బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మహమ్మద్ యూనస్‌కు ఏమాత్రం రాజకీయానుభవం లేకపోవడం బంగ్లాదేశ్‌కు శాపంగా మారిందని మాజీ ప్రధాని షేక్ హసీనా అంటున్నారు. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రతిష్ట నానాటికీ దిగజారిపోతుందని.. భారత్‌లాంటి మిత్రదేశాలతో సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారామె.
గతవారం బంగ్లాదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాడికల్ యువ నేత షరీఫ్ ఉస్మాన్ హాది (32)ని ఓ దుండగుడు కాల్చి చంపాడు. తదనంతరం చెలరేగిన ఘర్షణల్లో.. దీపు చంద్ర దాస్ (27) అనే హిందూ యువకుడు అతికిరాతకంగా మూక హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలపై ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు.
ముహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వ పాలనను అత్యంత బలహీనంగా ఉందని.. అక్కడ చట్టాలేవీ అమల్లో లేవని అన్నారామె. ‘‘అల్లర్లు.. మైనారిటీలపై దాడులు బంగ్లాదేశ్ స్థిరత్వాన్ని దెబ్బ తీస్తాయి. ప్రపంచం దృష్టిలో ప్రతిష్ట దిగజారిపోతుంది. మరీ ముఖ్యంగా భారత్‌లాంటి పొరుగు దేశాలతో సంబంధాలను కూడా బలహీనపరుస్తాయి’’ అని అభిప్రాయపడ్డారామె.
గత కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని.. భారత్ ఈ పరిస్థితిని అల్లకల్లోలంగా చూస్తోందని అన్నారామె. అయితే.. బంగ్లాదేశ్ అన్ని మతాలను గౌరవించే దేశమని.. కానీ, కొంతమంది మూర్ఖుల వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రజాస్వామ్యం తిరిగి స్థాపితమైతే, ఇలాంటి అశాంతి ముగుస్తుందని అభిప్రాయపడ్డారామె.
యూనస్ ప్రభుత్వం జమాత్-ఇ-ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తివేయడం, తీవ్రవాదులను కేబినెట్‌లో చేర్చుకోవడం. జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయడం వంటి చర్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తీవ్రవాద శక్తులు యూనస్‌ను ఉపయోగించుకుంటన్నాయని.. ఇది భారత్ సహా ప్రతీ దక్షిణాసియా దేశానికి ఆందోళన కలిగించే అంశమని అన్నారామె.


