోకుండా అదృష్టం తలుపు తడుతుంది. హరి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా కోటి రూపాయల బహుమతి వస్తుంది. దీంతో తమ కష్టాలన్నీ తీరిపోయాయని కుటుంబ సభ్యులు సంబరపడతారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవదు. కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఆ లాటరీ టికెట్ ఇంట్లో కనిపించకుండా పోతుంది. కుటుంబ సభ్యులంతా ఇల్లంతా వెతుకుతున్న సమయంలో హరికి ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తుంది.
లాటరీ టికెట్ తన దగ్గరే ఉందని చెప్పిన ఆ వ్యక్తి.. దాన్ని తిరిగి ఇవ్వాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు.ఇంతకీ ఆ అపరిచితుడు ఎవరు? లాటరీ టికెట్ అతని చేతికి ఎలా వచ్చింది? రూ.10 లక్షలు డిమాండ్ చేసిన వ్యక్తిని హరి ఎలా ఎదుర్కొన్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో తన టికెట్‌ను తిరిగి దక్కించుకున్నాడు? ఈ క్రమంలో అతని కుటుంబానికి ఎదురైన పరిణామాలేంటి? అన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే ...
ఒక్కసారిగా భారీ మొత్తం చేతికి వస్తే జీవితం మారిపోతుందనే ఆశ మానవ సహజం. అదే ఆలోచనను కథాంశంగా తీసుకున్న ‘రూపాయనమః’ ఆసక్తికరంగా మొదలవుతుంది. దర్శకుడు అరవింద్ రెడ్డి ఈ కథను పల్లెటూరి నేపథ్యంలో సహజంగా నడిపించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు, ఊరి మనుషుల ప్రవర్తన, వారి అమాయకత్వం వంటి అంశాలను ఎలాంటి అతిశయోక్తులు లేకుండా తెరపై చూపించారు. అయితే అసలు కథని ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు.
ఫస్టాఫ్ కథనం నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా ఇంట్లో జరిగే వెతుకులాట సన్నివేశాలకు మరికొంత కత్తెర వేసి ఉంటే కథనం మరింత వేగంగా సాగేది. అలాగే కొన్ని ఉప పాత్రలను ఇంకాస్త లోతుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది.
అయితే ద్వితీయార్ధంలో కథ ఇంటి పరిధిని దాటి ఊరి పరిసరాల్లోకి వెళ్లడంతో కథనంలో వేగం పెరుగుతుంది. హరి, ఆ అపరిచితుడి మధ్య జరిగే ఫోన్ సంభాషణలు, ఒకరిపై ఒకరు వేసుకునే ఎత్తుకు పైఎత్తులు ఆసక్తిని పెంచుతాయి. క్లైమాక్స్ కూడా కథకు తగ్గట్టుగా సంతృప్తికరంగా ముగుస్తుంది.
మొత్తంగా ‘రూపాయనమః’ ఆసక్తికరమైన పాయింట్‌తో, పల్లెటూరి స్వచ్ఛమైన హాస్యాన్ని జోడించి తెరకెక్కించిన చిత్రం. ప్రారంభంలో కాస్త నెమ్మదిగా అనిపించినా.. సహజమైన నటన, ఆకట్టుకునే మలుపులు, గ్రామీణ నేపథ్యం సినిమాను నిలబెట్టాయి.
ఎవరెలా చేశారంటే..
ప్రధాన పాత్రల్లో నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ తమ పాత్రలకు తగ్గట్టుగా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. కుటుంబ సమస్యలతో సతమతమయ్యే సామాన్యుడి పాత్రలో అరవింద్ పండ్రాతే ఒదిగిపోయాడు. శ్రావణి మల్కాని, వేణు పోల్సాని, డి. అనుదీప్ తమ పరిధి మేరకు బాగానే నటించి సన్నివేశాలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. సాంకేతికంగా సినిమా ఒకే.
జింకా వరుణ్ నాయుడు కెమెరా పనితనం గ్రామీణ లొకేషన్లను ఎక్కడా హంగులు లేకుండా వాస్తవికంగా చూపించింది. రిషి ఎం అందించిన నేపథ్య సంగీతం కథలోని ఉత్కంఠకు, హాస్యానికి తగినట్లుగా సాగింది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


