అన్ని రంగాల్లో విస్తరిస్తున్న మెషీన్ లెర్నింగ్
ఐటీ కంటే వేగంగా ఎంఎల్ జాబ్స్ నియామకాలు
అకడమిక్ నైపుణ్యాలు, సర్టిషికేషన్స్‌తో జాబ్ గ్యారెంటీ
నేటి టెక్నాలజీ యుగంలో అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం పెరుగుతోంది. కస్టమర్ సపోర్ట్ నుంచి కీలకమైన కోడింగ్ వరకూ.. అన్నింటా ఏఐ ప్రమేయం కనిపిస్తోంది. సెర్చ్ ఇంజన్స్‌లో సైతం ఏఐ టూల్స్‌ను వినియోగించి అవసరమైన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు సరికొత్త అవకాశాల్ని సృష్టిస్తోంది. మెషీన్ లెర్నింగ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. మెషీన్ లెర్నింగ్ ప్రాధాన్యం, కారణాలు, అవకాశాలు, అందుకునే మార్గాలు తదితర వివరాలు..
మెషీన్ లెర్నింగ్ అంటే..
ఏఐతో కోట్లాది మంది క్షణాల్లో తమకు కావాల్సిన సమాచారం పొందుతున్నారు. ఇదంతా మన కళ్ల ముందు కనిపించే ప్రక్రియ. కానీ దీని వెనుక ఉన్న కీలకమైన బ్యాక్ ఎండ్ ప్రక్రియే.. మెషీన్ లెర్నింగ్. గత డేటాను, ప్యాట్రన్స్‌ను అర్థం చేసుకుని కొత్త నమూనాలను రూపొందించే ప్రక్రియనే మెషీన్ లెర్నింగ్ అంటారు. అంటే.. ఏఐలో మెషిన్ లెర్నింగ్ ముఖ్యమైన భాగం. డేటా నుంచి నమూనాలను గుర్తించి నేర్చుకునే సామర్థ్యాన్ని కంప్యూటర్లకు అందించే సాంకేతికత ఇది.
డేటా నుంచి నమూనాలు
కస్టమర్ కొనుగోలు చరిత్ర ఆధారంగా భవిష్య త్తులో ఎలాంటి ఉత్పత్తి కొనే అవకాశం ఉందో చెప్పడం, మెడికల్ రికార్డ్ ఆదారంగా వ్యాధి తీవ్రతను అంచనా వేయడం వంటివి మెషీన్ లెర్నింగ్ ప్రక్రియతోనే సాధ్యమవుతాయి. అదేవిధంగా యూట్యూబ్‌లో వాచ్ హిస్టరీ ఆధారంగా సదరు వ్యక్తి ఆసక్తి చూపే వీడియోలు మాత్రమే కనిపించేలా చేసే ప్రక్రియ కూడా మెషీన్ లెర్నింగ్‌తోనే జరుగుతుంది. మొత్తంగా చూస్తే డేటా, ట్రైనింగ్, మోడల్, ప్యాట్రన్, ఎస్టిమేషన్, డెసిషన్ అనే ప్రక్రియలను పూర్తి చేసే టెక్నాలజీ.. మెషీన్ లెర్నింగ్. అంటే అప్పటికే ఉన్న డేటా నుంచి కీలక అంశాలను గుర్తించి.. సొంతంగా నమూనాలను రూపొందించడం, అప్లికేషన్స్ అందించడం ఎంఎల్ సహాయంతో చేస్తారు.
పెరుగుతున్న నియామకాలు
🔸 ఏఐ విస్తరిస్తున్న కొద్దీ మెషీన్ లెర్నింగ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం–ఏఐ/ఎంఎల్ నియామకాలు 16 శాతం పెరిగాయి. ఐటీ రిక్రూట్‌మెంట్స్ మాత్రం మూడు శాతం తగ్గాయి. మరో నివేదిక ప్రకారం–14 రంగాల్లో ఏఐ/ఎంఎల్ ఉద్యోగావకాశాలు 25 శాతం పెరగడం గమనార్హం.
🔸 ఎంఎల్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఎన్‌ఎల్‌పీ ఇంజనీర్, ఎంఎల్‌ఓపీఎస్ ఇంజ నీర్, ఏఐ రీసెర్చర్, జనరేటివ్ ఏఐ ఇంజనీర్, ఏఐ ప్రొడక్ట్ ఇంజనీర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి.
మెషీన్ లెర్నింగ్.. మూడు రకాలు
మెషీన్ లెర్నింగ్ ప్రక్రియను ప్రస్తుతం మూడు రకా లుగా వర్గీకరించారు. అవి సూపర్‌వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్‌వైజ్డ్ లెర్నింగ్, రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. సరైన సమాధానాలతో కూడిన డేటాను అనుసంధానం చేయడం సూపర్‌వైజ్ లెర్నింగ్ కాగా, లేబుల్స్ లో లేని డేటాలో సమూహాలను, నమూనాలను కనుక్కోవడం అన్‌సూపర్‌వైజ్డ్ లెర్నింగ్‌గా చెప్పొచ్చు. రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అనేది రోబోటిక్స్, గేమింగ్ రంగాల్లో ఎక్కువగా వినియోగంలో ఉంది.
ప్రోగ్రామ్‌లు రాసే సామర్థ్యం
మెషిన్ లెర్నింగ్‌లో ఉన్న మరో ప్రత్యేకత ప్రోగ్రామ్‌లను కంప్యూటర్లే స్వయంగా రాసుకునే సామర్థ్యం ఉండటం. దీనికి ఆరంభ దశలో మానవ ప్రమేయం అవసరం. మెషిన్ లెర్నింగ్‌కు అవసరమైన ప్రత్యేక అల్గారిథమ్స్‌ను రూపొందించి.. సిస్టమ్స్‌లో నిక్షిప్తం చేస్తారు. వీటి ఆధారంగా సదరు సిస్టమ్స్ భవిష్యత్తులో సంబంధిత అంశాలను స్వయంగా విశ్లేషించడం, ప్రోగ్రామింగ్, నిర్ణయాలు తీసుకోవడంలో సొంత విధానాన్ని అనుసరిస్తాయి.
ఎంఎల్ నిపుణుల విధులివే
సమస్యను పరిష్కరించడం, డేటా సేకరణ, అల్గారిథమ్స్‌ను ఎంపిక చేసి మోడల్స్ రూపొందించడం, మెషీన్లను సిద్ధం చేయడం, మోడల్స్ టెస్టింగ్, మోడల్స్ పనితీరు పర్యవేక్షణ వంటివి మెషీన్ లెర్నింగ్ ప్రధాన విధులు.
ఈ స్కిల్స్ ఎంతో కీలకం
మెషీన్ లెర్నింగ్ రంగంలో కెరీర్ కోరుకునే వారు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను తప్పనిసరిగా నేర్చుకోవాలి. దీంతోపాటు ఎస్‌క్యూఎల్, ఆర్, జావా, సీ++లు కూడా ఉపయుక్తం. అదే విధంగా అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, కాలిక్యులస్, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్‌పై అవగాహన పెంచుకోవాలి.
సర్టిఫికేషన్లు
మెషీన్ లెర్నింగ్ రంగంలో కొలువులు కోరుకునే వారికి సర్టిఫికేషన్స్ కీలకంగా నిలుస్తున్నాయి. ముఖ్యమైన సర్టిఫికేషన్స్ వివరాలు..
🔸 గూగుల్ క్లౌడ్: ప్రొఫెషనల్ మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్.
🔸 అమెజాన్ వెబ్ సర్వీసెస్: ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్, ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ ఏఐ పార్ట్‌నర్.
🔸 మైక్రోసాఫ్ట్: అజ్యూర్ ఏఐ ఇంజనీర్ అసోసియే ట్, అజ్యూర్ డేటా సైంటిస్ట్ అసోసియేట్, అజ్యూర్ ఏఐ ఫండమెంటల్స్.
🔸 డీప్ లెర్నింగ్.ఏఐ: ఎంఎల్ స్పెషలైజేషన్, డీప్ లెర్నింగ్ స్పెషలైజేషన్.
🔸 ఐబీఎం: ఐబీఎం ఏఐ/డేటా సైన్స్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్.
అకడమిక్ కోర్సులు
ఎంఎల్ స్పెషలైజేషన్స్‌తో బీటెక్, ఎంటెక్ స్థాయిలో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా ఐఐటీ–చెన్నైలో ఆన్‌లైన్ కోర్సు కూడా ఉంది. దీంతోపాటు ఎన్‌పీటీఈఎల్/స్వయం, స్వయం ప్లస్‌లలో ఇండస్ట్రీ ఓరియెంటెడ్ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు.
నాన్–టెక్‌తో కూడా సాధ్యమే
నాన్–టెక్నికల్ విద్యార్థులు సైతం ఎంఎల్ విభాగంలో కొలువులను సొంతం చేసుకోవచ్చు. మ్యాథమె టిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ కోర్సులు చదివిన వారు పైథాన్ లాంగ్వేజ్‌పై పట్టు సాధించి.. ఎంఎల్ సర్టిఫికేషన్స్ పూర్తి చేయడం ద్వారా ఈ విభాగంలో ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. మెషిన్ లెర్నింగ్‌లో కెరీర్ కోరుకునే వారికి అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా మేనేజ్‌మెంట్, స్టాటిస్టికల్ స్కిల్స్, మ్యాథమెటికల్, కంప్యుటేషనల్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్ ఉండాలి.
నిపుణుల కొరత
మెషీన్ లెర్నింగ్ విభాగంలో మానవ వనరుల కొరత ఉంది. నాస్‌కామ్ నివేదిక ప్రకారం– పది లక్షల మంది ఎంఎల్ నిపుణుల అవసరం ఉంది. కానీ అందుబాటులో ఉన్న నిపుణుల సంఖ్య మాత్రం 3.5 లక్షలుగానే నమోదైంది. నీతి ఆయోగ్ నివేదిక కూడా ఈ రంగంలో 50 శాతం మాత్రమే నిపుణులు అందుబాటులో ఉన్నారని పేర్కొంది. డిమాండ్ ప్రతి ఏటా 25 శాతం పెరుగుతుంటే.. నిపుణులైన అభ్యర్థుల సంఖ్య మాత్రం 15 శాతంగానే నమోదవుతోంది. మరోవైపు మిడిల్ లెవల్‌లోనూ ఎంఎల్ నిపుణులకు డిమాండ్ నెలకొంది.
వేతనాలు మెరుగ్గా..
మెషిన్ లెర్నింగ్‌లో నైపుణ్యం సాధిస్తే వేతనాలు కూడా మెరుగ్గానే ఉంటున్నాయి. ఎంట్రీ లెవల్‌లో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌కు రూ.5 లక్షల వార్షిక సగటు వేతనం లభిస్తుంది. ఆ తర్వాత డేటా అనలిటిక్ స్పెషలిస్ట్స్, మోడలింగ్ అనలిస్ట్స్ వంటి హోదాల్లో సగటున రూ.ఆరు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వార్షిక వేతనం అందుతోంది.


