సినిమా రంగంలో మహిళలంటే... వెండితెరపై కనిపించే కథానాయికలే గుర్తొస్తారు... అలాగే క్యారెక్టర్, కామెడీ, విలన్... వంటి పాత్రల్లోనూ మహిళలు నటించడం సహజం. అయితే తెరపై కనిపించేవారితో పోలిస్తే తెరవెనక నిర్మాతలుగా, సాంకేతిక విభాగాల్లో పని చేసే మహిళలు చాలా తక్కువమంది ఉంటారు.
కానీ ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. అందుకు ఓ తాజా ఉదాహరణ గోవా వేదికగా జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ). ఈ ఏడాది ఈ ఉత్సవంలో 52 మంది మహిళా ఫిల్మ్ మేకర్స్ పాల్గొంటున్నారు. వారిలో భారతీయ చిత్రనిర్మాతలు కూడా ఉన్నారు.
భారతీయ ఫిల్మ్ మేకర్స్‌లో లీనా యాదవ్ దర్శకత్వం వహించిన ‘బికమింగ్’ అనే డాక్యుమెంటరీ, ముస్కాన్ అస్థానా దర్శకత్వంలో రూపొందిన ‘సేవ్ మిచ్చర్’, అనుపమ సారథి దర్శకత్వం వహించిన ‘పిలి చన్నె’, నటి అంతరా జీజీ చౌదరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సూర్యముఖి’ ‘ఇఫీ’లో ప్రదర్శనకు అర్హత సాధించడం గొప్ప విషయం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ్ర పాధాన్యం ఇస్తూ, ఈ లేడీ డైరెక్టర్స్ ఈ చిత్రాలను రూపొందించారు.
ఇక వేరే దేశాలకు చెందిన ఫిమేల్ ఫిల్మ్ మేకర్స్‌లో కిర్గిజ్ చిత్రదర్శక–నిర్మాత నర్ఘిజా డోటియేవా ‘స్కైలార్క్’, రొమేనియన్ చిత్రదర్శక–నిర్మాత అలీనా షెర్బాన్‌ల ‘ఐ మ్యాటర్’ వంటి చిత్రాలు కూడా స్క్రీనింగ్ జాబితాలో ఉన్నాయి.
‘‘మూస పద్ధతులను సవాల్ చేయడం, సంస్కృతి, మహిళల అనుభవాలను అన్వేషించడం... వంటి అంశాలను ఫిమేల్ ఫిల్మ్ మేకర్స్ తెరపైకి తీసుకురావడం గొప్ప విషయం’’ అని భారతీయ మూలాలున్న అలీనా షెర్బాన్ పేర్కొన్నారు.
ఈ నెల 20న ఆరంభమైన ‘ఇఫీ’ వేడుకలు 28 వరకు జరుగుతాయి.


