సోమాలియా సముద్రదొంగల చెర నుంచి బయటపడిన ఎంటీ హానర్ నౌక
దుబాయ్: చమురు ఉత్పత్తులను మొగదిషు నగరానికి సరఫరా చేసేందుకు వెళ్తున్న సరకు రవాణా నౌక ఎంటీ హానర్25ను సముద్రదొంగల నుంచి సోమాలియా నావికాదళం రక్షించే క్రమంలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. నౌకలో కుక్‌గా పనిచేస్తున్న మొహమ్మద్ తనీ్వరుజ్ జమాన్ మంగళవారం జరిగిన యాంటీ–పైరసీ రెస్క్యూ ఆపరేషన్‌లో చనిపోయాడని నావికుల సంఘం ‘ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ ప్రకటించింది.
సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ ప్రావిన్స్‌లోని బందర్ బేయిలా జిల్లాలోని ధారిన్–బార్ సమీప సముద్రజలాల్లో ఈ ఘటన జరిగిందని కెన్యాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మృతుని కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి వ్యక్తంచేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఘటనలో మరో భారతీయుడు గాయపడ్డాడు. 18,500 బ్యారెళ్ల చమురుతోపాటు ఇతర చమురు ఉత్పత్తులతో వెళ్తున్న ఎంటీ హానర్ నౌకను ఏప్రిల్ 21వ తేదీన పైరేట్లు దాడిచేసి హైజాక్‌చేశారు. ఇందులో ఒక భారతీయుడు, ఒక శ్రీలంక, ఒక మయన్మార్‌నావికుడు, పది మంది పాకిస్తాన్, నలుగురు ఇండోనేసియా నావికులు ఉన్నారు.
హైజాక్ జరిగినప్పట్నుంచి అది వాళ్ల అధీనంలోనే ఉంది. మంగళవారం సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ ప్రావిన్స్ మ్యారిటైమ్ పోలీస్‌ఫోర్స్ సభ్యులు హఠాత్తుగా నౌకలోని పైరేట్లపై దాడిచేశారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు, ఒక మయన్మార్ నావికుడు, ముగ్గురు పాకిస్తానీ నావికులు చనిపోయారు. మరోవైపు ఇటీవల పైరేట్ల చెర నుంచి బయటపడిన ఎంటీ సీబూ1, ఎంటీ యురేకా నౌకల్లోని భారతీయ నావికులు సైతం క్షేమంగా ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ తెలిపింది. నెలరోజుల తర్వాత సీబూ1ను విడిపించగలిగారు. ఎంటీ యురేకాను మంగళవారం చెర నుంచి విడిపించారు. ఎంవీ లూటఫ్ నౌకనూ ఆగస్ట్‌లో సోమాలియా పైరేట్లు హైజాక్‌చేశారు.
ఇందులో ఆరుగురు భారతీయులున్నారు.


