వృత్తి మీద బతికే కుటుంబాలు కోకొల్లలు... కాని కొన్ని వృత్తులు బతుకుదెరువు కోసం కుటుంబాలకు అలవాటవుతాయి. ఆ కోవకు చెందినవారే తెలంగాణలోని కామారెడ్డి జిల్లా, పిట్లం మండల కేంద్రంలోని షబానా, జహీరాబీ అనే మహిళలు...వీరి వృత్తి పూసల దండలు అల్లడం. ఎంతో ఓపికతో కూడిన పని అది. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నల్లపూసల దండను పరిగణిస్తారు. చుట్టుపక్కల ఎవరైనా పూసల దండ కావాలంటే షబానా, జహారాబీ దుకాణమే మొదట గుర్తు రావడం వీరి ప్రతిభకు నిదర్శనం.
చాలా ఓపికతో ఈ ఇద్దరు మహిళలు పూస, పూస గుచ్చుతూ నేర్పరితనంతో అల్లే రకరకాల దండల కోసం చుట్టు పక్కల వాళ్లకే కాదు నిజాంసాగర్, పెద్దకొడప్గల్ మండలాల నుంచే కాక పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లా కంగ్గి, కల్హేర్ మండలాల నుంచి చాలా మంది వస్తుంటారు. షబానా చిన్న తనంలోనే తన తల్లి దగ్గర పూసలు, గుండ్లతో దండలు అల్లడం నేర్చుకుంది.
వీరి పనితనం బాగుండడంతో చుట్టుపక్కల మహిళలు స్వర్ణకారుల వద్ద తయారు చేయించుకున్న బంగారపు గుండ్లు, ఇంకా చిన్నా చితకా ఆభర ణాలను కూడా వీళ్ల దగ్గరే దండలుగా అల్లించుకుంటారు. దాదాపు ప్రతిరోజూ గిరాకీ ఉంటుంది. అంగడి జరిగే శుక్రవారం ఎక్కువ మంది వస్తారు.
బతుకమ్మ, దసరా పండగ సీజన్‌లో అయితే చేతినిండా పని దొరుకుతుంది. ఒక్కో దండ అల్లడానికి రూ. 30 నుంచి రూ. 60 వరకు తీసుకుంటారు. దారాలు, పూసలకు అదనంగా చార్జీ చేస్తారు. రోజు కనీసం రూ.ఐదు వందల నుంచి రూ. ఎనిమిది వందల వరకు ఆదాయం పొందుతున్నారు. పెళ్లిళ్లు, పండగల సీజన్లలో ఎక్కువ గిరాకీ ఉండడంతో రెట్టింపు సంపాదన ఉంటుంది.
అల్లడం నేర్చుకుని..
‘‘పెళ్లయి అత్తారింటికి వచ్చేసరికి మా మామ నన్నేసాబ్ పూసలు అల్లేవారు. ఆయన చేస్తున్న పనిని చూసి పూసలు అల్లడం నేర్చుకున్నా. వివాహమై దాదాపు మూడున్నర దశాబ్దాలు గడిచింది, అప్పటి నుంచి పూసలు అల్లుతూ జీవనం సాగిస్తున్నా. పూసలు అల్లుతూ వచ్చే ఆదాయంతోనే ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేశా. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు పెళ్లిచేశా. నాకంటూ ఇంటిని కూడా నిర్మించుకున్నాను.’
– జహీరాబీ
– ఎస్. వేణుగోపాలచారిసాక్షి, కామారెడ్డి


