హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డేటా లీకేజీపై దర్యాప్తు | HDFC Bank Internal Probe Flags Information Sharing by Executives | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డేటా లీకేజీపై దర్యాప్తు

Oct 21 2026 3:21 PM | Updated on Oct 21 2026 3:34 PM

HDFC Bank Internal Probe Flags Information Sharing by Executives

వాస్తవాలు సేకరిస్తున్న యాజమాన్యం

దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రహస్య సమాచార నిర్వహణకు సంబంధించి అంతర్గత సమీక్ష కొనసాగుతోంది. బ్యాంకు ఉన్నతాధికారుల మధ్య సమాచార లీకేజీపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ సమీక్ష చేపట్టినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అయితే, ఈ వ్యవహారంలో ఎవరు బాధ్యులు, ఏ సమాచారం బయటకు వెళ్లింది, దాని వల్ల ఎలాంటి ప్రభావం ఏర్పడిందన్న అంశాలపై బ్యాంకు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.

సమీక్ష ఫలితాల ఆధారంగా చర్యలు

ఈ అంశంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికార ప్రతినిధి స్పందిస్తూ.. సంస్థ విధానాలకు అనుగుణంగా సంబంధిత విషయాలపై అంతర్గత సమీక్ష జరుగుతోందని తెలిపారు. సంబంధిత వాస్తవాలను సేకరించి, పరిశీలించిన అనంతరం ఆ సమీక్ష ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నైతిక ప్రమాణాలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, సంభావ్య ఉల్లంఘనలపై వచ్చే సమాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తామని బ్యాంకు పేర్కొంది.

బ్యాంకు ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం, అనుమతి లేకుండా సంస్థ సమాచారాన్ని వెల్లడించడం, అంతర్గత మెయిళ్లు లేదా భవిష్యత్‌ ప్రాజెక్టుల వివరాలను పంచుకోవడం నిషేధం. ఇటువంటి లీకేజీలు ఉద్దేశపూర్వకమైనవైనా లేదా అనుకోకుండా జరిగినవైనా క్రమశిక్షణ చర్యలకు దారితీయవచ్చని బ్యాంకు అధికారిక విధాన పత్రం స్పష్టం చేస్తోంది. అలాగే, గోప్య లేదా సున్నితమైన సమాచార దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు సంస్థలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

త్వరలో కొత్త సీఈఓ

ఈ పరిణామం బ్యాంకు నాయకత్వంలో కీలక మార్పుల దశలో వెలుగుచూడటం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్‌ 27న అనుప్‌ బాగ్చీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ పదవీకాలం ముగియడంతో ఈ మార్పు జరుగుతోంది. కాబట్టి బ్యాంకులో కొనసాగుతున్న అంతర్గత సమీక్షలో వెలువడే తుది నిర్ధారణలు, తదుపరి చర్యలు బ్యాంకు గవర్నెన్స్‌, అంతర్గత నియంత్రణ వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: సౌర విద్యుత్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement