మళ్లీ ఉన్మాద ఛాయలు! | Sakshi Editorial On Flydubai flight Hijack attempt Issue | Sakshi
Sakshi News home page

మళ్లీ ఉన్మాద ఛాయలు!

Oct 2 2026 1:06 AM | Updated on Oct 2 2026 1:06 AM

Sakshi Editorial On Flydubai flight Hijack attempt Issue

కొన్ని హఠాత్సంఘటనలు అరుదైన వ్యక్తులనూ, మనుషుల్లోని అసాధారణతనూ ప్రపంచం ముందు ఆవిష్కరిస్తాయి. బుధవారం ఒక దుండగుడి హైజాక్‌ యత్నంలో చిక్కుబడి, ప్రమాదపుటంచుల్లోపడిన ఫ్లై దుబాయ్‌ విమానం తిరిగి నిలదొక్కుకున్న ఉదంతంలో ఆ విమానం పైలెట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌ పేరు ఇప్పుడు ప్రపంచం మూలమూలనా మార్మోగటానికి ఆయన ప్రదర్శించిన తెగువ, సాహసాలే కారణం. కో కెప్టెన్‌ దాడితో శరీరంనిండా కత్తిపోట్లున్నా, నెత్తురోడుతూ అపస్మారకంలోకి పోతున్నా కెప్టెన్‌ మచ్ఛర్‌ ఏమాత్రం జంకక సమయస్ఫూర్తితో, విమానాన్ని రక్షించి తీరాలన్న పట్టుదలతో కాక్‌పిట్‌ తలుపు లాక్‌ తెరవడం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సన్నివేశం. ఆయన స్ఫూర్తిదాయక వ్యవహారశైలి దేశదేశాల్లోని పైలెట్లకు, మొత్తం విమానయాన సిబ్బందికి భవిష్యత్తులో ఒక అధ్యయనాంశంగా మారుతుంది.

సరిగ్గా పాతికేళ్లనాడు అమెరికాలో నాలుగు విమానాల్ని దారిమళ్లించి కూల్చివేసి, వేలాదిమంది మరణానికి కారణమైన ఉగ్రవాద ఉన్మాదంనుంచి ప్రపంచ దేశాలింకా సరైన గుణపాఠం నేర్చుకోలేదని ఈ హైజాక్‌ యత్నం రుజువుచేసింది. అది ఆత్మాహుతి దాడా... మరేదైనానా అన్నది తేల్చాల్సివున్నదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూతో సహా పలువురు చెబుతున్నా, దీనివెనక ఇరాన్‌ హస్తమున్నదని బ్రిటన్‌ ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ ఆరోపిస్తున్నారు. ఈ దుండగానికి కారకుడైన కో పైలెట్‌ ఒమన్‌ జాతీయుడు. 174 మంది ప్రయాణిస్తున్న ఆ విమానం ఎన్నో అవాంతరాలెదురైనా చివరకు సురక్షితంగా సౌదీ అరేబియాలో అడుగుపెట్టింది. కెప్టెన్‌ మచ్ఛర్‌పై కో పైలెట్‌ దాడి,వారి పెనుగులాట... అనుకోకుండా కాక్‌పిట్‌ తలుపు లాక్‌ తెరుచుకోవడం వంటి వరస పరిణామాలు అందులో ప్రయాణిస్తున్న వారందరినీ దిగ్భ్రాంతిలో పడేశాయి. 

ఈమధ్యలోనే విమానం నియంత్రణ కోల్పోయి నిమిషంలోపే 34,000 అడుగుల ఎత్తునుంచి 17,000 అడుగులకు పడిపోవటంతో ప్రయాణికులంతా ప్రాణభయంతో కేకలు వేయటం వీడియోలో రికార్డయింది. మరో 2,000 అడుగుల కిందకు జారాక అది మళ్లీ క్రమేపీ గాల్లోకి లేవడం ఒకరకంగా అదృష్టమని చెప్పాలి. ప్రయాణికుల్లో కొందరు చొరవగా లోపలికెళ్లి జరిగిందేమిటో గ్రహించి కోపైలెట్‌ను అదుపు చేయటం, ప్రయాణికుల్లో ఒకరైన డెంటిస్టు  రక్తస్రావం కాకుండా కెప్టెన్‌ను కాపాడటం ప్రశంసించ దగ్గ పనులు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతేమంటే... అనుకోకుండా ఆ విమానంలో రిలీఫ్‌ పైలెట్లు ఉండటం. అత్యవసర సమయంలో విమానం నడపాల్సిన కో పైలెటే నేరగాడు కావటం, పైలెట్‌కు స్పృహ లేకుండా పోవడం వంటి పరిణామాల మధ్య ఆ రిలీఫ్‌ పైలెట్లు లేకుంటే ఏం జరిగివుండేదో ఊహించుకుంటేనే వణుకొస్తుంది. 

అమెరికాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పైలెట్‌ లేదా కో పైలెట్‌ కోరుకుంటే తప్ప కాక్‌పిట్‌ తలుపు తెరుచుకోకుండా విమానాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బయటినుంచి తెరిచే ప్రయత్నం దుర్లభమయ్యేంత పటిష్టంగా ఆ తలుపుంటుంది. హైజాక్‌ యత్నం, బెదిరింపులు వంటివి క్యాబిన్‌లో మాత్రమే జరుగుతాయనీ,కాక్‌పిట్‌ సురక్షితంగా ఉండేలా చూస్తే సరిపోతుందనీ ఈ సాంకేతికత తీసుకొచ్చారు. కానీ తాజా ఉదంతంలో ప్రమాదం క్యాబిన్‌లో కాకుండా, కాక్‌పిట్‌లోనే పొంచివుండటం గమనించదగ్గది. వీటి సంగతలావుంచి అసలు దుబాయ్‌లో కో పైలెట్‌ చాకుతో విధులకు ఎలా రాగలిగాడు? అంటే భద్రత విషయంలో మునుపటి అప్రమత్తత సన్నగిల్లిందన్నమాట! నిత్యం వేలాదిమంది ప్రయాణించే దుబాయ్‌ విమానాశ్రయంలో ఇలాంటి భద్రతాపరమైన లోపం చోటుచేసుకోవటం ఊహకందనిది. ప్రపంచం కక్షలు, కార్పణ్యాలతో భయానకంగా మారింది. ఇప్పుడు జరిగిన ఉదంతానికి పురిగొల్పిన పరిణామాలేమిటన్నది ఇంకా తెలియాల్సే వున్నా ఇజ్రాయెల్‌ గాజాలో సాగిస్తున్న మారణకాండకు ప్రతీకారంగా కో పైలెట్‌ ఆ దేశ పౌరులు అధికంగా వున్న విమానాన్ని కూల్చేయదల్చుకున్నాడన్న కథనాలు వెలువడుతున్నాయి. ‘కంటికి కన్ను...’ సిద్ధాంతం మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. సహేతుక పోరాటాలపై నీలినీడలు కమ్మేలా చేస్తుంది. ఒక ఉన్మాదానికి మరో ఉన్మాదం ఎప్పటికీ జవాబు కాదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement