breaking news
somali pirates
-
ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో పుంజుకున్న సోమాలియా సముద్రపు దొంగల వేట!
దాదాపు దశాబ్దన్నర క్రితం కనుమరుగైపోయిందనుకున్న ఒక పెద్ద ప్రమాదం ఇప్పుడు సముద్రంలో మళ్లీ పుట్టుకొస్తోంది..! సముద్రపు దొంగలు సినిమాలకే పరిమితం అనుకుంటున్న తరుణంలో.. ఆఫ్రికాలోని సోమాలియా తీరంలో.. సముద్రపు దొంగల విజృంభన మళ్లీ మొదలైంది..! ఇటీవల ఏకంగా నాలుగు పెద్ద కమర్షియల్ షిప్‌లు (వాణిజ్య నౌకలు) హైజాక్‌కు గురయ్యాయి. 2012 తర్వాత ఇన్ని నౌకలు హైజాక్ అవ్వడం ఇదే మొదటిసారి..! ప్రస్తుతం ఆ నౌకలతోపాటు.. వాటిలోని 67 మంది సిబ్బంది ఆ దొంగల చెరలోనే ఉన్నారు. కోట్ల రూపాయల కోసం బేరసారాలు నడుస్తున్నాయి. అసలు ఇదంతా ఎలా మొదలైంది..? దొంగలు మళ్లీ ఎలా యాక్టివ్ అయ్యారు..? అనే అంశాలపై ‘సాక్షి వెబ్‌డెస్క్’ ప్రత్యేక కథనం..ఏం జరుగుతోంది..??ఈ ఏడాది ఏప్రిల్ 21న మొదలైంది అసలు కథ. 'హానర్ 25' అనే ఆయిల్ ట్యాంకర్ సోమాలియా రాజధాని మొగాదిషుకు ఇంధనం తీసుకెళ్తుండగా, సముద్రపు దొంగలు దాన్ని హైజాక్ చేశారు. సరిగ్గా ఐదు రోజుల తర్వాత మరో షిప్‌ని, మే 2న మరో ట్యాంకర్ని ఇలా వరుసగా పట్టుకున్నారు. మధ్యలో కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నా, జూలై 17న టంజానియాకు చెందిన 'అసన' అనే మరో ఆయిల్ ట్యాంకర్ని హైజాక్ చేశారు. ఈ నౌకల్లో ఏ ఒక్క దాంట్లోనూ ఆయుధాలు ధరించిన సెక్యూరిటీ గార్డ్స్ లేకపోవడం.. సముద్రపు దొంగలకు కలిసి వచ్చింది. అంతేకాదు, పాత కాలం నాటి ట్రిక్కులన్నీ వీరు మళ్లీ వాడటం మొదలుపెట్టారు. ఒక పెద్ద షిప్‌ను 'మదర్ షిప్' (Mother Ship) లాగా వాడుకుంటూ, దాని నుంచి చిన్న స్పీడ్ బోట్లలో సముద్రంలోకి వచ్చి ఇతర నౌకలపై దాడులు చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఏకంగా 6 హైజాక్ చేసిన నౌకలను ఒకేసారి తమ నియంత్రణలోకి తీసుకున్నారు.అసలు ఈ సోమాలియా పైరెట్ల వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. 1991లో అంతర్గత యుద్ధాల వల్ల సోమాలియాలో ప్రభుత్వం కూలిపోయింది. దేశమంతా ముక్కలైపోయింది. అప్పటి నుంచి అక్కడ ప్రభుత్వాలు లేవు. కోర్టులు లేవు. అసలు దేశాన్ని కాపాడే నౌకాదళం (Navy) కూడా కరువైంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్న సోమాలియాలో.. పోలీసింగ్ లేకపోవడంతో.. ఐరోపా, ఆసియా దేశాలకు చెందిన భారీ ఇండస్ట్రియల్ ఫిషింగ్ నౌకల దోపిడీ మొదలైంది. అంతేకాదు.. అభివృద్ధి చెందిన దేశాల కంపెనీలు ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలను (Hazardous Waste) సోమాలియా సముద్రంలో అక్రమంగా డంప్ చేయడం ప్రారంభించాయి. స్థానిక సోమాలియన్లకు చేపలు పట్టడమే ప్రధాన ఉపాధి. అలాంటిది విదేశీ ట్రాలర్లు వచ్చి చేపలన్నీ పట్టుకెళ్లిపోతుంటే.. సముద్రం విషపూరితంగా మారుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేకపోయారు. మొదట్లో తమ సముద్రపు వనరులను కాపాడుకోవడానికి 'వాలంటీర్ కోస్ట్ గార్డ్స్' అంటూ కొన్ని గ్రూపులు ఆయుధాలు పట్టాయి. విదేశీ ఫిషింగ్ నౌకలను ఆపి, జరిమానాలు వసూలు చేయడం మొదలుపెట్టాయి.భయంకరమైన నేర సామ్రాజ్యం దిశగా..కానీ, కొద్ది రోజులకు వాళ్లకు ఒక అసలు నిజం అర్థమైంది. చిన్న చిన్న ఫిషింగ్ నౌకలను బెదిరించడం కంటే, ఆ మార్గం గుండా వెళ్లే పెద్ద పెద్ద కమర్షియల్ షిప్‌లను పట్టుకుంటే కోట్ల రూపాయల రేన్సమ్ వస్తుందని తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఇది కేవలం 'రక్షణ' కాస్తా.. ఒక భయానక నేర సామ్రాజ్యంగా (Organized Crime Industry) మారిపోయింది..! సిలికాన్ వ్యాలీ స్టార్టప్‌ల లాగా.. దొంగలకు పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు తయారయ్యారు. బోట్లు, ఆయుధాలు, శాటిలైట్ ఫోన్లు కొనుగోలు చేయడానికి డబ్బులు ఇచ్చేవారున్నారు. యువకులను రిక్రూట్ చేయడం, నెగోషియేట్ చేయడం కోసం లాయర్లు, ట్రాన్స్‌లేటర్లు ఇలా ఒక పెద్ద వ్యవస్థే తయారైంది. ఒక విజయవంతమైన హైజాక్ జరిగితే, అప్పట్లో ఒక సాధారణ సోమాలియన్ యువకుడికి జీవితాంతం సంపాదించలేని సంపాదన ఒక్కసారే వచ్చేది. 2011 నాటికి ఈ సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఆ ఒక్క సంవత్సరంలోనే 230కి పైగా దాడులు జరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ పైరేట్ల కారణంగా ఏటా 7 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. హాలీవుడ్లో టామ్ హాంక్స్ నటించిన ప్రసిద్ధ సినిమా 'క్యాప్టెన్ ఫిలిప్స్' (Captain Phillips) కూడా ఇదే సోమాలియన్ పైరసీ నేపథ్యంలో వచ్చినదే..!మళ్లీ మొదలైంది..!2010ల చివరి నాటికి అమెరికా, చైనా, భారత్, ఐరోపా దేశాలన్నీ కలిసి ఒక భారీ నౌకాదళ కూటమిని ఏర్పాటు చేసి.. ఈ దొంగలను అణచివేశాయి. షిప్‌లలో ఆయుధాలు ధరించిన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టడంతో పైరసీ దాదాపుగా కనుమరుగైంది. గడిచిన మూడేళ్లుగా పలు దేశాలు యుద్ధాలతో బిజీబిజీగా ఉండడంతో.. మళ్లీ పైరెట్లు తమ పని మొదలు పెట్టారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం (యెమెన్ హౌతీల దాడులు, ఇరాన్ యుద్ధం) కారణంగా ప్రపంచ దేశాల నేవీ వార్‌షిప్స్ అన్నీ ఆ ప్రాంతాల వైపు మళ్లాయి. సోమాలియా వైపు చూసేవారే కరువయ్యారు. దీంతోపాటు.. సోమాలియాకు అమెరికా ఇస్తున్న డెవలప్మెంట్ ఫండ్స్‌ను భారీగా తగ్గించడంతో, యువతకు ఉపాధి లేకుండా పోయి మళ్లీ పాత నేరాల వైపు ఆకర్షితులవుతున్నారు. వీటన్నింటికీ మించి.. యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ సోమాలియా పైరెట్లకు ఆయుధాలు, ట్రైనింగ్, ఇంటెలిజెన్స్ పరంగా సాయం చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. మొత్తానికి, ప్రపంచమంతా మరిచిపోయిన ఈ సముద్రపు దొంగలు మళ్లీ ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ముప్పును ప్రపంచ దేశాలు ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాల్సిందే..!::హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు 👉ఇదీ చదవండి: షిప్పుల్లో భారతీయులు.. హైజాక్ చేసిన సముద్రపు దొంగలు -
చమురు నౌక హైజాక్.. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో కలకలం
అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో సముద్రపు దొంగల (పైరేట్స్) అలజడి మళ్లీ మొదలైంది. శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్ లోని యెమెన్ తీరానికి సమీపంలో 'యురేకా'అనే చమురు ట్యాంకర్ ను గుర్తు తెలియని దుండగులు హైజాక్ చేసినట్లు యెమెన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ధ్రువీకరించింది. యెమెన్ లోని షబ్వా ప్రావిన్స్ సమీపంలో నౌకలోకి చొరబడిన సాయుధ బృందం, దానిని తమ ఆధీనంలోకి తీసుకుని సోమాలియా తీరం వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.నౌక వివరాలుమెరైన్ ట్రాఫిక్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం, హైజాక్‌కు గురైన 'యురేకా' టోగో దేశపు జెండాతో ప్రయాణిస్తున్న చమురు ఉత్పత్తుల ట్యాంకర్. మార్చి నెలాఖరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఫుజైరా నౌకాశ్రయంలో ఈ నౌక చివరిగా ఉన్నట్లు రికార్డయ్యింది. యెమెన్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన కోస్ట్ గార్డ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించామని, సిబ్బంది భద్రత కోసం, నౌకను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. అయితే, నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ దేశస్థులు అనే వివరాలను గోప్యంగా ఉంచారు.మళ్లీ పడగ విప్పుతున్న పైరేట్స్2000వ సంవత్సర కాలంలో సోమాలియా తీరంలో పైరసీ అత్యంత ప్రమాదకరంగా ఉండేది. ముఖ్యంగా 2011లో గరిష్ట స్థాయిలో వందలాది దాడులు జరిగేవి. ఆ తర్వాత అంతర్జాతీయ నౌకాదళాల గస్తీ, కఠినమైన భద్రతా వ్యూహాల వల్ల దాడులు గణనీయంగా తగ్గాయి. కానీ, గత కొద్ది వారాలుగా ఈ ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నాయి.‘ఇటీవలి వారాల్లో హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో దాడులు పెరిగాయి. ఏప్రిల్ చివరలోనే మూడు దాడులు జరిగినట్లు మా సమాచార కేంద్రం గుర్తించింది’ అని ఈయూ నావికాదళం ఆపరేషన్ అట్లాంటా పేర్కొంది.ప్రాంతీయ ఉద్రిక్తతలుప్రస్తుతం ఈ ప్రాంతంలో షిప్పింగ్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు, యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల వల్ల ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ప్రస్తుత హైజాకింగ్ కు రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. బదులుగా, ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగే సముద్రపు దొంగల పనిగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. గత నెలలో సోమాలియాలోని పుంట్ ల్యాండ్ రాష్ట్రంలోని గరాకాడ్ ప్రాంతం నుండి పనిచేస్తున్న ఒక కొత్త పైరేట్ ముఠా మరొక ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ప్రస్తుతానికి 'యురేకా' నౌకను సురక్షితంగా విడిపించేందుకు అంతర్జాతీయ నౌకాదళ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సముద్ర మార్గాల్లో భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారడంతో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే నౌకపై.. సొమాలియా తీరంలో పైరేట్ల దాడి
దుబాయ్: సొమాలియా పైరెట్లు మరోసారి రెచ్చిపోయారు. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తున్న నౌకపై సొమాలియా తీరానికి సమీపంలో దాడికి దిగారు. మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో నౌకపై కాల్పులకు దిగారు. మాల్టాకు చెందిన ఈ నౌక గుజరాత్‌లోని సిక్కా ఓడరేవు నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికాలోని డర్బన్ వైపు వెళ్తోందని ఆంబ్రే అనే ప్రైవేట్ భద్రతా సంస్థ తెలిపింది. నౌకలో ప్రత్యేకంగా భద్రత సిబ్బంది లేరని పేర్కొంది. అందులోని మొత్తం 24 మంది సిబ్బంది ఓడలోని ఓ గదిలో లోపలి నుంచి తాళం వేసుకుని ఉండిపోయారంది. దాడి నేపథ్యంలో నౌక మార్గం మార్చుకుని, వేగం తగ్గించుకుందని వివరించింది. సముద్రం దొంగల దాడి కొనసాగుతోందని వివరించింది. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని బ్రిటిష్ మిలటరీలోని యునైటెడ్ కింగ్డమ్ మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఇరాన్‌కు చెందిన మత్స్యకార పడవను అడ్డగించి, స్వా«దీనం చేసుకున్న పైరేట్లు దాడులకు పాల్పడుతున్నారంది. తాజాగా కేమెన్ దీవులకు చెందిన నౌకపై పైరేట్లు కాల్పులకు తెగబడ్డారని, ఓడలోని భద్రతా సిబ్బంది ప్రతిదాడికి దిగడంతో వారు తోకముడిచారని పేర్కొంది. సొమాలీ తీరంలో 2011లో అత్యధికంగా 237 దాడులు జరిగాయి. అంతర్జాతీయ సహకారం, నిఘాతో పైరేట్ల బెడద చాలా వరకు తగ్గిపోయింది. గతేడాది నాలుగు దాడులు జరిగినట్లు సమాచారం. తిరిగి ఈ ఏడాదిలో మళ్లీ దాడుల పరంపర మొదలవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ
ఢిల్లీ: ఇరాన్ ఫిషింగ్ నౌకను కాపాడిన తర్వాత భారత నౌకాదళం మరో ఆపరేషన్ చేపట్టింది. సోమాలియ దుండగుల దాడి నుంచి పాకిస్థాన్ నౌకను ఐఎన్ఎస్ యుద్ధనౌక సుమిత్రా రక్షించింది. అందులో ప్రయాణిస్తున్న 19 మంది పాకిస్థానీయులను కాపాడింది. అల్ నయీమి అనే పాకిస్థాన్‌కు చెందిన పిషింగ్ నౌకపై సామాలియాకు చెందిన 11 మంది దుండగులు దాడి చేశారు. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 800 నాటికల్ మైల్స్ దూరంలో పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేశారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. పాకిస్థాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజాకర్ల నుంచి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. ఇరాన్‌కు చెందిన ఓ ఫిషింగ్ నౌకను ఇండియన్ నేవి సిబ్బంది సోమవారం రక్షించారు. ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ సుమిత్రా.. 17 మంది ఇరాన్ దేశస్థులను రక్షించారు. ఇదీ చదవండి: ఇరాన్ నౌక హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ -
తోకముడిచిన సోమాలియా పైరేట్లు
న్యూఢిల్లీ: భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియా సరుకు నౌకను హైజాక్ చేసేందుకు సోమాలియా సముద్రపు దొంగలు చేసిన ప్రయత్నాన్ని భారత నేవీ కమాండోలు చాకచక్యంగా తిప్పికొట్టారు. అందులోని 15 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 21 మందిని కాపాడారు. ఎంవీ లిలా నార్ఫోక్ అనే ఓడను ఈ నెల 4వ తేదీన అరేబియా సముద్ర జలాల్లో ఉండగా సాయుధ దుండగులు హస్తగతం చేసుకున్నారు. ఆపదలో ఉన్నామని, ఆదుకోవాలంటూ ఓడ సిబ్బంది యునైటెడ్ కింగ్డమ్ మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీవో)పోర్టల్‌కు సమాచారం అందించారు. అందులో 15 మంది వరకు భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలియడంతో భారత నేవీ అప్రమత్తమైంది. ఆ ప్రాంతానికి ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను హుటాహుటిన పంపించింది. పైరేట్లను లొంగిపోవాలని హెచ్చరికలు చేస్తూ ఎంవీ లిలా నార్ఫోక్ను శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఐఎన్ఎస్ చెన్నై అడ్డగించింది. సుశిక్షితులైన కమాండోలతో కూడిన అత్యాధునిక గస్తీ హెలికాప్టర్ పి–81ను సైతం అధికారులు సిద్ధంగా ఉంచారు. నౌకలోని పరిస్థితులను దగ్గర్నుంచి అంచనా వేసేందుకు అత్యాధునిక ఎంక్యూ9బీ ప్రిడేటర్ డ్రోన్‌ను రంగంలోకి దించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పైఅధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే కమాండోలు ఎంవీ లిలా నార్‌ఫోక్‌లోకి మెరుపు వేగంతో ప్రవేశించారు. వారిని చూసి పైరేట్లు తోకముడిచారు. గస్తీ సిబ్బంది ఇచ్చిన గట్టి హెచ్చరికలతోనే వారు భయపడి, నౌకను హైజాక్ చేసే ప్రయత్నాన్ని విరమించుకుని, పలాయన మంత్రం పఠించారని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ చెప్పారు. నౌకలో విద్యుత్ వ్యవస్థను, చోదక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. అన్నీ పూర్తయ్యాక నౌక ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించనుందన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల స్వేచ్ఛా యానానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ఇతర దేశాల భాగస్వామ్యంతో పనిచేసేందుకు నేవీ కట్టుబడి ఉంటుందని వివరించారు. సముద్ర దొంగల బారి నుంచి తమ నౌకను రక్షించిన భారత నేవీకి లిలా గ్లోబల్ సీఈవో స్టీవ్ కుంజెర్ ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఉండగా, ఇజ్రాయెల్–హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం నౌకా రవాణాపైనా పడింది. 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియాకు చెందిన ఎంవీ చెమ్ ప్లుటో నౌకపై డిసెంబర్ 23న భారత పశ్చిమ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. భారత్ వైపు చమురుతో వస్తున్న మరో నౌకపై ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడి జరిగింది. మాల్టాకు చెందిన ఎంవీ రుయెన్ అనే నౌకను పైరేట్లు డిసెంబర్ 14న హైజాక్ చేశారు. -
ఇండియన్ షిప్ హైజాక్
న్యూఢిల్లీ: ఇండియన్ కార్గో షిప్ హైజాక్‌కు గురవడం కలకలం రేపుతోంది. 11 మంది సిబ్బందితో షిప్ దుబాయ్ నుంచి యెమెన్ వెళ్తుండగా.. సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేసి హైజాక్ చేశారు. ఏప్రిల్ 1న షిప్ హైజాక్‌కు గురైనట్లు అధికారులు నిర్థారించారు. సముద్రపు దొంగల చేతిలో బంధీలుగా ఉన్న 11 మంది కూడా ముంబైలోని మాండ్వీ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. హైజాక్ విషయాన్ని షిప్ కెప్టెన్ దుబాయ్‌లోని అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హైజాక్ ఘటనను ధృవీకరించింది. షిప్‌లోని సిబ్బందిని రక్షించడానికి చర్యలు చేపడుతున్నట్లు భారత నేవీ అధికారులు వెల్లడించారు.


