జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బయటి వ్యక్తుల ప్రవేశాన్ని కంట్రోల్ చేసింది. ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా పాఠశాల ప్రాంగణంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇంటర్వ్యూలు, లైవ్ స్ట్రీమింగ్‌ను నిషేధిస్తూ కొత్త మార్గదర్శకాలు అమలు చేసింది. విద్యార్థుల గోప్యత, గౌరవం, భద్రతను కాపాడటమే ఈ ఆదేశాల ఉద్దేశమని సెకండరీ ఎడ్యుకేషన్ శాఖ తెలిపింది.
ఈ సర్క్యులర్ 2026 ఆగస్టు 17న విడుదలైంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల సౌకర్యాలను పరిశీలించే “స్కూల్ ఠీక్ కరో” ప్రచారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో ప్రధానోపాధ్యాయుడి అనుమతి లేకుండా ఎలాంటి బయటి వ్యక్తి పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించరాదని, ఏ రకమైన మీడియా రికార్డింగ్‌కైనా లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి అని మార్గదర్శకాలు స్పష్టం చేశాయి.
ఈ ఆంక్షలు విద్యార్థులు ఉపయోగించే తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయాలు, మరుగుదొడ్లు సహా అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. అనుమతి లభించినా బయటి వ్యక్తులు అధికారిక సిబ్బంది పర్యవేక్షణలోనే ఉండాలి. విద్యార్థుల చిత్రాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని వారి గోప్యత, భద్రతకు ముప్పు కలిగించే విధంగా ప్రచురించడం లేదా వ్యాప్తి చేయకుండా పాఠశాల యాజమాన్యాలు నిరోధించాలని ఆదేశాలు పేర్కొన్నాయి.
ప్రభుత్వం “ఇన్ లోకో పేరెంటిస్” సూత్రాన్ని ప్రస్తావించింది. పిల్లల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించే బాధ్యత తమపై ఉందని తెలిపింది. ఇన్ లోకో పేరెంటిస్ అంటే తల్లిదండ్రుల స్థానంలో పిల్లల శ్రేయస్సును కాపాడే బాధ్యతను సూచించే న్యాయ సూత్రం.
సుప్రీంకోర్టు తీర్పులూ ఉన్నాయ్..
ఈ ఆదేశాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, గోప్యతపై సుప్రీంకోర్టు తీర్పులు, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) మార్గదర్శకాలు న్యాయ ఆధారాలుగా ఉన్నాయని ఉత్తర్వు పేర్కొంది. “ప్రధానోపాధ్యాయుడు లేదా సంస్థ అధిపతి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి బయటి వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించరాదు. పాఠశాల ప్రాంగణంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇంటర్వ్యూలు, ఆడియో రికార్డింగ్, లైవ్ స్ట్రీమింగ్‌కు ప్రధానోపాధ్యాయుడి ముందస్తు లిఖితపూర్వక అనుమతి అవసరం” అని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.
విపక్ష నేతలు ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ఇది పారదర్శకతను, ప్రజా పర్యవేక్షణను పరిమితం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రా మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిచేయడానికి బదులు వాటిని దాచిపెట్టే ప్రయత్నమే ఈ ఆంక్షలని అన్నారు. పాఠశాలల పరిస్థితి సంతృప్తికరంగా ఉంటే ఆధారాల నమోదు లేదా ప్రజా పరిశీలనకు భయపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు.
అనుమతి లేకుండా ప్రవేశించడం లేదా మీడియా కార్యకలాపాలు నిర్వహించడం జరిగితే భారతీయ న్యాయ సంహిత, పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, సమాచార సాంకేతిక చట్టం కింద న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని మార్గదర్శకాలు హెచ్చరించాయి.
అధికారిక హోదాలో పాఠశాలలను సందర్శించే ప్రభుత్వ అధికారులకు ఈ ఆంక్షలు వర్తించవని, మిగతా సందర్శకులంతా కొత్త నిబంధనలను కచ్చితంగా పాటించాలని విశ్లేషణలు పేర్కొన్నాయి. “ఎవరైనా అనుమతి లేకుండా ప్రాంగణంలోకి ప్రవేశించినా, బయటకు వెళ్లేందుకు నిరాకరించినా, అనుమతి లేని ఫొటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీకి ప్రయత్నించినా, పాఠశాల కార్యకలాపాలకు అంతరాయం కలిగించినా ప్రధానోపాధ్యాయుడు వెంటనే స్థానిక పోలీసులకు, జిల్లా విద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. వర్తించే చట్టాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలి” అని సర్క్యులర్ పేర్కొంది.
సందర్శకుల నమోదు పుస్తకాన్ని నిర్వహించాలని, అనుమతి లేని వ్యక్తులు ప్రవేశించేందుకు లేదా నిషేధిత కార్యకలాపాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. విద్యార్థుల భద్రత, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ సూత్రాలకు భంగం కలిగించే చర్యలు జరగకుండా చూడాలని స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ ఆంక్షలపై స్పందించిన సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ.. పాఠశాలలను పరిశీలించి మెరుగుపరిచే ప్రచారం కొత్త పరిమితులు ఉన్నా కొనసాగుతుందని చెప్పారు. విద్యా రంగంలో ప్రజా పరిశీలన, పారదర్శకతను అణచివేసే ప్రయత్నమే రాజస్థాన్ చర్య అని ప్రభుత్వాన్ని విమర్శించారు.


