వాడి వేడిగా...  ఖలావాడి | Shobhita Thakur Khilawadi selected in competition at 45th Cambridge Film Festival | Sakshi
Sakshi News home page

వాడి వేడిగా...  ఖలావాడి

Nov 28 2026 1:20 AM | Updated on Nov 28 2026 1:20 AM

Shobhita Thakur Khilawadi selected in competition at 45th Cambridge Film Festival

సామాజికం

ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ) పూర్వ విద్యార్థి శోభిత ఠాకూర్‌ దర్శకత్వం వహించిన షార్ట్‌ఫిల్మ్‌ ‘ఖలావాడి’ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. మధ్యప్రదేశ్‌లోని బంచాడ సామాజిక వర్గంలోని యువతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై ఈ చిత్రం దృష్టి పెట్టింది.

డాక్టర్‌ కావాలనే తన కలను సాకారం చేసుకోవడానికి తమపై ఉన్న సామాజిక ఆంక్షలను ఉల్లంఘించే స్వప్న అనే పన్నేండేళ్ల బాలిక కథ... ఖలావాడి.

రష్యా, స్వీడన్, కెనడాలలో జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో‘ఖలావాడి’ అవార్డ్‌లు గెలుచుకుంది. కేంబ్రిడ్జిలో జరిగే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఎంపికైంది.
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్, నీమాచ్, రత్లాం జిల్లాలో బంచాడ సామాజిక వర్గంలోని మహిళలను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించుతుంటారు. ‘పుట్టుక ఆధారంగా బాలికలపై పరిమితులను విధించడం, అణగదొక్కడాన్ని సవాలు చేయాలనే లక్ష్యంతో ఖలావాడి చిత్రాన్ని రూపొందించాను’ అంటున్నారు ఠాకూర్‌.

ఈ చిత్రానికి ముందు ఆమె ఎంతో పరిశోధించారు. నీమాచ్‌ ప్రాంతంలో అక్కడి ప్రజల జీవనవిధానాన్ని దగ్గరి నుంచి గమనించారు. చాలామంది పిల్లలకు కులధృవీకరణలాంటి ప్రాథమిక పత్రాలు లేవు. ఒకవేళ అవి పొందాలనుకున్నా, ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తోంది. తండ్రుల పేర్లు అధికారిక రికార్డులలో లేకపోవడమే ప్రధాన కారణం. అట్టడుగు వర్గాల విద్యావకాశాలను, స్వీయనిర్ణయాధికారాన్ని అడ్డుకుంటున్న సామాజిక అవరోధాలపై...ఈ చిత్రం పదునైన విమర్శ.
‘ఖలావాడి’ చిత్ర ప్రభావం దాని ప్రాంతీయ మూలాలను దాటి దేశవిదేశాలకు విస్తరించింది. ఎన్నో దేశాల ప్రేక్షకులు సరిహద్దులకు అతీతంగా ఈ చిత్రంతో మమేకం అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement