ఉన్నత ‘మిథ్య’ | SBI Research Report on Higher Education Released | Sakshi
Sakshi News home page

ఉన్నత ‘మిథ్య’

Oct 3 2026 4:23 AM | Updated on Oct 3 2026 4:23 AM

SBI Research Report on Higher Education Released

దేశవ్యాప్తంగా ప్రభుత్వాలనుంచి తీవ్ర ప్రతిఘటన వస్తున్నా, ఒక్కోసారి దౌర్జన్యం జరుగుతున్నా కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలు ప్రాథమిక పాఠశాలలు సందర్శించి అక్కడి దారుణ పరిస్థితుల్ని చాటుతున్నారు. ఉన్నత విద్య సైతం ఈ దేశంలో అలాగే అఘోరించిందని ఇటీవల విడుదలైన ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక కుండబద్దలుకొట్టింది. ఒకపక్క ప్రపంచంలో ఏ దేశానికీ లేని స్థాయిలో మనకు యువశక్తి పుష్కలంగా ఉన్నదని డబ్బా కొట్టుకొంటున్నా... ఆ యువత తమ సత్తా చాటడానికి అవసరమైన సదుపాయాలేమీ లేవని సీజేపీ విడుదల చేస్తున్న వీడియోలు, ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక ఏక కంఠంతో చెబుతున్నాయి. 

మరి స్వాతంత్య్రానంతరం ఇన్ని దశాబ్దాల్లో ప్రభుత్వాలు ఏం సాధించినట్టు? మనది శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని మొన్న జూలైలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) సంస్థ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మన వృద్ధి రేటు 7.8 శాతం. రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనా 7.0 శాతం కన్నా ఇది అధికం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం మనం ఆరో స్థానంలో ఉండగా... మరో పాతికేళ్లలో భారత్‌ తొలి స్థానానికి ఎగబాకుతుందని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్‌ ఇటీవల అంచనా వేశారు. గర్వపడాల్సిందే. కానీ ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకూ అంతా నాసిరకంగా ఉన్నప్పుడు ఇదంతా ఎలా సాధ్యమన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది... పాలకులకు తప్ప! 

మనం అమెరికా, చైనాలను అధిగమించబోయే క్రమంలో ఉన్నాంగనుక ఆ రెండు దేశాల్లోనూ విద్యావ్యవస్థలెలా వున్నాయో తెలుసుకోవటం అవసరం. అమెరికా యూని వర్సిటీలు 2024లో ఉన్నత విద్యకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కోసం 11,770 కోట్ల డాలర్ల నిధులు పొందాయని ఒక నివేదిక చెబుతోంది. ఇందులో ప్రభుత్వాలనుంచి వచ్చింది 6,460 కోట్ల డాలర్లు. మన దగ్గర ప్రభుత్వాలే కాదు... వాటినుంచి ఎకరా 99 పైసలకు వందల ఎకరాలు పొందే ప్రైవేటు సంస్థలు సైతం ఉన్నత విద్యకు నిధులు రాల్చటం లేదని దీన్నిబట్టి తెలుస్తుంది.

చైనాలో పరిశోధన, అభివృద్ధి రంగాలకు 2024లో కేటాయించిన మొత్తం దాని వృద్ధి రేటులో 2.69 శాతం. అదే కాలంలో ఉన్నత విద్యారంగంలో మన వ్యయం జీడీపీలో కేవలం 0.84 శాతం. ఉన్నత విద్య వరకూ అన్ని దశలూ ప్రజలకు అందుబాటులో ఉండటం, మౌలిక సదుపాయాలపై అపారంగా వ్యయం చేయటం, వ్యూహాత్మక పరిశోధనకు పెద్ద మొత్తంలో నిధులు వ్యయం చేయటం, పటిష్టమైన ప్రభుత్వ సమన్వయం చైనా ప్రత్యేకతలు. మనం ఆ స్థాయికి చేరుకోవటానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది?

మన యూనివర్సిటీలు, కళాశాలలు... వాటిల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగిన మాట వాస్తవమే అయినా, వీరికి బోధించేందుకు అవసరమైన సిబ్బంది లేరు. దాదాపు మంజూరైన అధ్యాపక పోస్టుల్లో అన్నిచోట్లా మూడోవంతు ఖాళీగా పడివున్నాయి. ప్రస్తుత ఉన్నత విద్యా సంస్థల సంఖ్య 64,756 కాగా, 2014తో పోలిస్తే వీటి వృద్ధి 47 శాతం. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 4.5 కోట్లు. అధ్యాపకులసంఖ్య కూడా 2013–14 మధ్య ఉన్న 13.7 లక్షలనుంచి 17.3 లక్షలకు చేరింది. కానీ ఇంకా 34 శాతం పోస్టులు ఖాళీ. ప్రొఫెసర్ల స్థాయిలో ఈ ఖాళీలు 54 శాతం. కనీసం పెరిగిన సంఖ్యకు తగినట్టయినా ప్రమాణాలు పెంచటం, పరిశోధన రంగాన్ని పటిష్ట పర్చటం, యూనివర్సిటీలను పరిశ్రమలతో అనుసంధానించటం వంటివి చేయనట్టయితే మన యువతకు బంగారు భవిష్యత్తు ఎలా?

ప్రపంచశ్రేణి అభ్యసన పద్ధతుల్ని తీసుకొచ్చి మరింత సామర్థ్యంతో, లోపరహితంగా పరీక్షలు నిర్వహించటానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏర్పడింది. అంతవరకూ ఆ బాధ్యతల్ని చూస్తున్న సీబీఎస్‌ఈ, ఏఐసీటీఈ, వివిధ యూనివర్సిటీలను కాదని ఎన్‌టీఏకు అప్పగించారు. సీజేపీ ఆవిర్భావానికి ఎన్‌టీఏ నిర్వాకమే దారితీసిందంటే తన కప్పగించిన బాధ్యతను అది ఎంత దివ్యంగా నిర్వహించిందో గ్రహించవచ్చు. ప్రతిభను పాడె ఎక్కించే విధానాలనూ, నిర్లక్ష్యాన్నీ, నిరాసక్తతనూ ఇప్పటికైనా ప్రభుత్వాలు విడ నాడాలి. ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్యవరకూ సమూల ప్రక్షాళనకు సంసిద్ధం కావాలి. లేనట్టయితే సాధించిన, సాధించబోయే అభివృద్ధి అర్థరహితమవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement