త్రినేత్ర సంగమం | AparnaSen unveiled her first photography exhibition, My Gaze at the KCC | Sakshi
Sakshi News home page

త్రినేత్ర సంగమం

Nov 27 2026 1:01 AM | Updated on Nov 27 2026 1:01 AM

AparnaSen unveiled her first photography exhibition, My Gaze at the KCC

అదర్‌ సైడ్‌

తన ఎనభై ఏళ్ల జీవితాన్ని ‘ఫొటో కెమెరా’తో పదహారేళ్ల యవ్వనిలా వెలిగిస్తున్నారు నటి–నిర్మాత–పత్రికా సంపాదకురాలు అపర్ణాసేన్‌. ఫొటోగ్రఫీలో ఎన్నో దశాబ్దాల అనుభవంతో, తొలిసారిగా ‘ది గేజ్‌’ పేరుతో ఫొటోగ్రఫీ బుక్‌ తీసుకు వచ్చారు. ఇది ఆమె చిత్ర ప్రయాణం కాదు. ఛాయాచిత్ర ప్రయాణం. జీవిత రహదారిలో ఎన్నో దృశ్యాల 
సంకలనం. తన రెండు కళ్లతోనే కాదు కెమెరా అనే మూడో కంటితో చూసిన అద్భుత ప్రపంచం... త్రినేత్ర సంగమం...

పదహారేళ్ల వయసులో సత్యజిత్‌ రే తీసిన ‘తీన్‌ కన్య’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన అపర్ణసేన్‌ మంచి ఫొటోగ్రాఫర్‌ కూడా. తాజా విషయానికి వస్తే... అపర్ణ సేన్‌ తొలి సోలో ఫొటో ఎగ్జిబిషన్‌ కోల్‌కత్తా సెంటర్‌ ఫర్‌ క్రియేటి (కెసీసీ)లో జరిగింది. ఈ ఫొటోగ్రఫీ పుస్తకానికి ప్రముఖ కవి జావెద్‌ అక్తర్‌ ముందు మాట, ఒక కవిత రాశారు. అందులో ఉర్దూ పదం నజర్‌ (దృష్టి)కి సంబంధించి లోతును అన్వేషిస్తారు. ‘మై గేజ్‌ అనేది ప్రపంచంపై అపర్ణసేన్‌ దృష్టి కోణం’ అంటారు జావెద్‌ అఖ్తర్‌.

మాన్‌సూన్‌ గర్ల్‌
పుస్తకం ప్రారంభంలో న్యూజిలాండ్‌ ఫొటోగ్రాఫర్‌ బ్రియాన్‌ తీసిన క్లోజప్‌ ఫొటో కనిపిస్తుంది. ఆ ఫొటోలో యువ అపర్ణసేన్‌ తన ముఖంపై పడుతున్న వర్షపు చినుకులను ఆస్వాదిస్తుంటారు. బ్రియాన్‌ తన ప్రసిద్ధ మాన్‌సూన్‌ సిరీస్‌ కోసం అపర్ణసేన్‌ను ఫొటో తీశారు. అపర్ణను బ్రియాన్‌ ‘మాన్‌సూన్‌ గర్ల్‌’ అని పిలిచేవారు!

నటిగా ఎంతోకాలం కెమెరా ముందు గడిపిన అపర్ణ ఆ తరువాత కెమెరాను చేతిలోకి తీసుకొని ‘ఆహా’ అనిపించే ఫొటోగ్రాఫర్‌గా మారారు.
‘రీనా(అపర్ణసేన్‌) ఒకరోజు నాకు ఫొటోగ్రఫీ నేర్చుకోవాలని ఉంది. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు అని నాతో చెప్పింది. నేను నా కెమెరాను ఆమెకు ఇచ్చి దీన్ని ఉపయోగించుకో.. అని కొన్ని సలహాలు ఇచ్చాను. ఇప్పుడు ఫొటోగ్రఫీలో ఆమె ప్రతిభ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అంటున్నారు గౌతమ్‌ ఘోష్‌.

ప్రత్యేక శైలి
హెన్రీ కార్టియర్‌–బ్రెసన్‌ స్టైల్లో  క్యాండిడ్‌ స్ట్రీట్‌ ఫొటోగ్రఫీ చేయాలని అపర్ణ చాలాకాలం కల కన్నారు. అయితే తాను నటి కావడంతో ఆ కల సాకారం కాలేదు. కల సాకారం కాకపోవడానికి ఒక సెలబ్రిటీగా ఎన్నో పరిమితులు ఉండడం కూడా ఓ ప్రధాన కారణం. ఆ పరిమితుల వల్లే తనకు ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పడింది. బహిరంగ ప్రదేశాలలో ఫొటోలు తీయడం వీలుకాక కాంతి, నిశ్శబ్దం, వాస్తుశిల్పం వైపు చూసింది ఆమె కెమెరా. అందుకే అపర్ణ ఛాయాచిత్రాలలో ద్వారాలు, తోరణాలు, ప్రతిబింబాలు ప్రత్యేక శైలిలో పదేపదే కనిపిస్తాయి. ‘నటిగా నాకు లభించిన గుర్తింపు వల్ల అందరిలా బయటకు వెళ్లడం కుదిరేది కాదు. దీంతో జన సంచారం లేని ప్రదేశాలలో మాత్రమే నా కెమెరాకు పని చెప్పేదాన్ని’ గతాన్ని గుర్తు చేసుకున్నారు అపర్ణసేన్‌.

దర్జీపారా
అపర్ణ సేన్‌ దృశ్య కల్పనలో కల్‌కత్తాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తర కోల్‌కత్తాలోని ఇరుకైన సందులు, సంప్రదాయం ఉట్టి పడే ఇళ్లు, వాస్తుశిల్పాలు ఆమె ఫొటోలలో కనిపిస్తాయి. కొత్త కొత్త మాల్స్‌ రావడం వల్ల సంప్రదాయ కళలు ఉట్టి పడే ఆనాటి ఇళ్లు కనుమరుగవుతున్నాయి. మళ్లీ అవి మన కళ్ల ముందుకు రావాలంటే ‘ది గేజ్‌’లోకి అడుగు పెట్టడం ఒక మార్గం. ‘కోల్‌కత్తాను  కెమెరా కంటితో చూడాలనుకుంటే మీరు మొదట ఎక్కడికి వెళతారు?’ అనే ప్రశ్నకు అపర్ణ ఇచ్చిన జవాబు..‘దర్జీపారా’ అపూర్వమైన సంప్రదాయ గృహాలకు దర్జీపారా ప్రసిద్ధి చెందింది. ‘కెమెరాను చేతిలోకి తీసుకుంటే నిశ్శబ్ద ప్రదేశాలు కూడా అనర్గళంగా మాట్లాడతాయి’ అంటారు అపర్ణసేన్‌.

అందమైన ప్రయాణం
‘నేను చాలా సంవత్సరాలుగా ఫొటోలు తీస్తున్నప్పటికీ అపర్ణ అక్క నుంచి కొత్త విషయం నేర్చుకున్నాను. జీవిత సత్యాలను తెలుసుకోవడానికి, కొత్త విషయాలను అన్వేషించడానికి వయసుతో సంబంధం లేదని నాకు అర్థమైంది. నటిగా, చిత్రనిర్మాతగా, పత్రిక సంపాదకురాలిగా సమాజంలో ఆలోచనాత్మక స్వరంగా ఉండడమే కాకుండా ఫొటోగ్రాఫర్‌గా కూడా అందమైన ప్రయాణాన్ని ప్రారంభించారు.

చాలామంది జీవిత వేగాన్ని తగ్గించుకోవాలనుకునే వయసులో ఆమె తన సొంత కళ్లతో జీవితాన్ని అన్వేషిస్తూ ఆస్వాదిస్తున్నారు. కాఫీ–టేబుల్‌ పుస్తకం మై గేజ్‌ అపర్ణ సేన్‌ సినిమాలు, సినీ ప్రయాణం గురించి కాదు వ్యక్తిగా ఆమె ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తుంది అనేదాని గురించి. ప్రకృతి దృశ్యాల నుంచి జీవితంలోని ప్రత్యేక క్షణాల వరకు ఆమె జ్ఞాపకాలను ఒకచోట చేర్చిన పుస్తకం ఇది’ అన్నారు ఫొటోగ్రాఫర్‌ సాత్యకి.

అనుభవ జ్ఞానం
‘ది గేజ్‌లో ప్రత్యేక ఆకర్షణ...బార్సిలోనాలో అపర్ణ తీసిన ఫొటో. ఆ ఫొటోలో కనిపించే కనుగుడ్డులో ప్రతిబింబించే ముఖాల హావభావాలు ఎన్నో విషయాలు చెబుతాయి. అందులో ఒకటి...స్పెయిన్‌లో కూడా అక్కడి వ్యవస్థను వ్యతిరేకించే ప్రజలు ఉన్నారు! ‘అద్భుతమైన ఫొటోగ్రఫీకి మూలం ఏమిటి?’ అనే ప్రశ్నకు ‘ది గేజ్‌’ ఇచ్చే తిరుగులేని సమాధానం...‘అనుభవ జ్ఞానం’

నిశ్శబ్ద సమయాలు
నిశ్శబ్ద సమయాలు నన్ను ఆకర్షించాయి. ఒక వస్తువుపై కాంతి పడే విధానం దాని రూపాన్ని మార్చే అద్భుతం నన్ను ఆకట్టుకుంది. అలాంటి నిశ్శబ్దంలో నేను ఎన్నో ఫొటోలు తీశాను. భవిష్యత్‌లో నా ఫొటోలతో మరిన్ని పుస్తకాలు తీసుకురావాలనుకుంటున్నాను. సృజనాత్మక ప్రక్రియలో కాంతి (లైట్‌) ప్రాధాన్యత ఇంతా అంతాకాదు. నేను ఫొటోగ్రఫీలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు దాటినా దాని గురించి తెలుసుకున్నాను. తెలుసుకుంటూనే ఉన్నాను. చిత్రనిర్మాణం నుంచి ఫొటోగ్రఫీలోకి రావడం కొత్త దృష్టిని ఇచ్చింది. సినిమా, ఫొటోగ్రఫీ అనేవి వేరు వేరు ప్రపంచాలు కావు. పరస్పర విరుద్ధమైనవి కావు.
– అపర్ణ సేన్‌

– యాకుబ్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement