పితృత్వ సెలవు ప్రకటించిన తమిళనాడు సీఎం
సాక్షి స్పెషల్ డెస్క్: మహిళలకు ఉద్యోగాలిస్తే వారు మాతృత్వ సెలవులు, బిడ్డ పెరిగి పెద్దవుతున్న క్రమంలో పిల్లల సంరక్షణ కోసం తరచూ సెలవులు పెడతారనే అభిప్రాయం సంస్థ యజమానుల్లో స్థిరంగా ఉంటుంది. కానీ ఇటీవల ఆ లెక్క తప్పుతోంది. మెదడులో కొత్త అభిప్రాయాన్ని రాసుకోవాల్సిన సమయం వచ్చింది. 2021 నుంచి 2025 వరకు పిల్లల బాగోగుల కోసం సెలవులు పెట్టిన వాళ్లలో మహిళలకంటే మగవాళ్లే ఐదు రెట్లు ఎక్కువ. ఈ మార్పు 2016 నుంచి మొదలైంది. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
పిల్లల సంరక్షణ కోసం సెలవులు మహిళలే ఎక్కువగా తీసుకుంటారనే సాధారణ అపోహను తాజా గణాంకాలు తలకిందులు చేస్తున్నాయి. వేతనంతో కూడిన సెలవుల వినియోగంలో మగవాళ్లు మహిళల కంటే ముందు ఉంటున్నారని కేపీఎమ్‌జీ వర్కింగ్ పేరెంట్స్ సర్వే నివేదిక ప్రకారం, 2021 – 2025 మధ్య మొదటిసారి తండ్రులైన వారిలో 74 శాతం మంది తండ్రులు సెలవులు తీసుకున్నారు. 1986కి ముందు ఈ సంఖ్య కేవలం 13.7 శాతంగా మాత్రమే ఉండేది.
ఈ మార్పు 2016 నుంచి మొదలైంది. నవజాత శిశువుల సంరక్షణ కోసం తల్లుల కంటే తండ్రులే ఎక్కువగా వేతనంతో కూడిన సెలవులను ఉపయోగించుకుంటున్నారు.
2019–2025 మధ్య తొలి బిడ్డను కన్న వారిలో పిల్లల సంక్షణ కోసం సెలవు పెట్టిన తండ్రులు 53.1 శాతంగా ఉంటే, తల్లుల 52.6శాతం ఉన్నారు.
ఇరువురి సెలవుల నిష్పత్తిలో సమానత్వం దాదాపుగా కనిపించినప్పటికీ, సెలవుల స్వరూపంలో తేడా ఉంది. తల్లులు వేతనం లేని సెలవులు ఎక్కువగా తీసుకుంటుంటే, తండ్రులు వేతనంతో కూడిన సెలవులను మూడు రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు.
మహిళల పట్ల హెచ్‌ఆర్ వ్యతిరేకధోరణి!
మహిళలు కుటుంబ బాధ్యతల కోసం ఎక్కువ సెలవులు తీసుకుంటారని హెచ్‌ఆర్ అధికారులు తప్పుగా అంచనా వేస్తున్నారని ‘ది స్టాండర్డ్’సంస్థ సర్వే స్పష్టం చేసింది. మగవాళ్ల సెలవును అర్థవంతమైనవిగా భావిస్తూ, మహిళల సెలవుల పట్ల వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నారని అధ్యయనం నివేదిక చెప్తోంది. ఉద్యోగుల వాస్తవ గణాంకాలు ఇరువురి మధ్య అంతరం చాలా తక్కువగా ఉందని నిరూపిస్తున్నాయి.
పితృత్వ సెలవు ప్రకటించిన తమిళనాడు సీఎం
రాష్ట్ర స్థాయి చట్టాలు, ప్రైవేట్ సంస్థల ప్రోత్సాహకాల వల్ల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుల సదుపాయం విస్తరించింది. ఫలితంగా, ఉద్యోగం కోల్పోతామనే భయం తగ్గి, పిల్లల పెంపకంలో తండ్రులు చురుకైన పాత్ర పోషించడానికి దోహదం చేస్తోంది. కార్యాలయాల్లో కనిపిస్తున్న ఈ మార్పు సమాజంలో కొత్త పథంలో నడిపించడానికి దోహదం చేస్తుంది. ఇది ఇలా ఉంటే నిన్నటి రోజున (2026 నవంబర్ 26) తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర ప్రభుత్వ పురుష ఉద్యోగులకు 15 రోజుల వేతనంతో కూడిన పితృత్వ సెలవును ప్రకటించి, ఈ ప్రగతిశీల మార్పుకు మరింత ఊతమిచ్చారు.
ఇదీ చదవండి: బాల్యాన్ని మింగేస్తున్న స్క్రీన్!


