మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో కాల్పులు
దుబాయ్: సొమాలియా పైరెట్లు మరోసారి రెచ్చిపోయారు. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తున్న నౌకపై సొమాలియా తీరానికి సమీపంలో దాడికి దిగారు. మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో నౌకపై కాల్పులకు దిగారు. మాల్టాకు చెందిన ఈ నౌక గుజరాత్‌లోని సిక్కా ఓడరేవు నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికాలోని డర్బన్ వైపు వెళ్తోందని ఆంబ్రే అనే ప్రైవేట్ భద్రతా సంస్థ తెలిపింది.
నౌకలో ప్రత్యేకంగా భద్రత సిబ్బంది లేరని పేర్కొంది. అందులోని మొత్తం 24 మంది సిబ్బంది ఓడలోని ఓ గదిలో లోపలి నుంచి తాళం వేసుకుని ఉండిపోయారంది. దాడి నేపథ్యంలో నౌక మార్గం మార్చుకుని, వేగం తగ్గించుకుందని వివరించింది. సముద్రం దొంగల దాడి కొనసాగుతోందని వివరించింది. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని బ్రిటిష్ మిలటరీలోని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవల ఇరాన్‌కు చెందిన మత్స్యకార పడవను అడ్డగించి, స్వా«దీనం చేసుకున్న పైరేట్లు దాడులకు పాల్పడుతున్నారంది. తాజాగా కేమెన్ దీవులకు చెందిన నౌకపై పైరేట్లు కాల్పులకు తెగబడ్డారని, ఓడలోని భద్రతా సిబ్బంది ప్రతిదాడికి దిగడంతో వారు తోకముడిచారని పేర్కొంది. సొమాలీ తీరంలో 2011లో అత్యధికంగా 237 దాడులు జరిగాయి. అంతర్జాతీయ సహకారం, నిఘాతో పైరేట్ల బెడద చాలా వరకు తగ్గిపోయింది. గతేడాది నాలుగు దాడులు జరిగినట్లు సమాచారం. తిరిగి ఈ ఏడాదిలో మళ్లీ దాడుల పరంపర మొదలవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


