జైలులో విలాసాల ధ్వంసం | Luxury units uncovered inside an Indonesian prison | Sakshi
Sakshi News home page

జైలులో విలాసాల ధ్వంసం

Oct 1 2026 5:41 AM | Updated on Oct 1 2026 5:41 AM

Luxury units uncovered inside an Indonesian prison

రివర్‌ ఫ్రంట్‌ విల్లాలు, మద్యం స్విమ్మింగ్‌ పూల్స్, ప్రైవేట్‌ జిమ్‌లు 

ఆకస్మిక తనిఖీతో బండారం బట్టబయలు 

హుటాహుటిన ధ్వంసానికి అధికారుల ఆదేశాలు  

జకార్తా: ఇండొనేసియాలోని బోగోర్‌ ప్రాంతంలోని జైల్లో బుధవారం ఒక రకమైన విధ్వంసం చోటు చేసుకుంది. ఫర్నీచర్‌ ధ్వంసమైంది.. భారీ భారీ ఎల్‌ఈడీ టీవీ స్క్రీన్లు బద్ధలయ్యాయి. బీరు బాటిళ్లు, మద్యం సీసాలు కూడా తుత్తునీయలయ్యాయి!! ఎందుకలా? అంటున్నారా? ఇవన్నీ వీఐపీ ఖైదీల కోసం సొంతంగా చేసుకున్న ఏర్పాట్లు మరి! ప్రభుత్వ అధికారుల ఆకస్మిక తనిఖీలో ఈ విలాసాలన్నీ బయటపడటంతో వాటిని అగమేఘాల మీద ధ్వంసం చేసేశారు. 

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో బాగా కిక్కిరిసి ఉండే జైళ్లలో సిబినాంగ్‌ ఒకటి. దాదాపు 1800 మంది ఖైదీలు ఉంటారిక్కడ. అయితే వీరిలో కొందరికి ఇక్కడ స్పెషల్‌ ట్రీట్మెంట్‌ లభిస్తూంటుంది. జైలు సిబ్బంది చేతులు తడిపితే చాలు. డబ్బు, పరపతి ఉన్నవారికి ఇక్కడ దొరకని సౌకర్యమే లేదు. టీవీలు, ఎయిర్‌ కండీషనర్లు మాత్రమే కాదు సొంతంగా జిమ్‌లు, సోఫాలు, ఆఖరికి ప్రత్యేకమైన స్విమ్మింగ్‌ పూల్, విల్లాలు ఉన్నాయంటే ఈ జైల్లో శిక్ష ఎంత సుఖవంతమైందో అర్థం చేసుకోవచ్చు. నదీ తీరం వెంబడే స్పెషల్‌ విల్లాలు నిర్మించుకుని మరీ వీరు జైలు ‘శిక్ష’ అనుభవిస్తున్నారు. మద్యం గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తాగేవారికి తాగినంత! 

ఇలా కొందరు ఖైదీల జీవితం సుఖంగా సాగిపోతూంటే వారం రోజుల క్రితం ఇండోనేసియా ప్రభుత్వం నియమించిన అధికారులు కొందరు ఆకస్మిక తనిఖీకి విచ్చేశారు. జైల్లో అందుబాటులో ఉన్న విలాసాలు చూసి డిప్యూటీ కమిషన్‌ ఛైర్మన్‌ సుగెయిత్‌ సాంటోసో ముక్కున వేలుసుకున్నారు. ఈ దురి్వనియోగం ఇకపై సాగేందుకు లేదని హుకుం జారీ చేసిన ఆయన ఈ లగ్జరీ ఏర్పాట్లన్నింటినీ ధ్వంసం చేయాలని ఆదేశించారు. తప్పదనుకున్నారో ఏమో... విల్లాలతోపాటు మిగిలిన విలాసాలను కూడా సిబ్బంది ఒక్కటొక్కటిగా తొలగించే పనిలో పడ్డారు.  ఇండోనేసియా జైళ్లలో అయిన వారికి కంచాల్లో వడ్డిస్తారని చాలాకాలంగా ఆరోపణలున్నాయి. తాజా ఘటనతో జైళ్ల దుర్వినియోగంపై దేశంలో మరోసారి చర్చ మొదలైంది. సిబినాంగ్‌ జైలు వార్డన్, పలువురు అధికారులను సస్పెండ్‌ చేశారు కానీ.. ఇది కంటితుడుపు చర్యే అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement