ఉన్న ఉద్యోగం పోతే.. మరో ఉద్యోగం వెతుక్కోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఉద్యోగం సంపాదించడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఎన్ని కంపెనీలకు అప్లై చేసినా, ఇంటర్వ్యూలలో బాగా సమాధానాలు చెప్పినప్పటికీ.. చివరకు ఉద్యోగం రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ వ్యక్తి అనుభవం చూస్తే అర్థమవుతుంది. ఏడు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా.. ఇప్పటివరకు ఒక్క ఆఫర్ కూడా రాలేదని ఆయన సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకున్నారు.
55 కంపెనీలు.. 25 ఇంటర్వ్యూలు
రెడ్డిట్‌లో వెల్లడైన వివరాల ప్రకారం.. గత ఏడు నెలల్లో మొత్తం 175 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 55 కంపెనీల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 25 ఇంటర్వ్యూలు చివరి రౌండ్ వరకు వెళ్లాయి. అయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కూడా లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉద్యోగం లేకపోవడంతో గతంలో క్రమం తప్పకుండా కొనుగోలు చేసే ప్రోటీన్ డ్రింక్‌ను కూడా ఇప్పుడు కొనలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగం కోసం తనవంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు రెడ్డిట్‌లో తెలిపారు. తన రెజ్యూమ్‌కు సరిపోయే ఉద్యోగాలను వెతికేందుకు ఏఐ సాయం కూడా తీసుకున్నారు. తన అనుభవాలు, నైపుణ్యాలను అర్థం చేసుకుని, వాటికి సరిపోయే ఉద్యోగాలను ఇంటర్నెట్‌లో వెతికేలా ఒక ఏఐ ఏజెంట్‌ను రూపొందించుకున్నారు. తన అర్హతలకు 95 శాతానికి పైగా సరిపోయే ఉద్యోగాలకే దరఖాస్తు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ చాలా దారుణంగా ఉందని, త్వరలోనైనా మంచి ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
నెటిజన్ల రియాక్షన్
ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు.. తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని కామెంట్లు చేశారు. తాను కూడా నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని, ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే టాప్-3 అభ్యర్థుల్లో చోటు దక్కిందని ఒకరు చెప్పారు. మరో యూజర్ ఫిబ్రవరిలో ఉద్యోగం కోల్పోయి, తిరిగి కొత్త ఉద్యోగం సంపాదించడానికి ఆగస్టు వరకు ఎదురుచూడాల్సి వచ్చిందని తెలిపారు.
మరికొందరు మాత్రం ఆ వ్యక్తికి ధైర్యం చెప్పారు. 25 ఇంటర్వ్యూలు చివరి రౌండ్ వరకు వెళ్లాయంటే ఆయనలో నైపుణ్యాలు, అర్హతలు ఉన్నట్లేనని అభిప్రాయపడ్డారు. ప్రతిసారీ ఉద్యోగం రాకపోవడానికి అభ్యర్థిలోనే లోపం ఉండాల్సిన అవసరం లేదని, కొన్నిసార్లు కంపెనీలు తమకు తెలిసిన వారిని లేదా ప్రత్యేక అనుభవం ఉన్నవారిని ఎంపిక చేసుకుంటాయని చెప్పారు. ఇంటర్వ్యూల్లో తన నైపుణ్యాలను మరింత బాగా వివరించేలా ప్రాక్టీస్ చేయాలని సూచించారు.
ఉద్యోగ మార్కెట్ పరిస్థితి ఇదే
ఈ ఘటన చూస్తుంటే.. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మంచి చదువు, అనుభవం, నైపుణ్యాలు ఉన్నప్పటికీ.. ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం లేకుండా పోతోంది. ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయిన తర్వాత.. కొత్త ఉద్యోగం వచ్చే వరకు ఆర్థికంగా నిలదొక్కుకోవడం పెద్ద సవాలుగా మారుతోంది. అందుకే ఉద్యోగంలో ఉన్నప్పుడే.. కొంత పొదుపు చేసుకోవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సైతం చెబుతూనే ఉన్నారు.
ఇదీ చదవండి: దీపావళి వేళ స్టాక్ మార్కెట్ల సందడి.. ట్రేడింగ్ టైమింగ్స్ ఇవే!


