బంగారం ధరలు తగ్గుతున్నాయంటూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ రచయిత, ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki)అభిప్రాయపడ్డారు. బంగారం ధర ఒక్కరోజే ఔన్సుకు 73 డాలర్లు తగ్గి 3,713 డాలర్లకు చేరడంతో మార్కెట్‌లో బంగారం బుడగ పేలిందంటూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే, బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకోవడం కంటే.. బంగారు గనుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఆయన సూచించారు.
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత కియోసాకి తన ఫేస్‌బుక్ పోస్టులో ఈ అంశాలను ప్రస్తావించారు. బంగారాన్ని భద్రంగా దాచుకోవడం సంపదను కాపాడితే.. బంగారు గని ఆదాయాన్ని అందిస్తుందని తన రిచ్ డాడ్ చెప్పేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రైవేటు బంగారు గనుల్లో ఒక ఔన్స్ బంగారాన్ని వెలికితీసేందుకు సుమారు 1,500 డాలర్లు ఖర్చవుతోందని వివరించారు. మార్కెట్‌లో ఔన్స్ ధర 3,713 డాలర్లుగా ఉన్నందున, ఖర్చులు మినహాయించకముందే ఒక్కో ఔన్స్‌పై 2,200 డాలర్లకు పైగా వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రైవేటు గనుల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు సామాన్య ఇన్వెస్టర్లకు సులభంగా అందుబాటులో ఉండవని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బిలియనీర్లు, కుటుంబ కార్యాలయాల కోసం 9 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడుల సమీకరణలో అనుభవం ఉన్న డెవన్ జాన్సన్ పరిచయమయ్యారని తెలిపారు. ఆమె ఏర్పాటు చేసిన 'క్యాపిటల్ క్లబ్' ద్వారా ప్రైవేటు పెట్టుబడుల అవకాశాలను పరిచయం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వేదికలో అనుభవజ్ఞులైన భూగర్భ అన్వేషణ నిపుణులు నిర్వహిస్తున్న ప్రైవేటు బంగారం, వెండి మైనింగ్ సంస్థలో పెట్టుబడులకు అవకాశం ఉందని చెప్పారు. ఈ సంస్థ భవిష్యత్తులో పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని, ముందుగానే పెట్టుబడులు పెట్టేవారికి 4 నుంచి 8 రెట్ల రాబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇవి అంచనాలు మాత్రమేనని, పెట్టుబడిపై రాబడికి హామీ లేదని గుర్తుంచుకోవాలి.
భారత్‌లో బంగారం ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలు రోజుకో రీతిలో మారిపోతున్నాయి. రెండు రోజులుగా భారీగా పెరిగి బెంబేలెత్తించిన పసిడి ధరలు నేడు (శనివారం) కొంత తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని కాగా భారత్‌లోని ప్రధాన నగరాలలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడొచ్చు..
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


