న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బుధవారం ఫోన్ సంభాషణ జరిగింది. భారత్–అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని మరింతగా పెంచేందుకు సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని అంగీకరించారు.
ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సాధించిన పురోగతిని మోదీ, ట్రంప్ సమీక్షించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచ శాంతి, భద్రతను ప్రోత్సహించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై చర్చించారు.
మోదీ కీలక కామెంట్స్
మోదీ కూడా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ సంభాషణపై స్పందించారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్‌తో ఫలప్రదమైన సంభాషణ జరిగింది. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు సహా ఇతర రంగాల్లో మన ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించాం. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని అంగీకరించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రపంచ శాంతి, భద్రతను ముందుకు తీసుకెళ్లేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపైనా అభిప్రాయాలు పంచుకున్నాం’’ అని మోదీ పేర్కొన్నారు.
భారత్, అమెరికా పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయి. అమెరికా పర్యటనలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. ఇరు దేశాలు అవగాహనకు మరింత చేరువయ్యాయని తెలిపారు. అయితే అమెరికా సుంకాల నిబంధనల్లో మార్పులు, సెక్షన్ 301 ప్రక్రియ కీలక అంశాలుగా ఉన్నాయని చెప్పారు. 1974 నాటి అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 ప్రకారం.. అన్యాయంగా భావించే వాణిజ్య పద్ధతులపై అమెరికా దర్యాప్తు చేసి, అదనపు సుంకాలు సహా చర్యలు తీసుకోవచ్చు. ఈ దర్యాప్తులను అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం నిర్వహిస్తుంది.
ఇదిలా ఉండగా, ఈ నెల ప్రారంభంలో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టంపైనా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం ప్రకారం రష్యాతో పాటు భారత్, చైనా వంటి ప్రధాన ఇంధన కొనుగోలుదారులపై అమెరికా ప్రభుత్వం సుంకాలు విధించే అవకాశం ఉంది. భారత్ 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతకు భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.


