న్యూఢిల్లీ: యాక్టివ్ క్లయింట్ల సంఖ్య పరంగా దేశంలో రెండో అతిపెద్ద స్టాక్ బ్రోకింగ్ సంస్థగా ‘ఏంజెల్ వన్’ అవతరించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) అక్టోబర్ ముగింపు గణాంకాల ప్రకారం.. ఏంజెల్ వన్ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య ఏకంగా 69.98 లక్షలకు చేరుకుంది.
ఎన్‌ఎస్‌ఈలో ఉన్న మొత్తం 4.67 కోట్ల మంది యాక్టివ్ ఇన్వెస్టర్లలో ఈ సంస్థ 14.97 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. కేవలం అక్టోబర్‌లోనే కొత్తగా 2.43 లక్షల నికర యాక్టివ్ ఖాతాలు జతకావడం విశేషం. దీనితో కంపెనీ మొత్తం కస్టమర్ల బేస్ వార్షిక ప్రాతిపదికన 17.4% పెరిగి 4.06 కోట్లకు చేరింది. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో 15 లక్షల మంది చేరడంతో అక్టోబర్‌లో సంస్థ చారిత్రక 4 కోట్ల మైలురాయిని దాటింది.
58% పెరిగిన నికర లాభం
క్లయింట్ల సంఖ్యతో పాటు కంపెనీ ఆర్థిక పనితీరూ మెరుగైంది. ట్రేడింగ్ లావాదేవీలు అక్టోబర్‌లో పుంజుకోవడంతో సగటు రోజువారీ ఆర్డర్లు నెలావారీగా 19.6% పెరిగి 69.7 లక్షలుగా నమోదయ్యాయి. త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 18.7% పెరిగి రూ.1,427 కోట్లకు చేరగా.. నికర లాభం 58.2% ఎగబాకి రూ.335 కోట్లను తాకింది. కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ సైతం 19.1% వృద్ధితో రూ.16,000 కోట్లకు చేరుకుంది.


