భారత ఐటీ కంపెనీలకు శాపమే వరంగా మారుతుందా? | US Visa Crisis Why Indian IT Giants Are Bet Big on Offshore Hiring | Sakshi
Sakshi News home page

భారత ఐటీ కంపెనీలకు శాపమే వరంగా మారుతుందా?

Nov 7 2026 2:21 PM | Updated on Nov 7 2026 2:26 PM

US Visa Crisis Why Indian IT Giants Are Bet Big on Offshore Hiring

అమెరికాలో విదేశీ ఉద్యోగులకు సంబంధించి మారుతున్న వలస విధానాలు, వీసా నిబంధనల కఠినతరం భారతీయ ఐటీ రంగాన్ని పునరాలోచనలో పడేశాయి. ఇటీవల అమెరికా కార్మిక శాఖ కొన్ని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు సంబంధించి శాశ్వత కార్మిక ధ్రువీకరణ (పీఈఆర్‌ఎం) కార్యక్రమం కింద కొత్త, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిలిపివేయడం టెక్ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ ఐటీ దిగ్గజాలు అమెరికా స్థానిక మార్కెట్‌పైనే పూర్తిగా ఆధారపడకుండా భారతదేశంలోనే ఉద్యోగులను నియమించుకోవడం (ఆఫ్‌షోర్‌ హైరింగ్‌), ప్రాజెక్ట్‌లను ఇక్కడి నుంచే నిర్వహించడంపై దృష్టి సారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అమెరికా వీసా అడ్డంకుల అసలు రూపం

గత అక్టోబర్ 8న అమెరికా కార్మిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నేరుగా హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగుల గ్రీన్ కార్డ్ ప్రక్రియను ప్రభావితం చేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న హెచ్-1బీ వీసాలపై లేదా ప్రస్తుత ఉద్యోగాలపై దీని తక్షణ ప్రభావం లేనప్పటికీ అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే నిపుణులకు ఇది నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా దేశీయ రాజకీయ సమీకరణాలు, గృహోపకరణాల ఒత్తిళ్ల కారణంగా ఈ కఠిన నిబంధనలు తెరపైకి వచ్చాయి.

ఐటీ కంపెనీల వ్యూహాత్మక మార్పు

అమెరికాలో పెరుగుతున్న వీసా ఆంక్షలు, స్థానికంగా నిపుణుల కొరత కారణంగా భారతీయ ఐటీ కంపెనీలు తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికాలోనే స్థానిక ఉద్యోగులను విపరీతమైన వేతనాలతో హైర్ చేసుకోవడం లేదా భారతీయులను అక్కడికి పంపడం కంటే పూర్తి స్థాయి ప్రాజెక్ట్ డెలివరీని ఆఫ్‌షోర్ కేంద్రాలకు తరలించడమే మేలైన వ్యూహంగా మారుతోంది.

దీనివల్ల బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె వంటి ప్రముఖ భారతీయ టెక్నాలజీ హబ్‌ల్లో హైరింగ్ కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి. కేవలం అమెరికాలో ఉన్న ఉద్యోగుల స్థానంలో ఇక్కడ కొత్తవారిని భర్తీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ కార్యకలాపాలను పూర్తిగా ఇక్కడి బృందాలకే అప్పగించే దిశగా ఐటీ దిగ్గజాలు అడుగులు వేస్తున్నాయి.

ఉద్యోగులపై ప్రభావం

ఈ వీసా నిబంధనల తాత్కాలిక నిలిపివేత వల్ల ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఇప్పటికే ఐ-140 (ఫామ్‌ ఐ-140 అనేది అమెరికాలో శాశ్వత నివాస హోదా-గ్రీన్ కార్డ్ పొందడం కోసం విదేశీ ఉద్యోగుల తరఫున అమెరికా కంపెనీలు దాఖలు చేసే ఒక అధికారిక పిటిషన్ దీన్ని అధికారికంగా Immigrant Petition for Alien Workers అని పిలుస్తారు) ఆమోదం పొందిన వారు మెరుగైన స్థితిలో ఉన్నారు. మరోవైపు, ఈ ఆంక్షల పరిధిలో లేని ఇతర కంపెనీలకు మారడం లేదా కెనడా వంటి దేశాల వైపు దృష్టి సారించడం వంటి ప్రత్యామ్నాయాలను కొందరు నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే, వలస విధానాల పరంగా వస్తున్న ఈ సవాళ్లు భారత్‌కు ఒక రకంగా శాపమే వరంగా మారే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: మాదేశం వచ్చినవారికి గుడ్‌న్యూస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement