‘భారత్‌ గర్విస్తోంది’.. స్మిట్‌ మచ్చార్‌ ధైర్యానికి మోదీ ఫిదా! | Flydubai Incident: India PM Modi Reacts Praise Pilot Captain Smit Machchhar | Sakshi
Sakshi News home page

‘భారత్‌ గర్విస్తోంది’.. స్మిట్‌ మచ్చార్‌ ధైర్యానికి మోదీ ఫిదా!

Oct 1 2026 7:58 AM | Updated on Oct 1 2026 8:12 AM

Flydubai Incident: India PM Modi Reacts Praise Pilot Captain Smit Machchhar

దుబాయ్‌–టెల్‌అవీవ్‌ ఫ్లై దుబాయ్‌ విమానంలో చోటుచేసుకున్న ఘటనలో భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌ ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని ఎదుర్కొని.. విమానంలోని వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కీలకంగా వ్యవహరించారని అన్నారు.

‘‘కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌ ఒక హీరో. భారత్‌ ఆయనను చూసి గర్విస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్మిట్‌ మచ్చార్‌ తెగువను కొనియాడుతూ మోదీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన అపారమైన ధైర్యం, వెనక్కి తగ్గని సంకల్పాన్ని ప్రదర్శించారని అన్నారు. ఆయన చూపిన తెగువ వందలాది మంది ప్రాణాలను కాపాడటంతోపాటు పెను విషాదాన్ని తప్పించిందని పేర్కొన్నారు. స్మిట్‌ మచ్చార్‌ త్వరగా కోలుకోవాలని, మరింత శక్తితో పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.

బుధవారం దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌కు బయలుదేరిన ఫ్లై దుబాయ్‌ విమానం FZ1073లో ఈ ఘటన చోటుచేసుకుంది. బోయింగ్‌ 737 విమానం సుమారు 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. సహ పైలట్‌ విమానాన్ని ప్రమాదానికి గురిచేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌పై అతడు దాడి చేసి కత్తితో పొడిచినట్లు సమాచారం.

దాడితో మచ్చార్‌ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం భారీ వేగంతో కిందికి దిగడం ప్రారంభించింది. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం.. దాదాపు 37 సెకన్లలోనే విమానం 14,300 అడుగుల మేర కిందికి దిగింది. ఒక దశలో నిమిషానికి సుమారు 23 వేల అడుగుల వేగంతో కిందికి దూసుకెళ్లినట్లు సమాచారం. దీంతో విమానంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

గాయాలతోనే ఎదురుదాడి..
ఈ సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్‌ మచ్చార్‌ వెనక్కి తగ్గలేదు. సహ పైలట్‌ను ప్రతిఘటిస్తూ కాక్‌పిట్‌ తలుపు తెరిచినట్లు సమాచారం. దీంతో ముందు వరుసలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు సహకరించారు. విమానంలో ఉన్న మరో ఇద్దరు రిలీఫ్‌ పైలట్లు అనంతరం నియంత్రణ బాధ్యతలు చేపట్టారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ల్యాండింగ్‌ అనంతరం గాయపడిన స్మిట్‌ మచ్చార్‌, సహ పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు కూడా విమానాశ్రయంలో వైద్య సాయం అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

9,750 గంటల ఫ్లయింగ్‌ అనుభవం
స్మిట్‌ మచ్చార్‌ భారతీయుడు. ఫ్లై దుబాయ్‌లో చేరకముందు స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్లు పనిచేశారు. బోయింగ్‌ 737 విమానాల్లో 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉంది. ఆయన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌ ప్రకారం.. దాదాపు 9,750 గంటల ఫ్లయింగ్‌ అనుభవంతోపాటు లైన్‌ ట్రైనింగ్‌ కెప్టెన్‌గా కూడా పనిచేశారు.

ట్రంప్‌, నెతన్యాహు ప్రశంసలు
స్మిట్‌ మచ్చార్‌ ధైర్యాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా ప్రశంసించారు. దాడిలో గాయపడినప్పటికీ విమానాన్ని, ప్రయాణికులను రక్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను కొనియాడారు. ప్రయాణికులు, సిబ్బంది సైతం దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఇటు ట్రంప్‌ కూడా స్మిట్‌ను హీరో అని, కోపైలట్‌ను టెర్రరిస్ట్‌ అని అభివర్ణించారు.

ఈ ఘటనకు దారితీసిన కారణాలు, సహ పైలట్‌ ఎందుకు దాడికి పాల్పడ్డాడు? విమానాన్ని ఎందుకు కిందికి దించాడు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే తీవ్ర ప్రమాదం ఎదురైన సమయంలో గాయాలను లెక్కచేయకుండా స్మిట్‌ మచ్చార్‌ తీసుకున్న చర్యలు ఇప్పుడు ఈ ఘటనలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇదీ చదవండి: ప్చ్‌.. డంకీ ఎంత పని చేసింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement