CBSE: ఎనిమిదేళ్లలో కెమిస్ట్రీకి 70% పెరిగిన ఆదరణ! | CBSE 12 Board Exam Students to Attract Science Stream | Sakshi
Sakshi News home page

CBSE: ఎనిమిదేళ్లలో కెమిస్ట్రీకి 70% పెరిగిన ఆదరణ!

Nov 28 2026 11:03 AM | Updated on Nov 28 2026 11:03 AM

CBSE 12 Board Exam Students to Attract Science Stream

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ గణాంకాలు విద్యార్థుల్లో సైన్స్‌ సబ్జెక్టులపై పెరుగుతున్న ఆసక్తిని వెల్లడిస్తున్నాయి. కామర్స్‌, ఆర్ట్స్‌ విభాగాలతో పోలిస్తే సైన్స్‌ సబ్జెక్టులను ఎంచుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇంగ్లిష్ తర్వాత అత్యధిక శాతం విద్యార్థులు కెమిస్ట్రీని ఎంపిక చేసుకున్నారు. 2027 బోర్డు పరీక్షల కోసం దాదాపు 19 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో 57 శాతం మంది కెమిస్ట్రీని ఎంచుకోవడం విశేషం.

ఇంగ్లిష్‌కు తొలి ప్రాధాన్యం
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు అత్యధిక మంది ఇంగ్లిష్ సబ్జెక్టును ఎంపిక చేసుకున్నారు. సుమారు 18.5 లక్షల మంది ఈ సబ్జెక్టుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది మొత్తం విద్యార్థుల్లో 97 శాతానికి పైగా ఉంది. ఇంగ్లిష్ తర్వాత కెమిస్ట్రీ రెండో స్థానంలో నిలిచింది.

కెమిస్ట్రీకి 57 శాతం మంది..
2027 బోర్డు పరీక్షల కోసం సుమారు 10.8 లక్షల మంది విద్యార్థులు కెమిస్ట్రీని ఎంచుకున్నారు. మొత్తం 19 లక్షల మంది పరీక్షార్థులతో పోలిస్తే ఇది దాదాపు 57 శాతం. ఫిజిక్స్‌ను సుమారు 10 లక్షల మంది ఎంపిక చేసుకోగా.. మొత్తం విద్యార్థుల్లో 52.6 శాతంగా ఉంది. గణితాన్ని సుమారు 8.3 లక్షల మంది ఎంచుకున్నారు. ఇది 43.4 శాతానికి సమానం.

ఎనిమిదేళ్లలో భారీ పెరుగుదల
2019తో పోలిస్తే 2027లో కెమిస్ట్రీ రిజిస్ట్రేషన్లు 70 శాతం పెరిగాయి. ఫిజిక్స్‌లో 58 శాతం, గణితంలో 55 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో బిజినెస్ స్టడీస్, అకౌంటెన్సీ సబ్జెక్టుల రిజిస్ట్రేషన్లు సుమారు 32 శాతం చొప్పున మాత్రమే పెరిగాయి. దీంతో సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థుల ఆసక్తి మరింత స్పష్టమవుతోంది.

పెరుగుతున్న వ్యత్యాసం
కెమిస్ట్రీ, బిజినెస్ స్టడీస్ రిజిస్ట్రేషన్ల మధ్య వ్యత్యాసం 2019లో సుమారు 2.9 లక్షలుగా ఉండగా.. 2027 నాటికి 6.3 లక్షలకు పెరిగింది. అలాగే ఫిజిక్స్, అకౌంటెన్సీ మధ్య తేడా కూడా 2.9 లక్షల నుంచి 5.5 లక్షలకు చేరింది. సైన్స్ సబ్జెక్టులకు పెరుగుతున్న ఆదరణను ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

19 లక్షలకు చేరిన రిజిస్ట్రేషన్లు
2027 సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు సుమారు 19 లక్షల మంది విద్యార్థులు ప్రొవిజనల్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2026తో పోలిస్తే ఇది 2.3 శాతం అధికం. 2022లో 12వ తరగతి రిజిస్ట్రేషన్లు సుమారు 14.5 లక్షలు ఉండగా.. 2026 నాటికి 18.6 లక్షలకు చేరాయి.

జాతీయ స్థాయిలోనూ సైన్స్‌ ఆదరణ
విద్యా మంత్రిత్వ శాఖ విశ్లేషణ ప్రకారం.. దేశవ్యాప్తంగా 2024లో 12వ తరగతి ఉత్తీర్ణులైన వారిలో 47 శాతం మంది సైన్స్‌ విభాగానికి చెందినవారు. 2023లో ఈ సంఖ్య 44 శాతంగా ఉంది. కనీసం దశాబ్ద కాలంలో తొలిసారిగా 2024లో ఆర్ట్స్‌తో పోలిస్తే సైన్స్‌ విభాగంలో ఉత్తీర్ణులైన బాలికల సంఖ్య ఎక్కువగా నమోదైంది.

ఫిబ్రవరి 16 నుంచి పరీక్షలు
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు 2027 ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 9 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9 వరకు కొనసాగనున్నాయి. పదో తరగతిలో 83 సబ్జెక్టులకు, 12వ తరగతిలో 121 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ గణాంకాలు ప్రొవిజనల్ మాత్రమేనని, వీటిలో స్వల్ప మార్పులు ఉండవచ్చని తెలియవచ్చింది. 

ఇదీ చదవండి: జమ్మూ కశ్మీర్‌కు కొత్త అడ్వకేట్ జనరల్.. ఎవరీ ఫైసల్ ఖాద్రీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement