ముంబైలో నగర మేయర్ రీతూ తావ్డే, మున్సిపల్ కమిషనర్ అశ్విని భిడేలకు గురువారం ఓ బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. మేయర్ కార్యాలయంతో పాటు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్‌కు చెందిన జల్సా నివాసం, నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరగనున్నట్లు అందులో హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ-మెయిల్‌లో మాహాలక్ష్మి రేస్‌కోర్స్, సియాన్, ఆచార్య మెట్రో స్టేషన్ ప్రాంతాల్లోనూ బాంబులు అమర్చినట్లు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది రెండోసారి
కాగా.. అమితాబ్ బచ్చన్ నివాసమైన జల్సాకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండోసారి. గతంలో అక్టోబర్ 23న కూడా ఇదే తరహా బెదిరింపు గురించి ముంబై పోలీసులకు సమాచారం అందింది. అంతకుముందు నెలలోనూ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) ప్రాంతంలోని ఓ పాఠశాలకు వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్‌లో అమితాబ్ నివాసం జల్సా పేరును ప్రస్తావించారు.
(ఇదీ చదవండి: వీడు నటించగలడు అని నమ్మింది నానినే : నితిన్)


