బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) చేసేవారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీపి కబురు అందించింది. ఎంపిక చేసిన కాలపరిమితుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.3 కోట్లలోపు చేసే ఎఫ్‌డీలకు సంబంధించి సవరించిన రేట్లు నవంబర్ 4, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. కొన్ని కాలపరిమితులపై గరిష్ఠంగా 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) మేర వడ్డీ పెరిగింది. తాజా మార్పులతో సాధారణ ఖాతాదారులు గరిష్ఠంగా 6.60 శాతం, సీనియర్ సిటిజన్లు 7.20 శాతం వడ్డీ పొందవచ్చు.
సాధారణ ఖాతాదారులకు ఎంత వడ్డీ?
61 రోజుల నుంచి ఆరు నెలల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 4.25 శాతం నుంచి 4.75 శాతానికి పెంచింది. మూడేళ్లకు పైబడి పదేళ్ల వరకు చేసే డిపాజిట్లపై గరిష్ఠంగా 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో ఈ దీర్ఘకాలిక డిపాజిట్లపై గరిష్ఠ రేటు 6.15 శాతంగా ఉండేది. అయితే 60 రోజుల వరకు ఉండే డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు.
సీనియర్ సిటిజన్లకు మరింత ప్రయోజనం
వృద్ధులకు కూడా బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. 61 రోజుల నుంచి ఆరు నెలల లోపు డిపాజిట్లపై 4.75 శాతంగా ఉన్న వడ్డీని 5.25 శాతానికి చేర్చింది. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల వరకు చేసే ఎఫ్‌డీలపై అత్యధికంగా 7.20 శాతం వడ్డీ అందిస్తోంది. ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ లభిస్తుంది.
ఇతర బ్యాంకుల్లోనూ వడ్డీ రేట్ల సవరణ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా ఇటీవల ఎంపిక చేసిన కాలపరిమితుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు డిపాజిట్ కాలపరిమితి, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు, పన్నుల అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇదీ చదవండి: దీపావళి బోనస్ వచ్చిందా? ఇలా చేస్తే బెస్ట్!


