హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులు 2027 జనవరి 1 నుంచి రూ.500 లేదా అంతకంటే తక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లను పొందలేరు. రూ.200, రూ.300, రూ.400 వంటి చిన్న మొత్తాల చెల్లింపులకు ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్లు నిలిచిపోతాయి. అయితే, మొత్తంతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ అలర్ట్‌లు యథావిధిగా వస్తాయి. రూ.500 కంటే ఎక్కువ మొత్తాల యూపీఐ చెల్లింపులకు ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు కొనసాగుతాయి.
ఆర్‌బీఐ మార్గదర్శకాల నేపథ్యంలో మార్పు
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల అలర్ట్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సవరించిన మార్గదర్శకాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.500 కంటే ఎక్కువ విలువైన ఎలక్ట్రానిక్ లావాదేవీలకు బ్యాంకులు తక్షణ ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు పంపడం తప్పనిసరి. రూ.500 లేదా అంతకంటే తక్కువ మొత్తాల లావాదేవీలకు ఎస్‌ఎంఎస్ పంపాలా వద్దా అనే అంశాన్ని బ్యాంకులు తమ అంతర్గత విధానాల మేరకు నిర్ణయించుకోవచ్చు. అలర్ట్‌ల కోసం ఖాతాదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు.
ఖాతాదారులు ఏం చేయాలి?
ఈమెయిల్ అలర్ట్‌లు నిరంతరం అందాలంటే ఖాతాతో అనుసంధానమైన ఈమెయిల్ చిరునామాను ఖాతాదారులు తనిఖీ చేసుకోవాలి. పాత ఈమెయిల్ వాడుకలో లేకపోతే ఖాతా రకాన్ని బట్టి ఇన్‌స్టాసర్వీసెస్, నెట్‌బ్యాంకింగ్ లేదా బ్యాంకు శాఖ ద్వారా నవీకరించుకోవాలి. ఎస్‌ఎంఎస్ రాకపోతే చెల్లింపు విఫలమైనట్లు కాదు. యూపీఐ యాప్, ఖాతా స్టేట్‌మెంట్ లేదా ఈమెయిల్ ద్వారా లావాదేవీ స్థితిని నిర్ధారించుకోవచ్చు. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి.
డిజిటల్ చెల్లింపుల నేపథ్యంలో..
యూపీఐ వినియోగం వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఈ మార్పు అమల్లోకి వస్తోంది. 2026 అక్టోబర్‌లో యూపీఐ ద్వారా సుమారు 25.47 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.31.53 లక్షల కోట్లుగా ఉంది. రోజువారీ సగటు లావాదేవీలు 82.2 కోట్లకు చేరగా వాటి విలువ రోజుకు రూ.లక్ష కోట్లు దాటింది. చిన్న మొత్తాల చెల్లింపులకు ఎస్‌ఎంఎస్‌లు నిలిచిపోతే బ్యాంకు సందేశాలు తగ్గవచ్చు. ఖాతాదారులు ఈమెయిల్ వివరాలు నవీకరించుకుని యూపీఐ యాప్‌లో లావాదేవీల హిస్టరీని క్రమం తప్పకుండా పరిశీలించడం అవసరం.
ఇదీ చదవండి: ధరలతో చిర్రెత్తిన ఉల్లి, వెల్లుల్లి!


