సెన్సార్లు, ఏఐతో సాగు.. యువ రైతుకి అంతర్జాతీయ అవార్డు! | Portugal Farmer AI Smart Farming Sagubadi Agriculture | Sakshi
Sakshi News home page

సెన్సార్లు, ఏఐతో సాగు.. యువ రైతుకి అంతర్జాతీయ అవార్డు!

Nov 27 2026 9:04 AM | Updated on Nov 27 2026 9:12 AM

Portugal Farmer AI Smart Farming Sagubadi Agriculture

సాగుబడి

అనూరాధ కార్తె: నవంబర్‌ 21 నుంచి

పొలం చిన్నదైనా, పంటల వైవిధ్యం ఎక్కువగా ఉన్నా ఆధునిక డిజిటల్‌ సాంకేతికత తోడైతే అద్భుతాలు చేయవచ్చని పోర్చుగల్‌ యువ రైతు బెర్నార్డో వియెరా ఇ బ్రిటో నిరూపించారు. బ్రస్సెల్స్‌లోని యూరోపియన్‌ పార్లమెంట్‌లో ఇటీవల జరిగిన ‘యంగ్‌ ఫార్మర్స్‌ కాంగ్రెస్‌’ సదస్సులో ఆయన ప్రతిష్ఠాత్మక ‘డిజిటల్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ అగ్రికల్చర్‌’ అవార్డుతో పాటు 5 వేల యూరోల నగదు బహుమతిని గెలుచుకున్నారు.

క్రాప్‌లైఫ్‌ యూరప్‌ సంస్థ అందించిన ఈ పురస్కారం కోసం రుమేనియా, జర్మనీ, పోర్చుగల్‌ దేశాలకు చెందిన ముగ్గురు యువ రైతులు తుది పోటీలో నిలవగా, సమీకృత సాగు (ఇంటిగ్రేటివ్‌ ఫార్మింగ్‌)లో డిజిటల్‌ టెక్నాలజీని ఆచరణాత్మకంగా వినియోగించిన బెర్నార్డో విజేతగా నిలిచారు.

కన్సల్టెంట్‌ నుంచి ఆదర్శ రైతుగా..
గతంలో కార్పొరేట్‌ కన్సల్టెంట్‌గా పనిచేసిన బెర్నార్డో, ఆ పనికి స్వస్తి చెప్పి ఉత్తర పోర్చుగల్‌లోని తన కుటుంబ వారసత్వ భూమికి తిరిగి 2018లో చేరుకున్నారు. 24 హెక్టార్ల (సుమారు 60 ఎకరాలు) విస్తీర్ణంలో సమీకృత వ్యవసాయం మొదలుపెట్టారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ‘వాలే డోస్‌ ట్రెస్‌ ఇర్మావోస్‌’ పేరిట బహుళ పంటల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. గుడ్ల ఉత్పత్తి కోసం సేంద్రియ పద్ధతిలో కోళ్ల పెంపకంతో పాటు కివీ పండ్లు, ద్రాక్ష, మొక్కజొన్న, నిమ్మ సాగుతో పాటు వైన్, తేనె ఉత్పత్తి వంటి విభిన్న వ్యవసాయ కార్యకలాపాలను కేవలం ఐదుగురు శాశ్వత సిబ్బందితో సమర్థంగా నిర్వహిస్తుండటం విశేషం.

సాంకేతికతతో అద్భుత ఫలితాలు
బహుళ పంటల నిర్వహణ భారం కాకుండా ఉండేందుకు ఆయన సెన్సార్లు, కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్లను తన క్షేత్రంలో భాగం చేశారు.

  • నీటి పొదుపు: నేల, వాతావరణ సెన్సార్లు, ఏఐ ఆధారిత డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థ ద్వారా పంటల అవసరాన్ని బట్టి నీటిని అందిస్తున్నారు. ఫలితంగా సాగునీటి వృథా 30 నుంచి 35 శాతం తగ్గింది. ఉపగ్రహ చిత్రాల సాయంతో తోటల్లోని పంటల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

  • ఎరువుల ఖర్చుకు చెక్‌: కోళ్ల ఫారాల వాతావరణ నియంత్రణకు ఆటోమేషన్‌ వాడుతున్నారు. ఆ కోళ్ల ఎరువునే సేంద్రియ ఎరువుగా మార్చటం ద్వారా, బయటి నుంచి కొనుగోలు చేసే రసాయన ఎరువుల అవసరాన్ని 90 శాతం మేర తగ్గించుకోగలిగారు.

  • సౌరశక్తి వినియోగం: నీటిపారుదల, ఇతర అవసరాలకు సోలార్‌ ప్యానెల్స్, బ్యాటరీ స్టోరేజీ ద్వారా సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నారు. వైన్‌ తయారీలోనూ డిజిటల్‌ ఉష్ణోగ్రత నియంత్రణలను వాడుతున్నారు.

బెర్నార్డో గెలుపు సూత్రాలివే!

  • పంటల వైవిధ్యం: 24 హెక్టార్లలో సేంద్రియ గుడ్లు, కివీ, ద్రాక్ష, మొక్కజొన్న, నిమ్మ, తేనె ఉత్పత్తి.

  • తక్కువ సిబ్బంది: ఏఐ, సెన్సార్లు, ఆటోమేషన్‌ సాయంతో 60 ఎకరాలను కేవలం ఐదుగురితో నిర్వహణ.

  • వనరుల ఆదా: 35% సాగునీటి పొదుపు, కోళ్ల ఎరువుతో 90% బయటి ఎరువుల కొనుగోలు తగ్గింపు, సొంత సౌర విద్యుత్‌ వినియోగం.

తుది పోటీలో నిలిచిన మరో ఇద్దరు వీరే..
అవార్డు రేసులో నిలిచిన రుమేనియా రైతు మాటెయి టిటియాను అనే యువకుడు ‘డాన్యూబ్‌’ నదీ పరివాహక ప్రాంతంలో దుక్కి దున్నని (నో–టిల్‌) సాగుపై పరిశోధనలు చేస్తున్నారు. డ్రోన్లు, సెన్సార్ల సాయంతో 25 శాతం నీరు, వేల లీటర్ల డీజిల్‌ ఆదా చేస్తున్నారు. జర్మనీకి చెందిన జూలియస్‌ హెర్జోగ్‌ అనే రైతు ‘అగ్రార్‌ కోపైలట్‌’ అనే ఏఐ సాధనంతో రైతుల కార్యాలయ పత్రాల నిర్వహణ భారాన్ని తగ్గిస్తున్నారు.

అయితే, క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమిస్తూ చిన్న కమతం (60 ఎకరాలున్న బెర్నార్డో యూరప్‌ దేశాల్లో చిన్న రైతు కిందే లెక్క. ఎందుకంటే అక్కడ చాలా వ్యవసాయ క్షేత్రాలు వందలు, వేల ఎకరాల్లో విస్తరించి ఉంటాయి) లోనే బహుళ పంటలను లాభసాటిగా, పర్యావరణ హితంగా మార్చిన బెర్నార్డో విధానం న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకొని విజేతగా నిలిపింది.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

ఇదీ చదవండి: కార్తిక మాసంలో చిన్న దానమైనా.. అనంత పుణ్యఫలమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement