క్యాచ్ ఫ్రేజ్
‘ప్రతి ఒక్కరూ గ్రామం నుంచి వచ్చిన వారే షనయా!’ అనేది సోషల్ మీడియాలో వైరల్ ట్రెండ్. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చే ప్రజలు ఎదుర్కొనే కులవివక్ష, వర్ణ వివక్షలను వ్యాఖ్యానిస్తూ మొదలైన ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కొన్ని నెలల క్రితం 22 సంవత్సరాల ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దివ్యాంశీ చౌహాన్ పోస్ట్ చేసిన వీడియోతో ఈ ట్రెండ్ మొదలైంది. నెలల వ్యవధిలోనే ఈ వీడియో 36 మిలియన్ వ్యూస్‌తో వైరల్ కావడం విశేషం.
పల్లెటూరి ప్రజల పట్ల ప్రదర్శించే చిన్నచూపును ఎత్తిచూపుతూ ‘షనయా’ అనే మాట వాడింది దివ్యాంశీ.
‘ప్రతి ఒక్కరు పల్లెటూరువారే షనయా. నీ పూర్వీకులు బాంద్రాలో, బూజీ కేఫ్ పక్కన, అవకాడో టోస్ట్ తింటూ పుట్టారని అనుకుంటున్నావా? నువ్వు పట్టణంలో ఉంటున్నావనే కారణంతో ఎవరినీ అగౌరవపరచకు. మనం భారతీయులం. సహజంగానే పల్లెటూరివాళ్లం’ అంటుంది దివ్యాంశీ. తమ సొంత వెర్షన్‌లతో దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ ట్రెండ్‌లో భాగం అయ్యారు. సెలబ్రిటీ సర్కిల్‌లోకి కూడా ఈ ట్రెండ్ చేరడం విశేషం. సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ ఇలా సరదాగా అన్నారు.
‘ఒకానొక టైమ్‌లో ప్రతి ఒక్కరూ వంట చేసేవారు షనయా! మన పూర్వీకులకు ఆన్‌లైన్ డెలివరీ సౌకర్యం లేదని విషయం నీకు తెలుసో లేదో!’
నటి షనయా కపూర్ కూడా ఈ వైరల్ ట్రెండ్‌పై స్పందించింది. ‘షనయా’ అనే క్యాచ్‌ఫ్రేజ్ చుట్టూ జరుగుతున్న చర్చలో భాగమైంది. అయితే ఈ ట్రెండ్‌పై విమర్శలు కూడా వచ్చాయి.
పురుషుడి పేరుకు బదులుగా మహిళ పేరును ఎందుకు ఎంచుకున్నారని కొందరు తప్పు పట్టారు. దివ్యాంశీని మహిళా వ్యతిరేకి’ అని ఆరోపించారు. ఈ విమర్శలకు దివ్యాంశీ ఇలా సమాధానం ఇచ్చింది... ‘ఈ ట్రెండ్‌ను కొందరు స్త్రీ ద్వేషపూరితం అంటున్నారు. ఎందుకంటే నేను అబ్బాయి పేరుకు బదులు షనయా అనే పేరును ఉపయోగించాను.
మహిళలు మాత్రం కులవివక్ష, వర్ణ వివక్ష చూపించరని ఎందుకనుకుంటున్నారు? చూపించరు అనుకోవడం వారిని ఉన్నతపీఠంపై ఉంచి చూస్తున్నట్లు కాదా! భారతీయ సమాజంలో జెండర్ గురించి చర్చించేటప్పుడు అది ఏకాకిగా ఉండదు. ఇతర సామాజిక అంశాలతో సంబంధం లేకుండా ఉండదు’ దివ్యాంశీ తన వీడియోతో పాటు జత చేసిన కాప్షన్‌లో ఇలా ఉంది:
‘మహిళల ప్రవర్తన సమస్యాత్మకంగా ఉంటే దాన్ని ఎత్తిచూపడం స్త్రీద్వేషం కాదు. స్త్రీ ద్వేషం అంటే ఏమిటి? అనే దానిపై మనకు స్పష్టత లేదు. అయితే ఇదంతా వైరల్ ట్రెండ్‌ను సమర్థించడం కోసం కాదు. వైరల్ ట్రెండ్ విస్తృతం అవుతున్న కొద్దీ కొన్నిసార్లు ఆ ట్రెండ్ అసలు ఉద్దేశం మరుగున పడవచ్చు’
ఇదీ చదవండి: ఫస్ట్ కంప్యూటరింగ్ ప్రోగ్రామ్... ఆమె చలువే!


