ఏ రంగు కొవ్వొత్తి ఎందుకు వెలిగిస్తారో తెలుసా? | Advent Season Christmas Candle Importance | Sakshi
Sakshi News home page

ఏ రంగు కొవ్వొత్తి ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

Nov 28 2026 8:19 AM | Updated on Nov 28 2026 8:19 AM

Advent Season Christmas Candle Importance

ఆగమనం

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సందడి నవంబర్‌ చివరి అదివారం నుంచి మొదలవుతుంది. అప్పట్నుంచి డిసెంబరు 24 వరకు అడ్వంట్‌ కాలం అంటారు. ఏసు జననానికి ముందు వచ్చే ఆగమనాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించే కాలం ఇది. ఈ నాలుగు ఆదివారాల్లో ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత. మొదటి ఆదివారం నవంబర్‌ 29న ఉదారంగు ఉన్న మైనపు వత్తిని చర్చిలో వెలిగిస్తారు.

ఊదారంగుకు రాజచిహ్నమైన రంగుగా గుర్తింపు ఉంది. ఏసు రాకకోసం నిరీక్షించడానికి ఇది సంకేతం. దీన్ని ప్రవక్తల కొవ్వొత్తి అంటారు. ఏసు జననానికి ముందు వందల ఏళ్లకు పూర్వమే రాజాధిరాజు జన్మిస్తాడని, ఆయనే లోకరక్షకుడనీ, కన్య గర్భాన జన్మిస్తాడనీ, ఆయన భుజము మీద రాజ్య భారముంటుందనీ ప్రవచనం చేశాడు యెషయా ప్రవక్త (యెషయా 9:6). మీకా అనే ప్రవక్త ఏసు బెత్లెహేములోనే జన్మిస్తాడని నిర్ధారించాడు (మీకా 5:2).

డిసెంబర్‌ 6న అడ్వంట్‌లోని రెండో ఆదివారం. ఈ వారం కూడా ఊదారంగు కొవ్వొత్తినే వెలిగిస్తారు. ఇది శాంతికి చిహ్నం. దీన్నే బెత్తెహేము మైనపు వత్తి అంటారు. ప్రపంచ శాంతి, సమాధానం, ఐక్యతల గుర్తుగా ఈ వారం ప్రార్థ నలు జరుగుతాయి. డిసెంబరు 13 మూడవ ఆదివారం. ఈ వారం గులాబిరంగు కొవ్వొత్తి వెలిగిస్తారు. ఈ రంగు ఆనంద సంతోషాలకు గుర్తు. గొర్రెల కాపరులకు గుర్తుగా మూడో ఆదివారం ఆచరిస్తారు. ఏసు జనన వార్త తొలిగా తెలిసింది గొర్రెల కాపరులకే.

చివరివారం అయిన డిసెంబర్‌ 20న మరలా ఊదారంగు కొవ్వొత్తినే వెలిగిస్తారు. దీన్ని దేవదూతల కొవ్వొత్తిగా పేర్కొంటారు. ఏసు జన్మించినపుడు దేవదూతలు ఆనంద గానాలు చేసి ఆరాధించారు. ఆపై ఏసు జనన శుభవార్తను తొలిగా గొర్రెల కాపరులకు తెలియజేశారు. క్రిస్మస్‌ రోజు మాత్రం తెల్లని కొవ్వొత్తి వెలిగిస్తారు.

ఈ ఆగమన కాలం అంతా ఇళ్లలోనూ, ఆలయాల్లోనూ పచ్చని చెట్లు, కొమ్మలతో చేసిన గుండ్రని ‘రీత్‌’ అలంక రిస్తారు. ఏసు లోకానికి వెలుగు అని రంగురంగుల కొవ్వొత్తులను వెలిగించి, పేదసాదలను ఆదరించి సాయం చేయడం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు ఆచరించే ప్రాథమిక జీవన ప్రేమ సిద్ధాంతం.
– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి (నవంబర్‌ 29 నుంచి ముందస్తు క్రిస్మస్‌ ఆరాధన)

ఇదీ చదవండి: అప్రమత్తంగా...  శక్తిమంతంగా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement